ఏటీఅండ్‌టీ, వర్జిన్ రీఎంట్రీ! | AT&T, Virgin Media eye up India | Sakshi
Sakshi News home page

ఏటీఅండ్‌టీ, వర్జిన్ రీఎంట్రీ!

Published Tue, May 17 2016 2:21 AM | Last Updated on Thu, Oct 4 2018 7:01 PM

ఏటీఅండ్‌టీ, వర్జిన్ రీఎంట్రీ! - Sakshi

ఏటీఅండ్‌టీ, వర్జిన్ రీఎంట్రీ!

* భారత్ టెలికం మార్కెట్లో ప్రవేశానికి ప్రయత్నాలు...
* రానున్న స్పెక్ట్రం వేలాల్లో పాల్గొనేందుకూ సన్నాహాలు

న్యూఢిల్లీ: భారత్ టెలికం మార్కెట్‌పై మరోసారి విదేశీ దిగ్గజాల కన్నుపడింది. అమెరికా టెలికం అగ్రగామి ఏటీఅండ్‌టీ, వర్జిన్ మీడియాలు ఇక్కడి మార్కెట్లోకి మరోసారి అడుగుపెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఈ రెండు కంపెనీలూ ఇప్పటికే మోదీ సర్కారుకు తమ రీఎంట్రీకి సంబంధించి ఆసక్తిని వ్యక్తం చేయడంతోపాటు ప్రాథమికంగా చర్చలు కూడా జరిపినట్లు ఉన్నతస్థాయి అధికార వర్గాలు వెల్లడించాయి.

ప్రస్తుతానికి మొబైల్ వర్చువల్ నెట్‌వర్క్ ఆపరేటర్(ఎంవీఎన్‌ఓ) రూట్‌లో తమ కార్యకలాపాలను భారత్‌లో ప్రారంభించే అవకాశం ఉందని ఆయా వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడున్న టెలికం కంపెనీల నుంచి ఎయిర్‌టైమ్, బ్యాండ్‌విడ్త్(కాల్స్, డేటా కోసం)ను హోల్‌సేల్ రేట్లకు బల్క్‌లో కొనుగోలు చేసి.. సొంత బ్రాండ్ కింద టెలికం సేవలను ఆఫర్ చేయడాన్ని ఎంవీఎన్‌ఓగా పేర్కొంటారు. వర్జిన్ మీడియాను రిచర్డ్ బ్రాన్సన్ స్థాపించగా.. ప్రస్తుతం దీని నియంత్రణ అంతా 18.3 బిలియన్ డాలర్ల విలువైన లిబర్టీ గ్లోబల్ చేతిలో ఉంది. ఇక ఏటీఅండ్‌టీ కంపెనీ విలువ 147 బిలియన్ డాలర్లుగా అంచనా.
 
భారీ గేమ్‌ప్లాన్‌తోనే...
దేశీ టెలికం రంగంలోకి తిరిగి అడుగుపెట్టాలని భావిస్తున్న విదేశీ కంపెనీలు రానున్నకాలంలో భారీస్థాయిలో విస్తరించే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఏటీఅండ్‌టీ ఈ ఏడాది ద్వితీయార్ధంలో జరిగే మెగా స్పెక్ట్రం వేలంలో బిడ్డింగ్‌పై దృష్టిసారిస్తున్నట్లు సమాచారం. ‘2,000 మెగాహెర్ట్జ్‌కు పైబడిన బ్యాండ్‌విడ్త్‌లో భారీ పరిమాణంలో స్పెక్ట్రం అందుబాటులో ఉండనుంది. కొత్తగా భారత్ టెలికం మార్కెట్లోకి ప్రవేశించే ఆపరేటర్‌కు ఇది మంచి అవకాశం’ అని ఈ పరిణామంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. కాగా, దీనిపై ఏటీఅండ్‌టీ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. తమ పాలసీ మేరకు మీడియాలో ఊహాగానాలపై మాట్లాడబోమని పేర్కొనడం గమనార్హం.

మరోపక్క, అత్యంత సమర్ధవంతమైన 700 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌విడ్త్ స్పెక్ట్రం కూడా రానున్న వేలంలో అందుబాటులో ఉండటం కొత్తగా ప్రవేశించే టెల్కోలకు సదావకాశంగా పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే దేశవ్యాప్తంగా 5 మెగాహెర్ట్జ్ బ్లాక్‌ను ఈ బ్యాండ్‌విడ్త్‌లో చేజిక్కించుకోవడానికి సుమారు రూ.57,425 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఇప్పటికే భారీ రుణభారంతో ఉన్న భారతీ ఎయిర్‌టెల్, ఐడియా వంటి టెల్కోలు దీనిపై దృష్టిపెట్టే అవకాశం లేదని.. దీంతో కొత్త ఆపరేటర్లు భారీగా విస్తరించేందుకు ఈ స్పెక్ట్రం దోహదం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
 
వచ్చి, వెళ్లిపోయాయి...
వాస్తవానికి భారత్‌లోకి ఏటీఅండ్‌టీ సుమారు 15 ఏళ్ల క్రితమే అడుగుపెట్టింది. అప్పట్లో దేశీయంగా టెలికం సేవలను ప్రారంభించిన బిర్లా, టాటా గ్రూప్‌లతో జట్టుకట్టింది. అయితే, ఆతర్వాత 2005లో ఆయా సంస్థల్లోని వాటాలను విక్రయించి భారత్‌కు గుడ్‌బై చెప్పింది. ఇక వర్జిన్ మీడియా కూడా 2008లో టాటా గ్రూప్‌తో భాగస్వామ్యం ద్వారా వర్జిన్ మొబైల్ బ్రాండ్ కింద టెలికం సేవలను అందించింది. అయితే, వ్యాపారంలో పెద్దగా పురోగతి సాధించలేక 2011లో కార్యకలాపాలను నిలిపివేసింది.

అయితే, ఎంవీఎన్‌ఓ విధానానికి భారత్‌లోని టెలికం కమిషన్ ఈ ఏడాది మార్చి 28న ఆమోదముద్ర వేయడంతో మళ్లీ విదేశీ దిగ్గజాలు ఇక్కడి భారీ మార్కెట్‌పై దృష్టిపెట్టేలా చేసింది. ‘టెలికం సేవల విస్తరణ తక్కువగా ఉన్న గ్రామీణ, సబర్బన్ ప్రాంతాల్లో కార్యకలాపాలు అందించాలనుకునే కంపెనీలకు ఎంవీఎన్‌ఓ రూట్ చాలా మంచి అవకాశం. ప్రస్తుతం పెద్ద ఆపరేటర్లు తగినంత బ్యాండ్‌విడ్త్ లేక విస్తరణకు దిక్కులుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.

ఇక ప్రభుత్వ రంగ టెల్కోల వద్ద భారీస్థాయిలో స్పెక్ట్రం, మౌలిక సదుపాయాలు ఉన్నా... సరైన మార్కెటింగ్ సామర్థ్యం లేకపోవడంతో వెనుకబడ్డాయి. ఎంవీఎన్‌ఓ మోడల్‌తో ఇలాంటి కంపెనీలకు ఉపయోగం ఉంటుంది’ అని గార్ట్‌నర్ రీసెర్చ్ ఎనలిస్ట్ రిషి తేజ్‌పాల్ అభిప్రాయపడ్డారు. అయితే, ప్రస్తుతం దేశంలో మొబైల్, డేటా టారిఫ్‌ల విషయంలో టెల్కోల మధ్య ధరల యుద్ధం నెలకొన్న నేపథ్యంలో ఎంవీఎన్‌ఓలు ఇక్కడి మార్కెట్లో నిలదొక్కుకోవడం ఏమంత సులువు కాదనేది మరికొందరు విశ్లేషకుల వాదన.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement