త్వరలో కొత్త ఐటీఆర్‌ల ఈ-ఫైలింగ్
న్యూఢిల్లీ : కొత్తగా నోటిఫై అయిన ఐటీఆర్-2 లేదా ఐటీఆర్-2ఏ ఫామ్స్ ద్వారా, 2015-16 అసెస్‌మెంట్ ఇయర్‌కు ఆన్‌లైన్ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడంకోసం నిరీక్షిస్తున్న పన్ను చెల్లింపుదారులకు మరికొన్ని రోజులు ఈ నిరీక్షణ తప్పదు. తన అధికారిక వెబ్‌సైట్‌పై ఈ సౌలభ్యాన్ని ఆవిష్కరించే ప్రక్రియలో ఆదాయపు పన్ను శాఖ ప్రస్తుతం కసరత్తు చేస్తోంది. కాగా మరో రెండు ఐటీఆర్‌లు- ఐటీఆర్-1, ఐటీఆర్-4ఎస్‌ల ఫైలింగ్ సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. అధికారిక ఈ- ఫైలింగ్ వెబ్‌సైట్ https://incometaxindiaefiling.gov.in ద్వారా వీటిని సమర్పించవచ్చు.
మూడు పేజీల సరళతర దరఖాస్తు (ఐటీఆర్-2, ఐటీఆర్-2ఏ)సహా ఐటీఆర్ ఫారమ్‌ల తాజా సెట్‌ను ఈ వారం మొదట్లో ఐటీ శాఖ నోటిఫై చేసింది. ఆగస్టు 31 వరకూ ఐటీఆర్ ఈ-ఫైలింగ్ చేయవచ్చు. బ్యాంక్ అకౌంట్ల వివరాలు, విదేశీ పర్యటనల వంటి అంశాలను జోడించాలని నిర్దేశిస్తూ, గతంలో నోటిఫై చేసిన ఐటీఆర్ దరఖాస్తుల విషయమై తీవ్ర విమర్శలు తలెత్తాయి. దీనితో ఆ ఫారమ్స్‌ను ఆర్థికమంత్రిత్వశాఖ ఉపసంహరించుకుని, కొత్త ఈ-రిటర్న్స్ దరఖాస్తులను నోటిఫై చేసింది. ఇందుకు అనుగుణంగా కొత్త గడువును ఆగస్టు వరకూ పొడిగించింది.
పన్నుల స్క్రూటినీపై అసెసీలకు ఆందోళన వద్దు
స్క్రూటినీ కోసం ఎంపిక చేసే పన్నుల కేసుల విషయంలో అసెసీలు భయాందోళనలకు గురికావాల్సిన పని లేదని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్‌పర్సన్ అనితా కపూర్ చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తిగా ఎలక్ట్రానిక్ పద్ధతిలో యాంత్రికంగా జరుగుతుందే తప్ప, ఇందులో అసెసింగ్ అధికారుల (ఏవో) ప్రమేయం ఏమీ ఉండదని వివరించారు.