కోవిడ్-19 కట్టడికి విధించిన లాక్‌డవున్ కారణంగా సవాళ్లు ఎదుర్కొంటున్న కార్పొరేట్లకు అండగా ఫెడరల్ రిజర్వ్ సహాయక ప్యాకేజీలో సవరణలు చేపట్టింది. తద్వారా అర్హతగల అన్ని కార్పొరేట్ బాండ్ల కొనుగోలుకి బ్యాంకులకు వీలు చిక్కనుంది. ఇందుకు వీలుగా బ్యాంకుల వద్ద ఇప్పటికే పేరుకుపోయిన పలు కార్పొరేట్ బాండ్లను కొనుగోలు చేయడం ద్వారా ఫెడ్ మరిన్ని నిధులను బ్యాంకింగ్ వ్యవస్థలోకి పంప్‌చేయనుంది. ఈ వార్తలతో సోమవారం యూఎస్ మార్కెట్లు తొలుత ఏర్పడ్డ భారీ నష్టాల నుంచి బయటపడ్డాయి. చివరికి లాభాలతో నిలిచాయి. తొలుత 600 పాయింట్లు పతనమైన డోజోన్స్ చివర్లో 158 పాయింట్లు(0.6 శాతం) పుంజుకుని 25,763 వద్ద నిలిచింది. ప్రస్తుతం డో ఫ్యూచర్స్ మరో 250 పాయింట్ల లాభంతో కదులుతోంది. ఇక ఎస్‌అండ్‌పీ 25 పాయింట్లు(0.85 శాతం) బలపడి 3,067 వద్ద స్థిరపడగా.. ఫ్యూచర్స్ 1.4 శాతం ఎగసింది. ఇక.. నాస్‌డాక్ 137 పాయింట్లు(1.45 శాతం) పుంజుకుని 9,726 వద్ద ముగిసింది. కాగా.. కరోనా వైరస్ కట్టడికి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ కొనుగోలుకి ఇజ్రాయెల్ ఆసక్తి చూపుతున్న వార్తలతో హెల్త్‌కేర్ దిగ్గజం మోడర్నా ఇంక్ షేరు 7.5 శాతం జంప్‌చేసింది.
ఫెడ్ చర్యలు
ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ఫెడరల్ రిజర్వ్ సోమవారం నుంచీ బ్యాంకులకు మరో అవకాశాన్ని కల్పించింది. దీనిలో భాగంగా కరోనా వైరస్ తలెత్తకముందు మంచి పనితీరు ప్రదర్శించిన కంపెనీలకు ఆర్థికంగా అండను కల్పించనుంది. 15,000 మందివరకూ ఉద్యోగులు కలిగిన లేదా 5 బిలియన్ డాలర్ల వరక ఆదాయం కలిగిన కంపెనీలకు బ్యాంకులు తాజాగా రుణాలు మంజూరు చేసేందుకు వీలు కల్పించనుంది. ఉద్యోగులను కొనసాగించడం, వ్యాపార నిర్వహణకు వీలుగా కంపెనీలకు బ్యాంకులు రుణాలందించనున్నాయి. అర్హతగల కార్పొరేట్ బాండ్లను కొనుగోలు చేసేందుకు వీలుగా 600 బిలియన్ డాలర్లను ఫెడ్ కేటాయించింది.
జోరు తీరు
యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఇచ్చిన దన్నుతో ప్రస్తుతం ఆసియా మార్కెట్లకు జోష్‌వచ్చింది. దీంతో కొరియా, జపాన్, హాంకాంగ్, ఇండొనేసియా, సింగపూర్, థాయ్‌లాండ్, తైవాన్ 4-2 శాతం మధ్య జంప్‌చేయగా.. చైనా 1 శాతం పుంజుకుంది. వరుసగా రెండో నెలలోనూ చైనాలో పరిశ్రమలు ఉత్పత్తిని పెంచినట్లు వెలువడిన వార్తలు సైతం సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment