
న్యూఢిల్లీ: అపోలో హాస్పిటల్స్ నికర లాభం జనవరి–మార్చి త్రైమాసిక కాలంలో 43 శాతం తగ్గింది. 2016–17 క్యూ4లో రూ.62 కోట్లుగా ఉన్న నికర లాభం (కన్సాలిడేటెడ్) ఈ సారి రూ.36 కోట్లకు తగ్గినట్లు అపోలో హాస్పిటల్స్ తెలిపింది. ఆదాయం రూ.1,857 కోట్ల నుంచి 14 శాతం వృద్ధితో రూ.2,111 కోట్లకు పెరిగిందని సంస్థ చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి తెలిపారు. రూ.5 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.5 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని చెప్పారు. ‘‘స్టాండ్ ఆలోన్ ప్రాతిపదికన చూస్తే, కంపెనీ నికర లాభం 24 శాతం పెరిగింది. 2017–18లో క్యూ4లో ఇది 60 కోట్లు కాగా... అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో రూ.48 కోట్లే. మొత్తం ఆదాయం రూ.1,625 కోట్ల నుంచి 15 శాతం వృద్ధితో రూ.1,863 కోట్లకు చేరింది’’ అని వివరించారు. మొత్తం వ్యయాలు 13 శాతం పెరిగి రూ.1,785 కోట్లకు చేరాయన్నారు.
ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.216 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 46 శాతం తగ్గి రూ.117 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ.7,256 కోట్ల నుంచి 14 శాతం వృద్ధితో రూ.8,243 కోట్లకు పెరిగింది. బాధ్యతాయుత ఆరోగ్య సంరక్షణ సంస్థగా తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నామని ఫలితాల వెల్లడి సందర్భంగా ప్రతాప్ రెడ్డి చెప్పారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో అపోలో హాస్పిటల్స్ షేరు 2 శాతం నష్టంతో రూ.984 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment