
నల్లధనంతో...తీవ్ర పరిణామాలు తప్పవు
♦ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ హెచ్చరిక
♦ ప్రస్తుత పథకాన్ని వినియోగించాలని సూచన
న్యూఢిల్లీ: నల్లధనం దాచిపెట్టుకునేవారు తీవ్ర పరిణామాలు ఎదుర్కొనక తప్పదని ఆర్థికమంత్రి గురువారం అరుణ్‌జైట్లీ హెచ్చరించారు. నల్లధనం వెల్లడి, 45 శాతం పన్ను చెల్లింపు, ప్రాసిక్యూషన్ నుంచి మినహాయింపుకు సంబంధించి సెప్టెంబర్ వరకూ అమలు జరిగే ప్రస్తుత పథకాన్ని ఉపయోగించుకోవాలనీ ఆయన సూచించారు. ఇప్పటికీ తన విదేశీ ఆస్తుల వివరాలు వెల్లడించని వారు తొందరపడాలని పేర్కొన్నారు.
నల్లధనం నిరోధం ఇప్పుడు కేవలం భారత్‌కు సంబంధించిన అంశమే కాదనీ, జీ-20, యూఎస్ డొమేస్టిక్ లా వంటి చొరవలతో అంతర్జాతీయంగా ఈ సమస్య పరిష్కారానికి కృషి జరుగుతోందని ఫిక్కీ ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో జైట్లీ పేర్కొన్నారు. సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం మొదలయిన తర్వాత విదేశాల్లో రహస్య ఆస్తులను కనిపెట్టడం కూడా పెద్ద కష్టం కాబోదని జైట్లీ ఈ సందర్భంగా అన్నారు.
బస్సు పోగొట్టుకోవద్దు...
ప్రస్తుత పథకాన్ని జైట్లీ ఉదహరిస్తూ, ‘ ప్రస్తుత బస్సు పోగొట్టుకుంటే, చాలా పోగొట్టుకుంటారు’ అని హెచ్చరించారు. పన్ను ఎగవేతలను సహించేది లేదని, ప్రస్తుత ఆదాయపు పన్ను శాఖ సాంకేతిక అభివృద్ధి తప్పు చేస్తున్నవారు ఎక్కడ ఉన్నా పట్టిస్తుందని తెలిపారు. వస్తు, సేవల పన్ను విధానం అమలు పన్ను ఎగవేతల దిశలో మరో కీలక అడుగవుతుందని అన్నారు. రానున్న నాలుగు సంవత్సరాల్లో ప్రస్తుత 30 శాతం కార్పొరేట్ పన్నును 25 శాతానికి కేంద్రం తగ్గిస్తుందని, ఇది ప్రపంచస్థాయి పోటీపూర్వక పరిస్థితికి అవసరమని అన్నారు. కాగా నల్లధనం వెల్లడి పథకం మరోసారి ఉండబోదని రెవెన్యూ కార్యదర్శి హాస్‌ముఖ్ ఆదియా ఈ సందర్భంగా పేర్కొన్నారు.