Time Warner
-
ఏటీ అండ్ టీ కస్టమర్లకు ఫ్రీ టీవీలు
ప్రముఖ మీడియా సంస్థ టైమ్ వార్నర్‌ను అమెరికాకు చెందిన అతిపెద్ద టెలికాం దిగ్గజం ఏటీ అండ్ టీ కొనుగోలు చేసింది. 2016లో ప్రకటించిన ఈ డీల్ కోర్టు, ప్రభుత్వ అనుమతులతో సహా అన్ని లాంఛనాలను గురువారం నాటికి పూర్తి చేసినట్లు ఏటీ అండ్ టీ పేర్కొంది. ఈ డీల్ విలువ 8540 కోట్ల డాలర్లని వెల్లడించింది. ఈ విలీనంతో వార్నర్‌కు ఉన్న 10,800 కోట్ల డాలర్ల రుణాన్ని కూడా ఏటీ అండ్ టీ తీసేసుకుంది. అలాగే టైమ్ వార్నర్, హెచ్‌బీఓ, వార్నర్ బ్రదర్స్ ఫిలిమ్ స్టూడియో, టర్నర్ ఛానల్స్... ఏటీ అండ్ టీ చేతికి వచ్చాయి. ఏటీ అండ్ టీ మొబైల్ వినియోగదారులకు ఊహించని ఆఫర్లను అందించనున్నామని సంస్థ ఛైర్మన్ అండ్ సీఈవో రాండాల్ స్టీఫెన్ సన్ చెప్పారు. ఏటీ అండ్ టీ వాచ్ టీవీ ద్వారా వైర్లెస్ కస్టమర్లకు ఉచిత టీవీలను అందించనున్నామని వెల్లడించారు. కస్టమర్లు నెలకు 15డాలర్లు చొప్పున ఏ ప్లాట్‌ఫాంలో నైనా తమ ప్లాన్‌ను కొనుగోలు చేయవచ్చని చెప్పారు. వినోద కేంద్రంగా తమ సేవలు ఉండనున్నాయన్నారు. ఈ సందర్భంగా ఆయన కోర్టు తీర్పుపై సంతోషం వ్యక్తం చేశారు. ఒక ఏడాదిలోపునే రుణ భారం నుంచి బయటపడతామని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వం తీసుకోబోయే చర్యపై తనకు భయం లేదని వ్యాఖ్యానించారు. మరోవైపు ఏటీ అండ్ టీ, టైమ్‌వార్నర్ విలీనానికి ఆమోదం తెలుపుతూ కొలంబియా కోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పును వెలువరించింది. చారిత్రాత్మక తీర్పుగా పేర్కొంటున్న ఈ తీర్పుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. టెలికాం నిబంధనలను తుంగలో తొక్కినట్టు ఆరోపణలు రావడంతో ఈ డీల్‌పై అమెరికా డిపార్ట్ మెంట్ జస్టిస్ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. -
ఏటీ-టీకి ‘టైమ్’ కుదిరింది!
• మీడియా-ఎంటర్టైన్మెంట్ దిగ్గజం • టైమ్ వార్నర్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటన • ఈ మెగా డీల్ విలువ 109 బిలియన్ డాలర్లు.. న్యూయార్క్: హాలీవుడ్ సినిమాలు అంటే ఠక్కున గుర్తొచ్చేది వార్నర్ బ్రదర్స్ స్టూడియోస్ అంటే అతిశయోక్తికాదేమో! ఎందుకంటే ఈ సంస్థ నిర్మించిన బ్లాక్‌బస్టర్ సినిమాలకు కొదవేలేదు. మరోపక్క, ప్రపంచ న్యూస్ చానల్స్ నెట్‌వర్క్‌లో సీఎన్ఎన్... వినోద చానళ్లకు సంబంధించి హెచ్‌బీఓ కూడా ఈ కోవలోకే వస్తాయి. వీటన్నింటికీ మాతృసంస్థ అయిన అమెరికా దిగ్గజం టైమ్ వార్నర్ గ్రూప్... ఎట్టకేలకు చేతులుమారుతోంది. అమెరికాకే చెందిన టెలికం అగ్రగామి ఏటీ-టీ.. టైమ్ వార్నర్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మెగా డీల్ విలువ 108.7 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.7.28 లక్షల కోట్లు) ఉంటుందని పేర్కొంది. స్టాక్స్-నగదు రూపంలో చెల్లింపులు జరిపేందుకు ఒప్పందం కుదిరినట్లు తెలిపింది. అయితే, టైమ్ వార్నర్‌కు ఉన్న రుణాలను కూడా డీల్‌లో చేర్చారు. ఈ రుణాలను తీసేస్తే టైమ్వార్నర్కు ఏటీ-టీ చెల్లిస్తున్న మొత్తం 84.5 బిలియన్ డాలర్లు(రూ.5.66 లక్షల కోట్లు). మొత్తంమీద ఈ మెగా డీల్ ద్వారా ఏటీ-టీ మీడియా-ఎంటర్టైన్మెంట్ రంగంలో కూడా అగ్రగామిగా ఎదిగేందుకు దోహదం చేయనుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రీమియం మీడియా కంటెంట్‌ను అందించే నెట్‌వర్క్‌ల ఆసరాతో కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు వీలవుతుందని ఇరు కంపెనీలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. ఆధిపత్య పోరు... ఈ డీల్ పూర్తయితే.. టెలికం, మీడియా-ఎంటర్టైన్మెంట్ రంగంలో ఆధిపత్య పోరుకు తెరలేస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. టైమ్వార్నర్కు పోటీ సంస్థ అయిన కామ్‌కాస్ట్(ఎన్బీసీ యూనివర్సల్ దీనిదే)తో పాటు ఆన్లైన్ కంటెంట్ ప్రొవైడర్స్ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌ల నుంచి ఎదురవుతున్న గట్టిపోటీని దీటుగా ఎదుర్కోవడానికి ఏటీ-టీతో ఒప్పందం దోహదం చేస్తుందని అంటున్నారు. అంతేకాదు టెలికం రంగంలో ప్రత్యర్థి కంపెనీల నుంచి ఎదురవుతున్న సవాళ్లను కూడా ఏటీ-టీ అధిగమించేందుకు వీలుకల్పించనుంది. ఎందుకంటే మరో టెలికం దిగ్గజం వెరిజాన్ ఇప్పటికే ఏఓఎల్ను(ఇది యాహూను కొనుగోలుకు డీల్ కుదుర్చుకుంది) చేజి క్కించుకోవడం ద్వారా డిజిటల్ మీడియా రం గంలో దూసుకెళ్తోంది. మంచి అవకాశం... టైమ్ వార్నర్ అధీనంలో ఉన్న భారీ సంఖ్యలోని సినిమాలకు సంబంధించిన(లైబ్రరీ) హక్కులన్నీ ఇక ఏటీ-టీ చేతికి వెళ్లనున్నాయి. అంతేకాదు హారీపాటర్ ఫ్రాంచైజీ, టీవీ చానళ్ల కార్యకలాపాలన్నింటినీ (అత్యంత ప్రాచుర్యం పొందిన హెచ్‌బీఓ ‘గేమ్ ఆఫ్ థార్న్స్) కూడా ఏటీ-టీ తన ఫైబర్ టీవీ సబ్స్క్రయిబర్లకు అందించేందుకు వీలవుతుంది. మరోపక్క ఇటీవలే కొనుగోలు చేసిన డెరైక్ట్ టీవీ శాటిలైట్ సేవలతో పాటు మొబైల్స్‌లో కూడా ఈ కంటెంట్‌ను ఇచ్చేందుకు దోహదం చేస్తుంది. ‘ప్రీమియం కంటెంట్‌కే ఎప్పుడూ విజయం దక్కుతుంది. సినిమా స్క్రీన్లపై, టీవీల్లో దీనికి ఉన్న ఆదరణ ఎలాంటిదో తెలియందికాదు. ఇప్పుడు మొబైల్ స్క్రీన్లపైనా దీన్ని సాకారం చేసి చూపిస్తాం’ అని ఏటీ-టీ చైర్మన్, సీఈఓ రాండల్ స్టీఫెన్సన్ వ్యాఖ్యానించారు. ‘ఇరు కంపెనీల సామర్థ్యాలను మరింత ఇనుమడింపజేసేందుకు ఈ డీల్ సరైనిదిగా భావిస్తున్నా. మీడియా- కమ్యూనికేషన్స్ పరిశ్రమలో కస్టమర్లకు సరికొత్త అనుభూతిని కల్పించేందుకు దీనిద్వారా వీలవుతుంది. కంటెంట్ రూపకర్తలు, పంపిణీదారులు, అడ్వర్టయిజర్లకు కూడా ఈ ఒప్పందం కొత్త ఒరవడిని తీసుకురానుంది’. - రాండల్ స్టీఫెన్సన్, ఏటీ-టీ చైర్మన్, సీఈఓ డీల్‌ను అడ్డుకుంటాం: ట్రంప్ ఏటీ-టీ-టైమ్ వార్నర్ డీల్‌కు సంబంధించి గుత్తాధిపత్య అంశంపై నియంత్రణ సంస్థలు తీవ్రంగా దృష్టిసారించే అవకాశం ఉందని.. ఒప్పందం పూర్తవడం అంతసులువేమీ కాదని కొంతమంది విశ్లేషకులు పేర్కొంటున్నారు. అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ దీనిపై హెచ్చరికలు కూడా జారీచేశారు. తాను ప్రెసిడెంట్‌గా ఎన్నికైతే ఈ డీల్‌కు అడ్డుకట్ట వేస్తానని కూడా ప్రకటించడం గమనార్హం. ట్రంప్ దీన్ని కూడా తన ప్రచారాస్త్రంగా మార్చుకున్నారు. ‘ఇలాంటి భారీ ఒప్పందాల కారణంగా కొంతమంది చేతుల్లోనే ‘అధికారం’ కేంద్రీకృతమయ్యేందుకు దారితీస్తుంది. నేను అధ్యక్ష బాధ్యతలు చేపడితే... ఈ డీల్‌ను ఆమోదించే ప్రసక్తే లేదు. అంతేకాదు.. 2011లో ఎన్బీసీ యూనివర్సల్‌ను కామ్‌కాస్ట్ విలీనం చేసుకున్న డీల్‌ను కూడా(ఇది ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా హయాంలో కుదిరింది) విచ్ఛిన్నం చేయడంపై దృష్టిపెడతా’ అని ట్రంప్ పేర్కొన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై కొందరు విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీల కొనుగోలు-విలీనం(ఏంఅండ్ఏ) ఒప్పందాలను సమీక్షించేవి నియంత్రణ సంస్థలేనని, అందులోనూ రిపబ్లికన్లు(ట్రంప్ పార్టీ) ఏఅండ్ఏలకు అనుకూలంగానే ఉన్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఒప్పందం వల్ల గుత్తాధిపత్యానికి దారితీస్తుందని.. వీక్షకులపై పడే ప్రతికూల ప్రభావంపై దృష్టిపెట్టాలని ‘పబ్లిక్ నాలెడ్జ్’ అనే కన్జూమర్ గ్రూప్ ప్రతినిధి జాన్ బెర్మాయెర్ నియంత్రణ సంస్థలను కోరారు. -
టెలీకాం,మీడియా దిగ్గజాల మధ్య బ్లాక్ బస్టర్ డీల్?
అమెరికాలోని డాలస్ కు చెందిన దిగ్గజ టెలికం సంస్థ ఏటీఅండ్‌టీ మరో దిగ్గజ కంపెనీ న్యూయార్క్ దిగ్గజం మీడియా మేజర్ టైమ్వార్నర్ను కొనుగోలు చేసేందకు రంగం సిద్ధమైంది. సుమారు 85 బిలియన్ డాలర్లతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్టు తెలుస్తోంది. దీనిపై సూత్ర ప్రాయ అంగీకారం ముగిసిందనీ,ఆదివారం ఒక ప్రకటన రావచ్చని సమాచారం. ఈ తాజా ఒప్పందంతో ఏటీఅండ్‌టీకి హెచ్‌బీవో, సీఎన్ఎన్, వార్నర్ బ్రదర్స్ వంటి ఛానెల్స్‌పై పట్టు వస్తుంది. ఏటీఅండ్‌టీ వైర్లెస్ టెలిఫోన్ల విక్రయంలో, బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుల్లో రారాజుగా ఉన్న ఈ సంస్థ గత ఏడాది డైరెక్ట్ టీవీని దాదాపు 2.5లక్షల కోట్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం టైమ్‌వార్నర్ ప్రతి షేరుకు ఏటీఎండ్టీ 110 డాలర్లు( రూ.7200) చెల్లించడానికి సిద్ధమైంది. ఈ లెక్క ప్రకారం డీల్ రూ.ఐదులక్షల కోట్లను దాటనుంది. మరోవైపు ప్రపంచంలో ఇటీవలి కాలంలో ఇదే బ్లాక్ బస్టర్ డీల్ గా నిలవనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ డీల్‌కు సంబంధించిన నియమ నిబంధనలను ఆదివారం ప్రకటించవచ్చని భావిస్తున్నారు. ఇటీవల కాలంలో చాలా టెలికం కంపెనీలు టీవీ ఛానెల్స్ పంపిణీ నెట్‌వర్క్‌లోకి వచ్చాయి. ఈ జాబితాలోకి ఏటీఅండ్‌టీ కూడా చేరుతుంది. అయితే ఈ రెండు సంస్థ ఈ డీల్ పై వ్యాఖ్యానించడానికి నిరాకరించాయి. మరోవైపు ఈ భారీ ఒప్పందం వార్తలపై అక్కడి ఎనలిస్టులు పెదవి విరుస్తున్నారు. ప్రస్తుతం సంస్థ చేతిలో కేవలం ఏడు బిలియన్ డాలర్లు (రూ.46వేల కోట్లు)మాత్రమే ఉన్నాయంటున్నారు.. మిగిలిన సొమ్ముకోసం రుణదాతల తలుపు తట్టాల్సిందేననీ, ఇప్పటికే ఈ సంస్థకు భారీగా అప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. భవిష్యత్తంతా నెక్ట్స్ జనరేషన్ 5జీ మొబైల్స్ దే నని వాదిస్తున్నారు. పేటీవీ సర్వీసులకు మొబైల్ ప్రొవైడర్లు పెద్ద ఆటంకంగా మారనున్నారని వ్యాఖ్యానించారు. పంపిణీ, కంటెంట్ లను జోడించడం ఎపుడూ సాధ్యంకాదన్నారు. కానీ ఈ ఒప్పంద వార్తలను మీడియా పరిశ్రమ సానుకూలంగా స్వీకరించింది. నెట్ ఫ్లిక్స్ ఇంక్, డిస్కవరీ కమ్యూనికేషన్స్ ఇంక్ సహా మీడియా షేర్లు లాభాలను ఆర్జించాయి. -
టైమ్ వార్నర్‌పై మర్డోక్ కన్ను..
బోస్టన్: మీడియా దిగ్గజం, ట్వెంటీ ఫస్ట్ సెంచరీ ఫాక్స్ అధినేత రూపర్ట్ మర్డోక్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించడంపై దృష్టి సారించారు. తాజాగా మరో మీడియా దిగ్గజం టైమ్ వార్నర్‌ను దక్కించుకునేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 80 బిలియన్ డాలర్ల(సుమారు రూ.4.8 లక్షల కోట్లు) ఆఫర్ ఇచ్చారు. అయితే, టైమ్ వార్నర్ దీన్ని తిరస్కరించడంతో మరో కొత్త వ్యూహాన్ని రచించడంలో మర్డోక్ నిమగ్నమయ్యారు. గతంలో ఆయన టైమ్ వార్నర్ షేరుకి 85 డాలర్ల చొప్పున లెక్కగడతామని ఆఫర్ చేశారు. డీల్ మొత్తంలో 60 శాతం భాగానికి ట్వెంటీ ఫస్ట్ సెంచరీ ఫాక్స్ షేర్లను, మిగతా 40 శాతం భాగానికి నగదు రూపంలో చెల్లిస్తామన్నారు. కానీ, ఇందుకు టైమ్ వార్నర్ ఒప్పుకోకపోవడంతో షేరుకి 95 డాలర్ల మేర మర్డోక్ చెల్లించాల్సి రావొచ్చని.. అలాగే డీల్‌లో నగదు పరిమాణాన్ని కూడా మరింతగా పెంచాల్సి రావొచ్చని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. టైమ్ వార్నర్ ఆదాయ సామర్థ్యాలను బట్టి చూస్తే డీల్ విలువ కనీసం 94 బిలియన్ డాలర్ల పైచిలుకు ఉండాలంటున్నాయి. అదనంగా మరింత వెచ్చించాల్సి వస్తున్నా.. మర్డోక్ మాత్రం ఈ డీల్‌పై పట్టుదలగా ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాలతో టైమ్ వార్నర్ షేరు మాత్రం దూసుకెడుతోంది. రెండు రోజుల వ్యవధిలోనే ఏకంగా 20 శాతం ఎగిసి 86 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది. తెర వెనుక కథ ఇదీ... టైమ్ వార్నర్ గ్రూప్‌ను కొంటున్నట్లుగా కనిపిస్తున్నప్పటికీ మర్డోక్ దృష్టంతా ప్రధానంగా ఆ గ్రూప్‌లోని హెచ్బీవోపైనే ఉంది. టీవీ నెట్‌వర్క్‌లకు ప్రస్తుతం మరింత ఆదాయం తెచ్చిపెడుతున్న ఆన్లైన్ వీడియో సర్వీసుల విభాగంలో.. ఈ చానల్ హెచ్‌బీవో గో పేరిట సేవలు అందిస్తోంది. సినిమాలే కాకుండా.. అత్యంత ఆదరణ పొందిన గేమ్ ఆఫ్ థ్రోన్స్, గ ర్ల్స్ వంటి టీవీ షోలు హెచ్‌బీవో చేతిలో ఉండటం కూడా మర్డోక్ దృష్టిని ఆకర్షించింది. గతేడాది హెచ్‌బీవో 4.9 బిలియన్ డాలర్ల ఆదాయంపై 1.9 బిలియన్ డాలర్ల మేర స్థూల లాభాన్ని ఆర్జించింది. దీనికి పోటీగా దూసుకొస్తున్న నెట్‌ఫ్లిక్స్ ఆదాయం 4.4 బిలియన్ డాలర్ల మేర ఉండగా లాభం 277 మిలియన్ డాలర్లే. ప్రస్తుతం ఆన్లైన్ వీడియో సర్వీసుల వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటున్న ఫాక్స్ పెద్ద ఎత్తున కంటెంట్ సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే లాభసాటి హెచ్బీవోను కొనుగోలు చేయాలనుకుంటోంది. దీనికోసం ఒక్క హెచ్‌బీవో విలువను 20 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టింది. అయితే, హెచ్‌బీవో ఒక్కదాన్నే కొనేసే పరిస్థితి లేకపోవడంతో.. దానితో పాటు పనిలో పనిగా టైమ్ వార్నర్ గ్రూప్‌ను మొత్తం కొనేసి అత్యంత భారీ మీడియా దిగ్గజంగా నిలవాలని మర్డోక్ నేతృత్వంలోని ట్వెంటీఫస్డ్ సెంచరీ ఫాక్స్ భావిస్తోంది. ఇందుకోసమే టైమ్ వార్నర్ వాటాదారులు నిరాకరించలేని ఆఫర్ ఇవ్వాలని యోచిస్తోంది. టైమ్ వార్నర్: 2013 గణాంకాల ప్రకారం మార్కెట్ క్యాప్ 62.4 బిలియన్ డాలర్లు హెచ్‌బీవో, సీఎన్ఎన్, సినీమ్యాక్స్, కార్టూన్ నెట్వర్క్ తదితర చానల్స్ ఉన్నాయి. ఇంటర్నెట్కి సంబంధించి సీఎన్ఎన్డాట్కామ్, కార్టూన్ నెట్వర్క్డాట్కామ్ మొదలైనవి సినిమాలు, టీవీ కార్యక్రమాల నిర్మాణానికి సంబంధించి వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్, వార్నర్ బ్రదర్స్ టీవీ, న్యూలైన్ సినిమా మొదలైనవి టైమ్ వార్నర్ గ్రూప్‌లో కీలకంగా ఉన్నాయి. ట్వెంటీఫస్ట్ సెంచరీ ఫాక్స్: 2013 గణాంకాల ప్రకారం మార్కెట్ క్యాప్ విలువ 75.5 బిలియన్ డాలర్లు. ఫాక్స్ న్యూస్, స్టార్ ఇండియా, నేట్జియో, బిగ్టెన్ నెట్వర్క్ తదితర చానెల్స్ ఉన్నాయి. ప్రీమియం వీడియో కంటెంట్ అందించే హులు వెబ్సైట్లో 33 శాతం వాటాలను కలిగిఉంది. సినిమాలు, టీవీ కార్యక్రమాల నిర్మాణంలో ట్వెంటీయత్ సెంచరీ ఫాక్స్, ఫాక్స్ సెర్చ్‌లైట్ వంటివి ఉన్నాయి.