టెలీకాం,మీడియా దిగ్గజాల మధ్య బ్లాక్ బస్టర్ డీల్?
అమెరికాలోని డాలస్ కు చెందిన దిగ్గజ టెలికం సంస్థ ఏటీఅండ్‌టీ మరో దిగ్గజ కంపెనీ న్యూయార్క్ దిగ్గజం మీడియా మేజర్ టైమ్‌వార్నర్‌ను కొనుగోలు చేసేందకు రంగం సిద్ధమైంది. సుమారు 85 బిలియన్ డాలర్లతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్టు తెలుస్తోంది. దీనిపై సూత్ర ప్రాయ అంగీకారం ముగిసిందనీ,ఆదివారం ఒక ప్రకటన రావచ్చని సమాచారం. ఈ తాజా ఒప్పందంతో ఏటీఅండ్‌టీకి హెచ్‌బీవో, సీఎన్‌ఎన్, వార్నర్ బ్రదర్స్ వంటి ఛానెల్స్‌పై పట్టు వస్తుంది.
ఏటీఅండ్‌టీ వైర్‌లెస్ టెలిఫోన్ల విక్రయంలో, బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుల్లో రారాజుగా ఉన్న ఈ సంస్థ గత ఏడాది డైరెక్ట్ టీవీని దాదాపు 2.5లక్షల కోట్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం టైమ్‌వార్నర్ ప్రతి షేరుకు ఏటీఎండ్‌టీ 110 డాలర్లు( రూ.7200) చెల్లించడానికి సిద్ధమైంది. ఈ లెక్క ప్రకారం డీల్ రూ.ఐదులక్షల కోట్లను దాటనుంది. మరోవైపు ప్రపంచంలో ఇటీవలి కాలంలో ఇదే బ్లాక్ బస్టర్ డీల్ గా నిలవనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ డీల్‌కు సంబంధించిన నియమ నిబంధనలను ఆదివారం ప్రకటించవచ్చని భావిస్తున్నారు. ఇటీవల కాలంలో చాలా టెలికం కంపెనీలు టీవీ ఛానెల్స్ పంపిణీ నెట్‌వర్క్‌లోకి వచ్చాయి. ఈ జాబితాలోకి ఏటీఅండ్‌టీ కూడా చేరుతుంది. అయితే ఈ రెండు సంస్థ ఈ డీల్ పై వ్యాఖ్యానించడానికి నిరాకరించాయి.
మరోవైపు ఈ భారీ ఒప్పందం వార్తలపై అక్కడి ఎనలిస్టులు పెదవి విరుస్తున్నారు. ప్రస్తుతం సంస్థ చేతిలో కేవలం ఏడు బిలియన్ డాలర్లు (రూ.46వేల కోట్లు)మాత్రమే ఉన్నాయంటున్నారు.. మిగిలిన సొమ్ముకోసం రుణదాతల తలుపు తట్టాల్సిందేననీ, ఇప్పటికే ఈ సంస్థకు భారీగా అప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. భవిష్యత్తంతా నెక్ట్స్ జనరేషన్ 5జీ మొబైల్స్ దే నని వాదిస్తున్నారు. పేటీవీ సర్వీసులకు మొబైల్ ప్రొవైడర్లు పెద్ద ఆటంకంగా మారనున్నారని వ్యాఖ్యానించారు. పంపిణీ, కంటెంట్ లను జోడించడం ఎపుడూ సాధ్యంకాదన్నారు. కానీ ఈ ఒప్పంద వార్తలను మీడియా పరిశ్రమ సానుకూలంగా స్వీకరించింది. నెట్ ఫ్లిక్స్ ఇంక్, డిస్కవరీ కమ్యూనికేషన్స్ ఇంక్ సహా మీడియా షేర్లు లాభాలను ఆర్జించాయి.