AT&T
-
5జీ దెబ్బకు విమాన సేవలకు బ్రేక్..!
అమెరికాలో ఏర్పాటు చేస్తున్న 5జీ సేవల వల్ల అక్కడి విమాన సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నట్లు యుఎస్ ప్యాసింజర్, కార్గో క్యారియర్ల సీఈఓలు సోమవారం హెచ్చరించారు. ఎటీ అండ్ టీ, వెరిజోన్ కలిసీ కొత్త 5జీ సేవలను అందించడానికి సిద్ధం అవుతున్నప్పుడు రాబోయే "విపత్కర" విమానయాన సంక్షోభం గురించి ప్రధాన విమానయాన కంపెనీల సీఈఓలు ప్రభుత్వానికి సూచించారు. 5జీ టెక్నాలజీలో వినియోగించే కొత్త సీ-బ్యాండ్ వల్ల విమాన సేవలు నిలిచిపోతాయని, విమానాల విషయంలో గందరగోళం తలెత్తే అవకాశం ఉన్నట్లు విమానయాన సంస్థలు హెచ్చరించాయి. అమెరికన్ ఎయిర్ లైన్స్, డెల్టా ఎయిర్ లైన్స్, యునైటెడ్ ఎయిర్ లైన్స్, సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ ఇలా రాశారు.. "మా విమానాలు ఎగరడానికి గ్రౌండ్ క్లియర్ చేయకపోతే, విమనాలలో ప్రయాణిస్తున్న ప్రజలు ఎక్కడిక్కడే చిక్కుకొని పోవల్సి వస్తుంది" అని అన్నారు. ఈ 5జీ సిగ్నల్స్ ఆల్టిమీటర్స్ వంటి సున్నితమైన విమాన పరికరాలను ప్రభావితం చేస్తుందని, దృశ్యమాన కార్యకలాపాలపై ప్రభావం చూపుతుందని ఎఫ్ఏఏ హెచ్చరించింది. 1,100కు పైగా విమానాల ప్రయాణం స్తంభించిపోయే అవకాశం ఉన్నట్లు సంస్థలు సూచిస్తున్నాయి. "నిస్సంకోచంగా చెప్పాలంటే దేశం వాణిజ్యం ఆగిపోతుంది" అని కంపెనీలు వైట్ హౌస్ నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డైరెక్టర్ బ్రియాన్ డీస్, రవాణా కార్యదర్శి పీట్ బుట్టిగీగ్, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) అడ్మినిస్ట్రేటర్ స్టీవ్ డిక్సన్, ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్(FCC) చైర్మెన్ జెస్సికా రోసెన్‌వోర్సెల్‌లకు లేఖ రాశాయి. ఈ లేఖపై ప్రభుత్వ సంస్థలు వెంటనే వ్యాఖ్యానించలేదు. గత ఏడాది 80 బిలియన్ల డాలర్లను వెచ్చించి మొత్తం సీ-బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను గెలుచుకున్న ఎటీ అండ్ టీ, వెరిజోన్ విమానయాన భద్రతను దృష్టిలో ఉంచుకొని 5జీ నెట్వర్క్ విస్తరణను రెండు వారాలపాటు పొడగించేందుకు అంగీకరించారు. ఆ తర్వాత అక్కడి ప్రభుత్వాలతో మాట్లాడిన తర్వాత అక్కడ 5జీ టవర్స్ ఏర్పాటు చేయకుండా ప్రత్యామ్న్యాయ మార్గాలను అన్వేషించే అవకాశం ఉంది. కొన్ని కీలక విమానాశ్రయాల్లో "విమానాశ్రయ రన్ వేలకు సుమారు 2 మైళ్ల (3.2 కిలోమీటర్ల)లోపల మినహా దేశంలో ప్రతిచోటా 5జీ అమలు చేయాలని" విమానయాన సంస్థలు కోరుతున్నాాయి. (చదవండి: కష్టకాలంలో శ్రీలంకకు మరోసారి అండగా నిలిచిన భారత్..!) -
వాల్‌మార్ట్, ఏటీఅండ్‌టీకి ఫెడ్ దన్ను
కోవిడ్-19 ధాటికి కుదేలైన కార్పొరేట్ దిగ్గజాలకు ఆర్థికంగా దన్నునిచ్చే బాటలో యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ తొలిసారిగా కార్పొరేట్ బాండ్ల కొనుగోలును ప్రారంభించింది. దీనిలో భాగంగా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్, టెలికం దిగ్గజం ఏటీఅండ్‌టీ, వారెన్ బఫెట్ కంపెనీ బెర్కషైర్ హాథవే, ఫిలిప్ మోరిస్ తదితర కంపెనీల బాండ్లను సొంతం చేసుకుంది. ఇందుకు తొలి దశలో భాగంగా 428 మిలియన్ డాలర్లను వెచ్చించింది. వీటితోపాటు 530 కోట్ల డాలర్ల విలువైన 16 కార్పొరేట్ బాండ్ ఈటీఎఫ్‌లను సైతం కొనుగోలు చేసినట్లు ఫెడ్ ఆదివారం వెల్లడించింది. వెరసి చరిత్రలో తొలిసారి ఫెడరల్ రిజర్వ్ ఇండివిడ్యుయల్ కంపెనీల బాండ్లను కొనుగోలు చేసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. భారీ నిధులు తాజా ప్రణాళికల్లో భాగంగా ఏటీఅండ్‌టీ, యునైటెడ్ హెల్త్ గ్రూప్‌నకు చెందిన 16.4 మిలియన్ డాలర్ల విలువైన బాండ్లను విడిగా ఫెడ్ కొనుగోలు చేసింది. బాండ్ల కొనుగోలు ద్వారా నిధులు అందించే ప్రణాళికలకు అనుగుణంగా ప్రస్తుతం 790 కంపెనీలు ఎంపికైనట్లు ఫెడ్ తెలియజేసింది. తొలి దశలో భాగంగా వీటిలో 86 కంపెనీల బాండ్లను కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇటీవల క్రెడిట్ రేటింగ్ జంక్ స్థాయికి డౌన్‌గ్రేడ్ అయిన ఆటో దిగ్గజం ఫోర్డ్ మోటార్ కంపెనీ బాండ్లను సైతం సెకండరీ మార్కెట్ ద్వారా కొనుగోలు చేయనున్నట్లు పేర్కొంది. పావెల్‌కు పరీక్ష కరోనా వైరస్ కారణంగా కుదేలైన కంపెనీలకు అండగా.. బ్యాంక్ ఆఫ్ జపాన్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ సైతం ఇండివిడ్యుయల్ కార్పొరేట్ బాండ్ల కొనుగోలు సన్నాహాల్లో ఉన్న సంగతి తెలిసిందే. తద్వారా ఆయా కంపెనీలకు లిక్విడిటీని కల్పించే ప్రణాళికలను అమలు చేస్తున్నాయి. తద్వారా కంపెనీల కార్యకలాపాలు నిలిచిపోకుండా సొంతంగా నిధులు సమకూర్చుకునేందుకు వెసులుబాటు కల్పించాలని భావిస్తున్నాయి. కాగా.. మంగళవారం(30న) ఫైనాన్షియల్ సర్వీసెస్ కమిటీ ముందు ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ కార్పొరేట్ బాండ్ల కొనుగోలుపై వివరణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. విడిగా కార్పొరేట్ బాండ్ల కొనుగోలు అంశంపై న్యాయ నిపుణులు పావెల్‌ను ప్రశ్నించనున్నట్లు సంబంధితవర్గాలు తెలియజేశాయి. -
టెక్ మహీంద్రాకు భారీ డీల్
పుణే: ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా భారీ డీల్‌ను సాధించింది. అమెరికాకు చెందిన టెలికం కంపెనీ ఏటీ అండ్ టీ, నుంచి ఈ కాంట్రాక్ట్‌ను సాధంచామని టెక్ మహీంద్రా తెలిపింది. ఏటీ అండ్ టీ కంపెనీ తన ఐటీ నెట్‌వర్క్‌ను అధునికీకరించడం కోసం ఈ డీల్‌ను కుదుర్చుకుందని టెక్ మహీంద్రా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మనోజ్ భట్ పేర్కొన్నారు. డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలను ఆయన వెల్లడించలేదు. అయితే ఈ డీల్ విలువ వంద కోట్ల డాలర్లకు మించి ఉంటుందని అంచనా. దాదాపు ఆరేళ్ల కాలంలో తాము సాధించిన అతి పెద్ద డీల్ ఇదేనని భట్ పేర్కొన్నారు. ఈ డీల్ కాలపరిమితి ఆరున్నర సంవత్సరాలని తెలిపారు. 2013లో ఈ కంపెనీ బ్రిటిష్ టెలికం కంపెనీ బీటీతో వంద కోట్ల డాలర్లకు మించిన ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. మరింత మెరుగైన సేవలు.... టెక్ మహీంద్రాతో ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల మరింత మెరుగైన సేవలను అందించగలుగుతామని ఏటీ అండ్ టీ సీఐఓ జాన్ సమ్మర్స్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది జూన్‌కల్లా అమెరికా వ్యాప్తంగా 5జీ నెట్వర్క్ ఏర్పాటు చేయాలన్న తమ లక్ష్యం సులభంగానే సాకారం కాగలదని వివరించారు.కాగా టెక్ మహీంద్రా కంపెనీ వార్షిక ఆదాయం దాదాపు 500 కోట్ల డాలర్ల మేర ఉంటుంది. దీంట్లో 21 శాతం వరకూ ఏటీ అండ్ టీ, బీటీ వంటి అగ్రశ్రేణి కంపెనీల నుంచే వస్తోంది. ఇక కంపెనీ మొత్తం ఆదాయంలో టెలికమ్యూనికేషన్స్ విభాగం వాటా 40 శాతానికి మించి ఉంటుంది. -
ఏటీ అండ్ టీ కస్టమర్లకు ఫ్రీ టీవీలు
ప్రముఖ మీడియా సంస్థ టైమ్ వార్నర్‌ను అమెరికాకు చెందిన అతిపెద్ద టెలికాం దిగ్గజం ఏటీ అండ్ టీ కొనుగోలు చేసింది. 2016లో ప్రకటించిన ఈ డీల్ కోర్టు, ప్రభుత్వ అనుమతులతో సహా అన్ని లాంఛనాలను గురువారం నాటికి పూర్తి చేసినట్లు ఏటీ అండ్ టీ పేర్కొంది. ఈ డీల్ విలువ 8540 కోట్ల డాలర్లని వెల్లడించింది. ఈ విలీనంతో వార్నర్‌కు ఉన్న 10,800 కోట్ల డాలర్ల రుణాన్ని కూడా ఏటీ అండ్ టీ తీసేసుకుంది. అలాగే టైమ్ వార్నర్, హెచ్‌బీఓ, వార్నర్ బ్రదర్స్ ఫిలిమ్ స్టూడియో, టర్నర్ ఛానల్స్... ఏటీ అండ్ టీ చేతికి వచ్చాయి. ఏటీ అండ్ టీ మొబైల్ వినియోగదారులకు ఊహించని ఆఫర్లను అందించనున్నామని సంస్థ ఛైర్మన్ అండ్ సీఈవో రాండాల్ స్టీఫెన్ సన్ చెప్పారు. ఏటీ అండ్ టీ వాచ్ టీవీ ద్వారా వైర్లెస్ కస్టమర్లకు ఉచిత టీవీలను అందించనున్నామని వెల్లడించారు. కస్టమర్లు నెలకు 15డాలర్లు చొప్పున ఏ ప్లాట్‌ఫాంలో నైనా తమ ప్లాన్‌ను కొనుగోలు చేయవచ్చని చెప్పారు. వినోద కేంద్రంగా తమ సేవలు ఉండనున్నాయన్నారు. ఈ సందర్భంగా ఆయన కోర్టు తీర్పుపై సంతోషం వ్యక్తం చేశారు. ఒక ఏడాదిలోపునే రుణ భారం నుంచి బయటపడతామని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వం తీసుకోబోయే చర్యపై తనకు భయం లేదని వ్యాఖ్యానించారు. మరోవైపు ఏటీ అండ్ టీ, టైమ్‌వార్నర్ విలీనానికి ఆమోదం తెలుపుతూ కొలంబియా కోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పును వెలువరించింది. చారిత్రాత్మక తీర్పుగా పేర్కొంటున్న ఈ తీర్పుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. టెలికాం నిబంధనలను తుంగలో తొక్కినట్టు ఆరోపణలు రావడంతో ఈ డీల్‌పై అమెరికా డిపార్ట్ మెంట్ జస్టిస్ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. -
టెలీకాం,మీడియా దిగ్గజాల మధ్య బ్లాక్ బస్టర్ డీల్?
అమెరికాలోని డాలస్ కు చెందిన దిగ్గజ టెలికం సంస్థ ఏటీఅండ్‌టీ మరో దిగ్గజ కంపెనీ న్యూయార్క్ దిగ్గజం మీడియా మేజర్ టైమ్వార్నర్ను కొనుగోలు చేసేందకు రంగం సిద్ధమైంది. సుమారు 85 బిలియన్ డాలర్లతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్టు తెలుస్తోంది. దీనిపై సూత్ర ప్రాయ అంగీకారం ముగిసిందనీ,ఆదివారం ఒక ప్రకటన రావచ్చని సమాచారం. ఈ తాజా ఒప్పందంతో ఏటీఅండ్‌టీకి హెచ్‌బీవో, సీఎన్ఎన్, వార్నర్ బ్రదర్స్ వంటి ఛానెల్స్‌పై పట్టు వస్తుంది. ఏటీఅండ్‌టీ వైర్లెస్ టెలిఫోన్ల విక్రయంలో, బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుల్లో రారాజుగా ఉన్న ఈ సంస్థ గత ఏడాది డైరెక్ట్ టీవీని దాదాపు 2.5లక్షల కోట్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం టైమ్‌వార్నర్ ప్రతి షేరుకు ఏటీఎండ్టీ 110 డాలర్లు( రూ.7200) చెల్లించడానికి సిద్ధమైంది. ఈ లెక్క ప్రకారం డీల్ రూ.ఐదులక్షల కోట్లను దాటనుంది. మరోవైపు ప్రపంచంలో ఇటీవలి కాలంలో ఇదే బ్లాక్ బస్టర్ డీల్ గా నిలవనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ డీల్‌కు సంబంధించిన నియమ నిబంధనలను ఆదివారం ప్రకటించవచ్చని భావిస్తున్నారు. ఇటీవల కాలంలో చాలా టెలికం కంపెనీలు టీవీ ఛానెల్స్ పంపిణీ నెట్‌వర్క్‌లోకి వచ్చాయి. ఈ జాబితాలోకి ఏటీఅండ్‌టీ కూడా చేరుతుంది. అయితే ఈ రెండు సంస్థ ఈ డీల్ పై వ్యాఖ్యానించడానికి నిరాకరించాయి. మరోవైపు ఈ భారీ ఒప్పందం వార్తలపై అక్కడి ఎనలిస్టులు పెదవి విరుస్తున్నారు. ప్రస్తుతం సంస్థ చేతిలో కేవలం ఏడు బిలియన్ డాలర్లు (రూ.46వేల కోట్లు)మాత్రమే ఉన్నాయంటున్నారు.. మిగిలిన సొమ్ముకోసం రుణదాతల తలుపు తట్టాల్సిందేననీ, ఇప్పటికే ఈ సంస్థకు భారీగా అప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. భవిష్యత్తంతా నెక్ట్స్ జనరేషన్ 5జీ మొబైల్స్ దే నని వాదిస్తున్నారు. పేటీవీ సర్వీసులకు మొబైల్ ప్రొవైడర్లు పెద్ద ఆటంకంగా మారనున్నారని వ్యాఖ్యానించారు. పంపిణీ, కంటెంట్ లను జోడించడం ఎపుడూ సాధ్యంకాదన్నారు. కానీ ఈ ఒప్పంద వార్తలను మీడియా పరిశ్రమ సానుకూలంగా స్వీకరించింది. నెట్ ఫ్లిక్స్ ఇంక్, డిస్కవరీ కమ్యూనికేషన్స్ ఇంక్ సహా మీడియా షేర్లు లాభాలను ఆర్జించాయి. -
ఫైనల్ రౌండ్ లో వెరిజోన్, ఏటీ అండ్ టీ ఢీ
యాహు కోర్ ఇంటర్నెట్ ఆస్తుల వేలం పాటలో అమెరికా టెలి కమ్యూనికేషన్ దిగ్గజ సంస్థలు వెరిజోన్ కమ్యూనికేషన్, ఏటీ అండ్ టీ పోటీపడనున్నాయి. ఈ రెండు టెలికం సంస్థలు వేలం బిడ్డింగ్ లో చివరి రౌండ్ కు రానున్నాయని మార్కెట్ వర్గాలు చెప్పాయి. వెరిజోన్, అమెరికాలో అతిపెద్ద వైర్ లెస్ క్యారియర్ గా ఉండగా.. ఏటీ అండ్ టీ రెండో అతిపెద్ద టెలికమ్యూనికేషన్ సంస్థ. ఈ రెండు సంస్థలు ఇప్పుడు యాహు బిడ్డింగ్ పై పోటీపడనున్నాయి. యాహు బిడ్డింగ్ ను ఈ రెండు సంస్థలు చాలెంజ్ గా తీసుకున్నాయి. గతవారమే ఈ వేలం రెండో రౌండ్‌ను యాహు ముగించుకుంది. ఈ రౌండ్ బిడ్స్ రూ.35 కోట్ల నుంచి రూ.50 కోట్ల మధ్య నమోదయ్యాయని మార్కెట్ వర్గాలు చెప్పాయి. వచ్చే నెలలో ఈ వేలాన్ని ముగించేయాలని యాహు భావిస్తున్నట్టు పేర్కొన్నాయి. కాలిఫోర్నియాకు చెందిన ఈ కంపెనీ హెడ్జ్ ఫండ్ స్టాండర్డ్ విలువ పడిపోవడంతో తన ఆస్తుల అమ్మకం మొదలుపెట్టింది. కొన్ని ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు సెకండ్ రౌండ్ కు వెళ్లినా, మూడో రౌండ్ కు తమ జాబితాను నమోదు చేసుకోలేకపోయాయి. ఈ బిడ్స్ దాఖలును అధికారికంగా చేపట్టినట్టు ఆ కంపెనీకి చెందిన ఓ అధికారి పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై స్పందించడానికి యాహు, వెరిజోన్, ఏటీ అండ్ టీలు తిరస్కరించాయి. ఈ బిడ్డింగ్ కు క్వికెన్ లోన్స్ ఇంక్ వ్యవస్థాపకుడు డాన్ గిల్బర్ట్ కన్సార్షియంగా వ్యవహరిస్తున్నారు. -
అత్యంత ఖరీదైన బ్రాండ్లు ఏంటో తెలుసా..?
టెక్ దిగ్గజం యాపిల్ ను అధిగమించి, ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బ్రాండ్ గా సెర్చ్ ఇంజన్ గూగుల్ అగ్రస్థానంలో నిలిచింది. బ్రాండ్ కన్సల్టెన్సీ మిల్వార్ట్ బ్రౌన్ వార్షిక ర్యాంకింగ్స్ లో గూగుల్ తన హవా చాటుకుంది. 30లక్షల కన్సూమర్ల ఇంటర్వ్యూలు, ప్రతీ కంపెనీ ఫైనాన్సియల్ డేటా, బిజినెస్ ఫర్ ఫార్మెన్స్ తో ప్రపంచంలో అత్యంత ఖరీదైన బ్రాండ్ ల ర్యాంకింగ్ లను మిల్వార్డ్ బ్రౌన్ వెల్లడించింది. ఈ బ్రాండింగ్ సంస్థ విడుదల చేసిన ర్యాకింగ్ లో టాప్-5 లో నిలిచిన కంపెనీల గురించి మనం ఓ సారి తెలుసుకుందాం... 1. గూగుల్.... బ్రాండ్ విలువ : 22,920 కోట్ల డాలర్లు గతేడాది నుంచి వచ్చిన శాతంలో మార్పు : +32శాతం గతేడాది ర్యాంకు : 2 కొంగొత్త ఆవిష్కరణలతో గూగుల్ మార్కెట్లో దూసుకెళ్తోంది. అధిక మొత్తంలో వ్యాపార ప్రకటనలతో తన రాబడులను పెంచుకుంది. క్లౌడ్ బిజినెస్ లో తన వృద్ది ఎక్కువగా ఉందని, పనిలో చాలా పారదర్శకతగా గూగుల్ వ్యవహరిస్తుందని మిల్వార్డ్ బ్రౌన్ చెప్పింది. 2. యాపిల్.... బ్రాండ్ విలువ : 22,850 కోట్ల డాలర్లు గతేడాది నుంచి వచ్చిన శాతంలో మార్పు : -8శాతం గతేడాది ర్యాంకు : 1 యాపిల్ ఈ ఏడాది ఆవిష్కరించిన కొత్త ప్రొడక్ట్ ల ఫర్ ఫార్మెన్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో బ్రాండ్ విలువకు దెబ్బకొట్టింది. యాపిల్ వాచ్ ను ఏప్రిల్ లో లాంచ్ చేశారు. కానీ అది అంతగా వినియోగదారులను ఆకట్టుకోలేకపోయింది. అయితే ప్రత్యర్థి కంపెనీ స్మార్ట్ ఫోన్ల కంపెనీల కంటే యాపిల్ స్మార్ట్ వాచ్ అమ్మకాలే ఎక్కువ నమోదు అయ్యాయి. కేవలం గాడ్జెట్ లు మాత్రమే కాక, తాను సర్వీసులను కూడా అందించగలదని, చైనాలో అతిపెద్ద రవాణా సంస్థ దిదీ చుక్సింగ్ లో పెట్టుబడులు పెట్టి నిరూపించింది. 3.మైక్రోసాప్ట్.... బ్రాండ్ విలువ : 12,180 కోట్ల డాలర్లు గతేడాది నుంచి వచ్చిన శాతంలో మార్పు : +5శాతం గతేడాది ర్యాంకు : 3 బిజినెస్ టూ బిజినెస్ బ్రాండ్ లో మైక్రోసాప్ట్ ప్రపంచంలో అత్యంత ఖరీదైన బ్రాండ్ గా నిలుస్తోంది. కమర్షియల్ క్లౌడ్ బిజినెస్ లో మైక్రోసాప్ట్ దూసుకెళ్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 2700లక్షల డివైజ్ లలో విండోస్ 10 యాక్టివ్ లో ఉంది. 4. ఏటీ అండ్ టీ... బ్రాండ్ విలువ.. 10,740 కోట్ల డాలర్లు గతేడాది నుంచి వచ్చిన శాతంలో మార్పు : +20శాతం గతేడాది ర్యాంకు : 6 టాప్-10 నిలిచిన ఈ కంపెనీ, రెండో టెలికాం కంపెనీగా పేరుతెచ్చుకుంటోంది. క్వాడ్ ప్లే వల్ల ఏటీ అండ్ టీ తన ప్రత్యర్థుల కంటే ఎక్కువగా ఫర్ ఫార్మ్ చేస్తుందని మిల్వార్డ్ బ్రౌన్ తెలిపింది. ఏటీ అండ్ టీ కారు తయారీ దారులు ఫోర్డ్, బీఎమ్ డబ్ల్యూ, టెస్లాలతో దోస్తి కుదుర్చుకుని, అత్యంత ఖరీదైన బ్రాండ్ గా నిలుస్తోంది. 5. ఫేస్ బుక్... బ్రాండ్ విలువ : 10,260 కోట్ల డాలర్లు గతేడాది నుంచి వచ్చిన శాతంలో మార్పు : +44 శాతం గతేడాది ర్యాంకు : 12 ఫేస్ బుక్ 2015 ఏడాదిలో రెవెన్యూల్లో దూసుకెళ్లి, బలమైన ఆర్థిక ప్రదర్శనను చూపిండటంతో, తన ర్యాంకును మెరుగుపరుచుకోగలిగింది. వర్చువల్ రియాల్టీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఎక్కువగా దృష్టిసారిస్తూ లాంగ్ టర్మ్ విజన్ ఏర్పాటుచేసుకుంది. మీడియా ప్లాట్ ఫామ్ లోకి తన వర్క్ ను మరల్చుకుంటూ, ఒరిజినల్ కంటెంట్ ను పబ్లిషర్లు ఫేస్ బుక్ పై పోస్టు చేసేలా ప్రోత్సహిస్తోంది. ఎక్కువగా వీడియోల ద్వారా వార్తల వారధిగా నిలుస్తోంది. -
ఏటీఅండ్‌టీ, వర్జిన్ రీఎంట్రీ!
* భారత్ టెలికం మార్కెట్లో ప్రవేశానికి ప్రయత్నాలు... * రానున్న స్పెక్ట్రం వేలాల్లో పాల్గొనేందుకూ సన్నాహాలు న్యూఢిల్లీ: భారత్ టెలికం మార్కెట్‌పై మరోసారి విదేశీ దిగ్గజాల కన్నుపడింది. అమెరికా టెలికం అగ్రగామి ఏటీఅండ్‌టీ, వర్జిన్ మీడియాలు ఇక్కడి మార్కెట్లోకి మరోసారి అడుగుపెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఈ రెండు కంపెనీలూ ఇప్పటికే మోదీ సర్కారుకు తమ రీఎంట్రీకి సంబంధించి ఆసక్తిని వ్యక్తం చేయడంతోపాటు ప్రాథమికంగా చర్చలు కూడా జరిపినట్లు ఉన్నతస్థాయి అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతానికి మొబైల్ వర్చువల్ నెట్వర్క్ ఆపరేటర్(ఎంవీఎన్ఓ) రూట్లో తమ కార్యకలాపాలను భారత్‌లో ప్రారంభించే అవకాశం ఉందని ఆయా వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడున్న టెలికం కంపెనీల నుంచి ఎయిర్‌టైమ్, బ్యాండ్‌విడ్త్(కాల్స్, డేటా కోసం)ను హోల్‌సేల్ రేట్లకు బల్క్‌లో కొనుగోలు చేసి.. సొంత బ్రాండ్ కింద టెలికం సేవలను ఆఫర్ చేయడాన్ని ఎంవీఎన్‌ఓగా పేర్కొంటారు. వర్జిన్ మీడియాను రిచర్డ్ బ్రాన్సన్ స్థాపించగా.. ప్రస్తుతం దీని నియంత్రణ అంతా 18.3 బిలియన్ డాలర్ల విలువైన లిబర్టీ గ్లోబల్ చేతిలో ఉంది. ఇక ఏటీఅండ్‌టీ కంపెనీ విలువ 147 బిలియన్ డాలర్లుగా అంచనా. భారీ గేమ్ప్లాన్తోనే... దేశీ టెలికం రంగంలోకి తిరిగి అడుగుపెట్టాలని భావిస్తున్న విదేశీ కంపెనీలు రానున్నకాలంలో భారీస్థాయిలో విస్తరించే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఏటీఅండ్‌టీ ఈ ఏడాది ద్వితీయార్ధంలో జరిగే మెగా స్పెక్ట్రం వేలంలో బిడ్డింగ్‌పై దృష్టిసారిస్తున్నట్లు సమాచారం. ‘2,000 మెగాహెర్ట్జ్‌కు పైబడిన బ్యాండ్‌విడ్త్‌లో భారీ పరిమాణంలో స్పెక్ట్రం అందుబాటులో ఉండనుంది. కొత్తగా భారత్ టెలికం మార్కెట్లోకి ప్రవేశించే ఆపరేటర్‌కు ఇది మంచి అవకాశం’ అని ఈ పరిణామంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. కాగా, దీనిపై ఏటీఅండ్‌టీ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. తమ పాలసీ మేరకు మీడియాలో ఊహాగానాలపై మాట్లాడబోమని పేర్కొనడం గమనార్హం. మరోపక్క, అత్యంత సమర్ధవంతమైన 700 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌విడ్త్ స్పెక్ట్రం కూడా రానున్న వేలంలో అందుబాటులో ఉండటం కొత్తగా ప్రవేశించే టెల్కోలకు సదావకాశంగా పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే దేశవ్యాప్తంగా 5 మెగాహెర్ట్జ్ బ్లాక్‌ను ఈ బ్యాండ్‌విడ్త్‌లో చేజిక్కించుకోవడానికి సుమారు రూ.57,425 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఇప్పటికే భారీ రుణభారంతో ఉన్న భారతీ ఎయిర్టెల్, ఐడియా వంటి టెల్కోలు దీనిపై దృష్టిపెట్టే అవకాశం లేదని.. దీంతో కొత్త ఆపరేటర్లు భారీగా విస్తరించేందుకు ఈ స్పెక్ట్రం దోహదం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. వచ్చి, వెళ్లిపోయాయి... వాస్తవానికి భారత్‌లోకి ఏటీఅండ్‌టీ సుమారు 15 ఏళ్ల క్రితమే అడుగుపెట్టింది. అప్పట్లో దేశీయంగా టెలికం సేవలను ప్రారంభించిన బిర్లా, టాటా గ్రూప్‌లతో జట్టుకట్టింది. అయితే, ఆతర్వాత 2005లో ఆయా సంస్థల్లోని వాటాలను విక్రయించి భారత్‌కు గుడ్‌బై చెప్పింది. ఇక వర్జిన్ మీడియా కూడా 2008లో టాటా గ్రూప్‌తో భాగస్వామ్యం ద్వారా వర్జిన్ మొబైల్ బ్రాండ్ కింద టెలికం సేవలను అందించింది. అయితే, వ్యాపారంలో పెద్దగా పురోగతి సాధించలేక 2011లో కార్యకలాపాలను నిలిపివేసింది. అయితే, ఎంవీఎన్ఓ విధానానికి భారత్‌లోని టెలికం కమిషన్ ఈ ఏడాది మార్చి 28న ఆమోదముద్ర వేయడంతో మళ్లీ విదేశీ దిగ్గజాలు ఇక్కడి భారీ మార్కెట్‌పై దృష్టిపెట్టేలా చేసింది. ‘టెలికం సేవల విస్తరణ తక్కువగా ఉన్న గ్రామీణ, సబర్బన్ ప్రాంతాల్లో కార్యకలాపాలు అందించాలనుకునే కంపెనీలకు ఎంవీఎన్ఓ రూట్ చాలా మంచి అవకాశం. ప్రస్తుతం పెద్ద ఆపరేటర్లు తగినంత బ్యాండ్‌విడ్త్ లేక విస్తరణకు దిక్కులుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక ప్రభుత్వ రంగ టెల్కోల వద్ద భారీస్థాయిలో స్పెక్ట్రం, మౌలిక సదుపాయాలు ఉన్నా... సరైన మార్కెటింగ్ సామర్థ్యం లేకపోవడంతో వెనుకబడ్డాయి. ఎంవీఎన్ఓ మోడల్‌తో ఇలాంటి కంపెనీలకు ఉపయోగం ఉంటుంది’ అని గార్ట్నర్ రీసెర్చ్ ఎనలిస్ట్ రిషి తేజ్‌పాల్ అభిప్రాయపడ్డారు. అయితే, ప్రస్తుతం దేశంలో మొబైల్, డేటా టారిఫ్‌ల విషయంలో టెల్కోల మధ్య ధరల యుద్ధం నెలకొన్న నేపథ్యంలో ఎంవీఎన్ఓలు ఇక్కడి మార్కెట్లో నిలదొక్కుకోవడం ఏమంత సులువు కాదనేది మరికొందరు విశ్లేషకుల వాదన. -
త్వరలో మూడు సరికొత్త శ్యామ్‌సంగ్ ఫోన్లు
ఏటి&టీ సంస్థ మూడు సరికొత్త శ్యామ్‌సంగ్ ఆండ్రాయిడ్ ఫోన్లను అతి త్వరలో మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. మరి ఆ కొత్త ఫోన్లేమిటో వాటి ధరలతోపాటు ఫీచర్లు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిస్తే.. 1. గెలాక్సీ ఎక్స్‌ప్రెస్ ప్రైమ్ గో ఫోన్ కొత్త ఆండ్రాయిడ్ వెర్షన్ మార్ష్మాల్లోను గో ఫోన్లో పొందుపరిచింది శ్యామ్‌సంగ్. 5 అంగుళాల సూపర్ అమోలెడ్ స్ర్కీన్‌తో 2600ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో రానున్న ఈ ఫోన్లో 16 జీబీ ఇంటర్నల్ మెమోరీ సామర్థ్యం కలిగి ఉంటుంది. 5 ఎంపీ రీర్ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరాలతో 1.5 జీబీ ర్యామ్‌తో గో ఫోన్ అందుబాటులోకి రానుంది. గెలాక్సీ ఎక్స్‌ప్రెస్ ప్రైమ్ గో ఫోన్ ధరను 129 డాలర్లుగా నిర్ణయించారు. 2. గెలాక్సీ ఎక్స్‌ప్రెస్ 3 గెలాక్సీ ఎక్స్‌ప్రెస్ 3 ఫోన్ 4.5 అంగుళాలతో సూపర్ అమోలెడ్ స్కీన్‌తో స్మార్ట్‌ఫోన్ ప్రియులను ఆకర్షించనుంది. 2050 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం, 5 ఎంపీ కెమెరాతో 79.99 డాలర్ల ఖరీదుతో ఎక్స్‌ప్రెస్ 3 అందుబాటులోకి రానుంది. 3. గెలాక్సీ జె3 మెమోరీ కార్డు అవసరం లేకుండా 16 జీబీ నుంచి 128 జీబీ వరకు నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోగలిగే విధంగా డిజైన్ చేసిన జె౩ మొబైల్ 256 ఎన్క్రిప్షన్తో శ్యామ్‌సంగ్ నాక్స్ సెక్యూరిటీ హార్డ్‌వేర్ లెవల్‌ను వినియోగించుకుంటుంది. 5 అంగుళాల స్క్ర్రీన్తో 5ఎంపీ రీర్ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరాలతో జె౩ అందుబాటులోకి రానుంది. 1.5 జీబీ ర్యామ్ సామర్థ్యం కలిగిన జే౩లో ఏ7 చిప్‌సెట్‌ను అమర్చారు. ఈ మూడు రకాల ఫోన్లను మే 6న మార్కెట్లో అమ్మకాలకు విడుదల చేయనున్నట్లు శ్యామ్‌సంగ్ తెలిపింది. కాగా, జె౩ను నెలకు 5.67 డాలర్ల ఈఎంఐతో 24 నెలల్లో చెల్లించే సౌకర్యం కూడా ఉంది.