anil kotturi
-
ఇంటి రుణం... ఇలా సులభం
మీరు గృహ రుణం తీసుకుంటున్నారా? అయితే పలు పత్రాలు, వివరాలు అందజేయక తప్పదు. వీటి ఆధారంగానే సదరు సంస్థ... రుణం తీసుకునే వారి ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకోగలుగుతుంది. అటుపై మళ్లీ ముఖాముఖిగా మీతో భేటీ అవుతుంది. దీన్నే సాధారణంగా పర్సనల్ డిస్కషన్ అంటుంటారు. ఈ డిస్కషన్ చాలా కీలకమైనది. రుణం మంజూరవుతుందా... లేదా? ఎంత మొత్తం లభిస్తుంది? మొదలైన అంశాలన్నీ ఇందులో చర్చకు వస్తాయి. అత్యంత ప్రాధాన్యమున్న పర్సనల్ డిస్కషన్ ప్రధాన ఉద్దేశంపై అవగాహన కల్పించేదే ఈ కథనం. కచ్చితమైన ఆదాయాన్ని మదింపు చేయడం.. సాధారణంగా రుణదాత సంస్థకు (లెండరు) ఇచ్చే స్టేట్మెంట్స్లో మీ ఆదాయ వివరాలున్నప్పటికీ... రుణ చెల్లింపునకు ఉపయోగపడేలా ఇతరత్రా ఆదాయ మార్గాలు ఇంకా ఏమైనా ఉన్నాయా అన్నది తెలుసుకోవడానికి ఈ డిస్కషన్ తోడ్పడుతుంది. మీ స్టేట్మెంట్స్లో ప్రతిబింబించని డిపాజిట్లు, ఇతరత్రా ఆర్థిక సాధనాలు మొదలైనవి ఏవైనా ఉంటే ఈ సమావేశం ద్వారా తెలుసుకుని, తదనుగుణంగా మీ కచ్చితమైన ఆదాయాన్ని మదింపు చేసే వీలుంటుంది. మీ ఆస్తుల నికర విలువను అంచనా వేయడం.. మీకేవైనా ఆస్తులు ఉంటే ఆ వివరాలు, వాటి విషయంలో మీ ప్రణాళికల గురించి రుణ దాత అడగవచ్చు. ఒకవేళ రెగ్యులర్‌గా వచ్చే ఆదాయానికి ఏదైనా అవాంతరం ఏర్పడినా... రుణాన్ని తిరిగి చెల్లించేందుకు తగిన ఆర్థిక స్థోమత ఉందా లేదా అన్నది నిర్ధారించుకోవడమే ఈ ప్రశ్నల లక్ష్యం. మీ వ్యాపార స్వభావం గురించి తెలుసుకోవడం స్వయం ఉపాధి పొందుతున్న వారి ఆదాయాలు ఒకోసారి హెచ్చుతగ్గులకు లోనవుతుంటాయి. అటువంటి వారి వ్యాపారాల స్వభావం, ఎదురయ్యే ఒత్తిళ్లు మొదలైన వాటి గురించి లెండరు తెలుసుకుంటారు. వీటిని బట్టి నిలకడగా నెలవారీ వాయిదాలు చెల్లించగలరా లేదా అన్న దానిపై నిర్ధారణకు వస్తారు. వ్యయాలు అంచనా వేయడం.. ఒక్కొక్కరికీ ఒక్కో జీవన విధానం.. దానికి తగ్గట్లుగా ఖర్చులు ఉంటాయి. కనుక మీ ఖర్చుల తీరుతెన్నుల గురించి తెలుసుకున్న మీదట మీరు నెలవారీ వాయిదా ఎంత మేర చెల్లించగలరన్నది లెండరు అంచనా వేస్తారు. అలాగే, మీరు ఇతరత్రా రుణాలేమైనా ఇప్పటికే చెల్లిస్తున్న పక్షంలో మీరు కొత్తగా గృహ రుణం తీసుకుంటే అది మరింత భారం అవుతుందా లేక మీరు సమర్థంగా చెల్లించగలుగుతారా లేదా అన్నది కూడా చూస్తారు. భవిష్యత్ అవకాశాలు.. మీరు ఉద్యోగులైనా, వ్యాపారస్తులైనా భవిష్యత్‌లో వృద్ధి అవకాశాల గురించి లెండరు తెలుసుకుంటారు. మం జూరయ్యే రుణ మొత్తంతో పాటు భవిష్యత్‌లో నెలవారీ చెల్లించాల్సిన వాయిదా మొత్తాన్ని పెంచుకునే అవకాశాలు దీని వల్ల మదింపు చేయడానికి వీలవుతుంది. పర్సనల్ డిస్కషన్‌ను ఎదుర్కొనేందుకు భారీగా కసరత్తు చేయాల్సిన అవసరమేమీ లేదు. అయితే, కొన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుంటే మంచిది. అవేంటంటే.. నిజాయితీగా వివరాలు చెప్పండి మిగతా అన్ని చోట్లలాగే గృహ రుణం ఇచ్చే లెండరు దగ్గరా నిజాయితీగా వివరాలు చెప్పడం మంచిది. ప్రస్తుతం ఇంటర్నెట్లో సమాచారమంతా అందుబాటులో ఉంటున్న నేపథ్యంలో అన్ని విషయాలు ఉన్నవి ఉన్నట్లుగా లెండరుకు వివరించడం మంచిది. అబద్ధం చెప్పినట్లు గానీ, ఏవైనా కీలక విషయాలు చెప్పకుండా దాచిపెట్టినట్లు గానీ తేలితే అది రుణ మంజూరీపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అన్ని పత్రాలు దగ్గరుంచుకోండి... లెండరు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలతో పాటు అవసరమైన పత్రాలు అన్నీ అందించిన పక్షంలో రుణ మంజూరు ప్రక్రియ వేగంగా జరుగుతుంది. ధీమాగా ఉండండి.. చిట్టచివరిగా చెప్పేదేమిటంటే.. ఈ ప్రక్రియ గురించి కంగారు, ఆందోళన చెందనవసరం లేదు. ధీమాగా వ్యవహరించండి. రుణం తీసుకోవాలంటే ఒక కస్టమరుగా.. మీకు మార్కెట్లో బోలెడన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీరు చేయాల్సిందల్లా మీ ఆర్థిక స్థితిగతుల గురించిన వివరాలను స్పష్టంగా, ఆత్మవిశ్వాసంతో వివరించడమే. - అనిల్ కొత్తూరి సీఈవో,ఎడెల్వీజ్ హౌసింగ్ ఫైనాన్స్ -
గృహ రుణం ప్రీపేమెంట్ చేస్తున్నారా?
గృహ రుణం అనేది ఒక్క రోజుతో తీరిపోయేది కాదు. చాలా సంవత్సరాల పాటు కొనసాగుతుంటుంది. ఈ క్రమంలో కొన్నిసార్లు ఈఎంఐలు కట్టడం భారం కావొచ్చు. అలాంటప్పుడు అనుకోకుండా పెద్ద మొత్తం ఎప్పుడైనా చేతికి వస్తే ముందుగా.. గృహ రుణాన్ని ప్రీ-పేమెంట్ చేసి కొంతైనా భారం తగ్గించుకోవాలనుకుంటాం. మరి అలాంటి సందర్భాల్లో ఏయే అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి? గరిష్టంగా ఎలా ప్రయోజనం పొందవచ్చు? అన్నది తెలియచెప్పేదే ఈ కథనం. అత్యవసర పరిస్థితుల కోసం ప్రణాళిక.. గృహ రుణం అనేది ఒకటి రెండేళ్లలో తీరేది కాదు. దీర్ఘకాలం కొనసాగుతుంది. భవిష్యత్‌లో ఏదైనా ఇతర రుణం తీసుకోవాలన్నా దానిపై కూడా ఇది ప్రభావం చూపుతుంది. ఇప్పటికే ఒక భారీ గృహ రుణం ఉన్నందున భవిష్యత్‌లో మరో రుణం తీసుకోవడం కొంత కష్టం కావొచ్చు. గతంలో డిఫాల్ట్ అయిన పక్షంలో ఒకవేళ ఎలాగోలా రుణం దక్కించుకున్నా, వడ్డీ రేటు భారీగా ఉంటుంది. దీనికితోడు రుణం మొత్తం తీరేలోగా ఇతరత్రా ఏవో అత్యవసరాలు వస్తూనే ఉంటాయి. వీటి కారణంగా ఒకోసారి ఈఎంఐల చెల్లింపు కష్టం కూడా కావొచ్చు. ఇలా జరగకుండా ఉండాలంటే.. కనీసం ఆరు నెలల ఈఎంఐ మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ గా ఉంచడం గానీ లేదా అవసరమైన వెంటనే నగదుగా మార్చుకోగలిగే వీలు కల్పించే సాధనంలో గానీ ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఈ మొత్తం పోగా మిగతా డబ్బును ప్రీపేమెంటు కోసం ఉపయోగించవచ్చు. గృహ రుణాన్ని మరో బ్యాంకుకు బదిలీ చేయడం.. కొన్ని సార్లు మీరు రుణం తీసుకున్న బ్యాంకుకన్నా మరో బ్యాంకు తక్కువ వడ్డీ రేటుపై లోన్లు ఇస్తుంటాయి. అడిగితే ప్రస్తుత బ్యాంకు కూడా వడ్డీ రేటు తగ్గించే అవకాశాలూ ఉన్నాయి. అలా కుదరనప్పుడు మీ లోన్‌ను సదరు బ్యాంకుకు బదలాయించవచ్చు. అయితే ఇలా చేసేటప్పుడు కొత్త బ్యాంకు వసూలు చేసే ప్రాసెసింగ్ ఫీజు, వర్తించే స్టాంపు డ్యూటీ మొదలైన ఖర్చులను పరిగణనలోకి తీసుకోవాలి. ఒకవేళ కొత్త బ్యాంకుకు బదలాయించే ఖర్చులకన్నా తక్కువగా.. కొంత ఫీజుతో ప్రస్తుత బ్యాంకే వడ్డీ రేటు తగ్గించేందుకు ఒప్పుకుంటే, దానితోనే కొనసాగవచ్చు. అనిల్ కొత్తూరి సీఈవో, ఎడెల్వీస్ హౌసింగ్ ఫైనాన్స్ తీర్చే ముందు చూడాల్సిందేమంటే.. * అనుకోకుండా వచ్చిన డబ్బును గృహ రుణానికి ప్రీ-పేమెంట్‌గా చెల్లించే ముందు గమనించాల్సిందేమిటంటే ఒక్కసారి ప్రీ-పే చేసిన తర్వాత ఆ మొత్తాన్ని మళ్లీ వెనక్కి తీసుకోవడం కుదరదు. కాబట్టి ఆ డబ్బు ఇక మన చేతిలో లేనట్లే. ఆ తర్వాతెప్పుడైనా ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినా, ఇతరత్రా ఏ అవసరాలు వచ్చినా ఆ డబ్బు అందుబాటులో ఉండదు. * కాబట్టి మంచి రాబడినిచ్చే పెట్టుబడి సాధనం ఏదైనా అందుబాటులో ఉంటే.. అందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల వచ్చే రాబడులను .. ప్రీపేమెంటు వల్ల వచ్చే ప్రయోజనాలను బేరీజు వేసుకోవాలి. హోమ్ లోన్ తీర్చేయడం వల్ల వచ్చే ప్రయోజనాల కన్నా ఇతర సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తే వచ్చే రాబడి ఎక్కువగా ఉన్న పక్షంలో అటువైపు మొగ్గుచూపడం ఉత్తమం. దీనివల్ల ఆర్థిక ప్రయోజనంతో పాటు ఇతరత్రా అవసరాలేమైనా తలెత్తినప్పుడు ఉపయోగించుకోవడానికి మన డబ్బు కూడా మనకు అందుబాటులో ఉంటుంది. * ఫిక్స్డ్ రేటుపై తీసుకున్న రుణాన్ని ముందస్తుగా చెల్లించేస్తే.. ప్రీపేమెంట్ పెనాల్టీ కట్టాల్సి రావొచ్చు. కనుక, దీన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. * ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్నాక కూడా రుణాన్ని ప్రీపేమెంటు చేయదల్చుకున్న పక్షంలో రీషెడ్యూలింగ్‌కి సంబంధించి మీ ముందు రెండు చాయిస్‌లు ఉంటాయి. మొదటిదేంటంటే.. నెలవారీ ఈఎంఐ మొత్తాన్ని ఇప్పుడు కడుతున్నంతే చెల్లింపులు కొనసాగించడం. దీనివల్ల ముందుగా నిర్దేశించుకున్న గడువుకన్నా ముందే మీ రుణం తీరుతుంది. రెండోది ప్రతి నెలా కట్టే ఈఎంఐ పరిమాణాన్ని కొంత తగ్గించుకోవడం. తద్వారా ముందుగా పెట్టుకున్న గడువు నాటికి రుణం తీరుతుంది. అయితే, కట్టాల్సిన ఈఎంఐ భారం కొంత తగ్గుతుంది. * పెరిగే నెలవారీ ఖర్చుల కోసం మరింత డబ్బు అవసరమవుతున్న పక్షంలో రెండో చాయిస్‌ను ఎంచుకోవచ్చు. అలా కాని పక్షంలో యథాప్రకారంగా అదే ఇన్స్టాల్మెంట్ కొనసాగిస్తూ రుణా న్ని గడువుకు ముందుగానే తీర్చేయవచ్చు. -
ఎడల్వీస్ 500 కోట్ల ఎన్సీడీ ఇష్యూ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆర్థిక సేవల రంగంలో ఉన్న ఎడల్వీస్ అనుబంధ కంపెనీ ఈసీఎల్ ఫైనాన్స్ రూ.500 కోట్ల నాన్ కన్వర్టబుల్ డిబెం చర్స్ను జారీ చేస్తోంది. ఈ ఇష్యూ ద్వారా సేకరించిన మొత్తాన్ని వ్యాపార విస్తరణకు వినియోగించనున్నట్లు ఎడల్వీస్ టోక్యో లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో దీపక్ మిట్టల్ తెలిపారు. ఎన్సీడీ ఇష్యూ వివరాలను తెలియచేయడానికి శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 3, 5 ఏళ్ల కాలపరిమితిలో జారీ చేస్తున్న ఈ ఎన్‌సీడీలపై వరుసగా 11.6%, 11.85% వడ్డీని ఆఫర్ చేస్తున్నట్లు తెలిపారు. రూ.1,000 ముఖ విలువ కలిగిన ఈ బాండ్లను కనీసం పది కొనాల్సి ఉంటుంది. జనవరి 16న ఈ ఇష్యూ ప్రారంభమవుతుందని, జనవరి 27 వరకు చివరి తేదీ ఉన్నప్పటికీ ఓవర్‌సబ్‌స్క్రైబ్ అయితే ముందుగానే ముగిస్తామన్నారు. ప్రస్తుతం రిటైల్, ఎస్ఎంఈ రంగాలపై అధికంగా దృష్టిసారిస్తున్నామని, వడ్డీ లాభదాయకతపై ఎటువంటి ఒత్తిడి లేదని ఎడల్వీస్ రిటైల్ ఫైనాన్స్ హెడ్ అనిల్ కొత్తూరి తెలిపారు. ఈ ఇష్యూకి కేర్ ఏఏ రేటింగ్ ఇచ్చింది.