గృహ రుణం ప్రీపేమెంట్ చేస్తున్నారా?
గృహ రుణం అనేది ఒక్క రోజుతో తీరిపోయేది కాదు. చాలా సంవత్సరాల పాటు కొనసాగుతుంటుంది. ఈ క్రమంలో కొన్నిసార్లు ఈఎంఐలు కట్టడం భారం కావొచ్చు. అలాంటప్పుడు అనుకోకుండా పెద్ద మొత్తం ఎప్పుడైనా చేతికి వస్తే ముందుగా.. గృహ రుణాన్ని ప్రీ-పేమెంట్ చేసి కొంతైనా భారం తగ్గించుకోవాలనుకుంటాం. మరి అలాంటి సందర్భాల్లో ఏయే అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి? గరిష్టంగా ఎలా ప్రయోజనం పొందవచ్చు? అన్నది తెలియచెప్పేదే ఈ కథనం.
అత్యవసర పరిస్థితుల కోసం ప్రణాళిక..
గృహ రుణం అనేది ఒకటి రెండేళ్లలో తీరేది కాదు. దీర్ఘకాలం కొనసాగుతుంది. భవిష్యత్‌లో ఏదైనా ఇతర రుణం తీసుకోవాలన్నా దానిపై కూడా ఇది ప్రభావం చూపుతుంది. ఇప్పటికే ఒక భారీ గృహ రుణం ఉన్నందున భవిష్యత్‌లో మరో రుణం తీసుకోవడం కొంత కష్టం కావొచ్చు. గతంలో డిఫాల్ట్ అయిన పక్షంలో ఒకవేళ ఎలాగోలా రుణం దక్కించుకున్నా, వడ్డీ రేటు భారీగా ఉంటుంది.
దీనికితోడు రుణం మొత్తం తీరేలోగా ఇతరత్రా ఏవో అత్యవసరాలు వస్తూనే ఉంటాయి. వీటి కారణంగా ఒకోసారి ఈఎంఐల చెల్లింపు కష్టం కూడా కావొచ్చు. ఇలా జరగకుండా ఉండాలంటే.. కనీసం ఆరు నెలల ఈఎంఐ మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ గా ఉంచడం గానీ లేదా అవసరమైన వెంటనే నగదుగా మార్చుకోగలిగే వీలు కల్పించే సాధనంలో గానీ ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఈ మొత్తం పోగా మిగతా డబ్బును ప్రీపేమెంటు కోసం ఉపయోగించవచ్చు.
గృహ రుణాన్ని మరో బ్యాంకుకు బదిలీ చేయడం..
కొన్ని సార్లు మీరు రుణం తీసుకున్న బ్యాంకుకన్నా మరో బ్యాంకు తక్కువ వడ్డీ రేటుపై లోన్లు ఇస్తుంటాయి. అడిగితే ప్రస్తుత బ్యాంకు కూడా వడ్డీ రేటు తగ్గించే అవకాశాలూ ఉన్నాయి. అలా కుదరనప్పుడు మీ లోన్‌ను సదరు బ్యాంకుకు బదలాయించవచ్చు. అయితే ఇలా చేసేటప్పుడు కొత్త బ్యాంకు వసూలు చేసే ప్రాసెసింగ్ ఫీజు, వర్తించే స్టాంపు డ్యూటీ మొదలైన ఖర్చులను పరిగణనలోకి తీసుకోవాలి. ఒకవేళ కొత్త బ్యాంకుకు బదలాయించే ఖర్చులకన్నా తక్కువగా.. కొంత ఫీజుతో ప్రస్తుత బ్యాంకే వడ్డీ రేటు తగ్గించేందుకు ఒప్పుకుంటే, దానితోనే కొనసాగవచ్చు.
అనిల్ కొత్తూరి
సీఈవో, ఎడెల్‌వీస్ హౌసింగ్ ఫైనాన్స్
తీర్చే ముందు చూడాల్సిందేమంటే..
* అనుకోకుండా వచ్చిన డబ్బును గృహ రుణానికి ప్రీ-పేమెంట్‌గా చెల్లించే ముందు గమనించాల్సిందేమిటంటే ఒక్కసారి ప్రీ-పే చేసిన తర్వాత ఆ మొత్తాన్ని మళ్లీ వెనక్కి తీసుకోవడం కుదరదు. కాబట్టి ఆ డబ్బు ఇక మన చేతిలో లేనట్లే. ఆ తర్వాతెప్పుడైనా ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినా, ఇతరత్రా ఏ అవసరాలు వచ్చినా ఆ డబ్బు అందుబాటులో ఉండదు.
* కాబట్టి మంచి రాబడినిచ్చే పెట్టుబడి సాధనం ఏదైనా అందుబాటులో ఉంటే.. అందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల వచ్చే రాబడులను .. ప్రీపేమెంటు వల్ల వచ్చే ప్రయోజనాలను బేరీజు వేసుకోవాలి. హోమ్ లోన్ తీర్చేయడం వల్ల వచ్చే ప్రయోజనాల కన్నా ఇతర సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తే వచ్చే రాబడి ఎక్కువగా ఉన్న పక్షంలో అటువైపు మొగ్గుచూపడం ఉత్తమం. దీనివల్ల ఆర్థిక ప్రయోజనంతో పాటు ఇతరత్రా అవసరాలేమైనా తలెత్తినప్పుడు ఉపయోగించుకోవడానికి మన డబ్బు కూడా మనకు అందుబాటులో ఉంటుంది.
* ఫిక్స్‌డ్ రేటుపై తీసుకున్న రుణాన్ని ముందస్తుగా చెల్లించేస్తే.. ప్రీపేమెంట్ పెనాల్టీ కట్టాల్సి రావొచ్చు. కనుక, దీన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
* ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్నాక కూడా రుణాన్ని ప్రీపేమెంటు చేయదల్చుకున్న పక్షంలో రీషెడ్యూలింగ్‌కి సంబంధించి మీ ముందు రెండు చాయిస్‌లు ఉంటాయి. మొదటిదేంటంటే.. నెలవారీ ఈఎంఐ మొత్తాన్ని ఇప్పుడు కడుతున్నంతే చెల్లింపులు కొనసాగించడం. దీనివల్ల ముందుగా నిర్దేశించుకున్న గడువుకన్నా ముందే మీ రుణం తీరుతుంది. రెండోది ప్రతి నెలా కట్టే ఈఎంఐ పరిమాణాన్ని కొంత తగ్గించుకోవడం. తద్వారా ముందుగా పెట్టుకున్న గడువు నాటికి రుణం తీరుతుంది. అయితే, కట్టాల్సిన ఈఎంఐ భారం కొంత తగ్గుతుంది.
* పెరిగే నెలవారీ ఖర్చుల కోసం మరింత డబ్బు అవసరమవుతున్న పక్షంలో రెండో చాయిస్‌ను ఎంచుకోవచ్చు. అలా కాని పక్షంలో యథాప్రకారంగా అదే ఇన్‌స్టాల్‌మెంట్ కొనసాగిస్తూ రుణా న్ని గడువుకు ముందుగానే తీర్చేయవచ్చు.