ఏటీ-టీకి ‘టైమ్’ కుదిరింది! | AT&T Reaches Deal to Buy Time Warner for $85.4 Billion | Sakshi
Sakshi News home page

ఏటీ-టీకి ‘టైమ్’ కుదిరింది!

Published Mon, Oct 24 2016 2:22 AM | Last Updated on Mon, Sep 4 2017 6:06 PM

ఏటీ-టీకి ‘టైమ్’ కుదిరింది!

ఏటీ-టీకి ‘టైమ్’ కుదిరింది!

మీడియా-ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజం
టైమ్ వార్నర్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటన
ఈ మెగా డీల్ విలువ 109 బిలియన్ డాలర్లు..

న్యూయార్క్: హాలీవుడ్ సినిమాలు అంటే ఠక్కున గుర్తొచ్చేది వార్నర్ బ్రదర్స్ స్టూడియోస్ అంటే అతిశయోక్తికాదేమో! ఎందుకంటే ఈ సంస్థ నిర్మించిన బ్లాక్‌బస్టర్ సినిమాలకు కొదవేలేదు. మరోపక్క, ప్రపంచ న్యూస్ చానల్స్ నెట్‌వర్క్‌లో సీఎన్‌ఎన్... వినోద చానళ్లకు సంబంధించి హెచ్‌బీఓ కూడా ఈ కోవలోకే వస్తాయి. వీటన్నింటికీ మాతృసంస్థ అయిన అమెరికా దిగ్గజం టైమ్ వార్నర్ గ్రూప్... ఎట్టకేలకు చేతులుమారుతోంది. అమెరికాకే చెందిన టెలికం అగ్రగామి ఏటీ-టీ.. టైమ్ వార్నర్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మెగా డీల్ విలువ 108.7 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.7.28 లక్షల కోట్లు) ఉంటుందని పేర్కొంది.

స్టాక్స్-నగదు రూపంలో చెల్లింపులు జరిపేందుకు ఒప్పందం కుదిరినట్లు తెలిపింది. అయితే, టైమ్ వార్నర్‌కు ఉన్న రుణాలను కూడా డీల్‌లో చేర్చారు. ఈ రుణాలను తీసేస్తే టైమ్‌వార్నర్‌కు ఏటీ-టీ చెల్లిస్తున్న మొత్తం 84.5 బిలియన్ డాలర్లు(రూ.5.66 లక్షల కోట్లు). మొత్తంమీద ఈ మెగా డీల్ ద్వారా ఏటీ-టీ మీడియా-ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో కూడా అగ్రగామిగా ఎదిగేందుకు దోహదం చేయనుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రీమియం మీడియా కంటెంట్‌ను అందించే నెట్‌వర్క్‌ల ఆసరాతో కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు వీలవుతుందని ఇరు కంపెనీలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.

ఆధిపత్య పోరు...
ఈ డీల్ పూర్తయితే.. టెలికం, మీడియా-ఎంటర్‌టైన్‌మెంట్  రంగంలో ఆధిపత్య పోరుకు తెరలేస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. టైమ్‌వార్నర్‌కు పోటీ సంస్థ అయిన కామ్‌కాస్ట్(ఎన్‌బీసీ యూనివర్సల్ దీనిదే)తో పాటు ఆన్‌లైన్ కంటెంట్ ప్రొవైడర్స్ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌ల నుంచి ఎదురవుతున్న గట్టిపోటీని దీటుగా ఎదుర్కోవడానికి ఏటీ-టీతో ఒప్పందం దోహదం చేస్తుందని అంటున్నారు. అంతేకాదు టెలికం రంగంలో ప్రత్యర్థి కంపెనీల నుంచి ఎదురవుతున్న సవాళ్లను కూడా ఏటీ-టీ అధిగమించేందుకు వీలుకల్పించనుంది. ఎందుకంటే మరో టెలికం దిగ్గజం వెరిజాన్ ఇప్పటికే ఏఓఎల్‌ను(ఇది యాహూను కొనుగోలుకు డీల్ కుదుర్చుకుంది) చేజి క్కించుకోవడం ద్వారా డిజిటల్ మీడియా రం గంలో దూసుకెళ్తోంది.

మంచి అవకాశం...
టైమ్ వార్నర్ అధీనంలో ఉన్న భారీ సంఖ్యలోని సినిమాలకు సంబంధించిన(లైబ్రరీ) హక్కులన్నీ ఇక ఏటీ-టీ చేతికి వెళ్లనున్నాయి. అంతేకాదు హారీపాటర్ ఫ్రాంచైజీ, టీవీ చానళ్ల కార్యకలాపాలన్నింటినీ (అత్యంత ప్రాచుర్యం పొందిన హెచ్‌బీఓ ‘గేమ్ ఆఫ్ థార్న్స్) కూడా ఏటీ-టీ తన ఫైబర్ టీవీ సబ్‌స్క్రయిబర్లకు అందించేందుకు వీలవుతుంది. మరోపక్క ఇటీవలే కొనుగోలు చేసిన డెరైక్ట్ టీవీ శాటిలైట్ సేవలతో పాటు మొబైల్స్‌లో కూడా ఈ కంటెంట్‌ను ఇచ్చేందుకు దోహదం చేస్తుంది. ‘ప్రీమియం కంటెంట్‌కే ఎప్పుడూ విజయం దక్కుతుంది. సినిమా స్క్రీన్‌లపై, టీవీల్లో దీనికి ఉన్న ఆదరణ ఎలాంటిదో తెలియందికాదు. ఇప్పుడు మొబైల్ స్క్రీన్‌లపైనా దీన్ని సాకారం చేసి చూపిస్తాం’ అని ఏటీ-టీ చైర్మన్, సీఈఓ రాండల్  స్టీఫెన్‌సన్ వ్యాఖ్యానించారు.

‘ఇరు కంపెనీల సామర్థ్యాలను మరింత ఇనుమడింపజేసేందుకు ఈ డీల్ సరైనిదిగా భావిస్తున్నా. మీడియా- కమ్యూనికేషన్స్ పరిశ్రమలో కస్టమర్లకు సరికొత్త అనుభూతిని కల్పించేందుకు దీనిద్వారా వీలవుతుంది. కంటెంట్ రూపకర్తలు, పంపిణీదారులు, అడ్వర్టయిజర్లకు కూడా ఈ ఒప్పందం కొత్త ఒరవడిని తీసుకురానుంది’.
- రాండల్ స్టీఫెన్‌సన్, ఏటీ-టీ చైర్మన్, సీఈఓ

డీల్‌ను అడ్డుకుంటాం: ట్రంప్
ఏటీ-టీ-టైమ్ వార్నర్ డీల్‌కు సంబంధించి గుత్తాధిపత్య అంశంపై నియంత్రణ సంస్థలు తీవ్రంగా దృష్టిసారించే అవకాశం ఉందని.. ఒప్పందం పూర్తవడం అంతసులువేమీ కాదని కొంతమంది విశ్లేషకులు పేర్కొంటున్నారు. అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ దీనిపై హెచ్చరికలు కూడా జారీచేశారు. తాను ప్రెసిడెంట్‌గా ఎన్నికైతే ఈ డీల్‌కు అడ్డుకట్ట వేస్తానని కూడా ప్రకటించడం గమనార్హం. ట్రంప్ దీన్ని కూడా తన ప్రచారాస్త్రంగా మార్చుకున్నారు. ‘ఇలాంటి భారీ ఒప్పందాల కారణంగా కొంతమంది చేతుల్లోనే ‘అధికారం’ కేంద్రీకృతమయ్యేందుకు దారితీస్తుంది. నేను అధ్యక్ష బాధ్యతలు చేపడితే... ఈ డీల్‌ను ఆమోదించే ప్రసక్తే లేదు.

అంతేకాదు.. 2011లో ఎన్‌బీసీ యూనివర్సల్‌ను కామ్‌కాస్ట్ విలీనం చేసుకున్న డీల్‌ను కూడా(ఇది ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా హయాంలో కుదిరింది) విచ్ఛిన్నం చేయడంపై దృష్టిపెడతా’ అని ట్రంప్ పేర్కొన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై కొందరు విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.  కంపెనీల కొనుగోలు-విలీనం(ఏంఅండ్‌ఏ) ఒప్పందాలను సమీక్షించేవి నియంత్రణ సంస్థలేనని, అందులోనూ రిపబ్లికన్లు(ట్రంప్ పార్టీ) ఏఅండ్‌ఏలకు అనుకూలంగానే ఉన్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఒప్పందం వల్ల గుత్తాధిపత్యానికి దారితీస్తుందని..  వీక్షకులపై పడే ప్రతికూల ప్రభావంపై దృష్టిపెట్టాలని ‘పబ్లిక్ నాలెడ్జ్’ అనే కన్జూమర్ గ్రూప్ ప్రతినిధి జాన్ బెర్మాయెర్ నియంత్రణ సంస్థలను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement