
న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018–19) 7.3 శాతం వృద్ధిని నమోదుచేసుకుంటుందని భావిస్తున్నట్లు ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) తన తాజా నివేదికలో అంచనావేసింది. రానున్న ఆర్థిక సంవత్సరం ఈ రేటును 7.6 శాతంగా విశ్లేషించింది. తద్వారా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా తన హోదాను కొనసాగిస్తుందని వివరించింది. ఏడీబీ 2018 అవుట్‌లోక్‌లో ఈ మేరకు వివరించిన అంశాలను చూస్తే...
►వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అమల్లో తొలుగుతున్న అవరోధాలు, బ్యాంకింగ్ సంస్కరణలు భారత్ వృద్ధికి దోహదపడే పటిష్ట అంశాల్లో కొన్ని.
►భారత్‌లో కేంద్ర ప్రభుత్వం పలు సంస్కరణలు తీసుకువస్తోంది. దీనివల్ల దేశం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మరింతగా ఆకర్షించగలుగుతుంది. దేశంలో వ్యాపార అవకాశాలకు సంబంధించిన గ్లోబల్ ర్యాంక్ (130 నుంచి 100కు ప్రపంచబ్యాంక్ రేటింగ్) మెరుగుపడ్డం కూడా గమనార్హం.
►భారత్‌కు కొన్ని కీలక సవాళ్లూ ఉన్నాయి. బ్యాంకింగ్ మొండి బకాయిలు, క్రూడ్ ధరల అప్‌ట్రెండ్ సమస్యలు ఇందులో ప్రధానమైనవి. అమెరికా టారిఫ్‌ల పెంపు పెద్దగా ప్రభావం చూపే అవకాశంలేనప్పటికీ, కొంత అప్రమత్తంగా ఉండడం మంచిది.
►ద్రవ్యోల్బణం సమస్యలు, అమెరికా ఫెడ్ వడ్డీరేటు పెంపు, ద్రవ్యలోటు లక్ష్యాలు నీరుగారడం వంటి అంశాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటు మరింత తగ్గించడానికి అవరోధాలు. 2018లో యథాతథ పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది.
► 2018లో భారత్ ద్రవ్యోల్బణం సగటున 4.6 శాతం, వచ్చే ఏడాది 5 శాతం ఉండే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment