కోవిడ్-19 ధాటికి కుదేలైన కార్పొరేట్ దిగ్గజాలకు ఆర్థికంగా దన్నునిచ్చే బాటలో యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ తొలిసారిగా కార్పొరేట్ బాండ్ల కొనుగోలును ప్రారంభించింది. దీనిలో భాగంగా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్, టెలికం దిగ్గజం ఏటీఅండ్‌టీ, వారెన్ బఫెట్ కంపెనీ బెర్కషైర్ హాథవే, ఫిలిప్ మోరిస్ తదితర కంపెనీల బాండ్లను సొంతం చేసుకుంది. ఇందుకు తొలి దశలో భాగంగా 428 మిలియన్ డాలర్లను వెచ్చించింది. వీటితోపాటు 530 కోట్ల డాలర్ల విలువైన 16 కార్పొరేట్ బాండ్ ఈటీఎఫ్‌లను సైతం కొనుగోలు చేసినట్లు ఫెడ్ ఆదివారం వెల్లడించింది. వెరసి చరిత్రలో తొలిసారి ఫెడరల్ రిజర్వ్ ఇండివిడ్యుయల్ కంపెనీల బాండ్లను కొనుగోలు చేసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.
భారీ నిధులు
తాజా ప్రణాళికల్లో భాగంగా ఏటీఅండ్‌టీ, యునైటెడ్ హెల్త్ గ్రూప్‌నకు చెందిన 16.4 మిలియన్ డాలర్ల విలువైన బాండ్లను విడిగా ఫెడ్ కొనుగోలు చేసింది. బాండ్ల కొనుగోలు ద్వారా నిధులు అందించే ప్రణాళికలకు అనుగుణంగా ప్రస్తుతం 790 కంపెనీలు ఎంపికైనట్లు ఫెడ్ తెలియజేసింది. తొలి దశలో భాగంగా వీటిలో 86 కంపెనీల బాండ్లను కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇటీవల క్రెడిట్ రేటింగ్ జంక్ స్థాయికి డౌన్‌గ్రేడ్ అయిన ఆటో దిగ్గజం ఫోర్డ్ మోటార్ కంపెనీ బాండ్లను సైతం సెకండరీ మార్కెట్ ద్వారా కొనుగోలు చేయనున్నట్లు పేర్కొంది.
పావెల్‌కు పరీక్ష
కరోనా వైరస్ కారణంగా కుదేలైన కంపెనీలకు అండగా.. బ్యాంక్ ఆఫ్ జపాన్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ సైతం ఇండివిడ్యుయల్ కార్పొరేట్ బాండ్ల కొనుగోలు సన్నాహాల్లో ఉన్న సంగతి తెలిసిందే. తద్వారా ఆయా కంపెనీలకు లిక్విడిటీని కల్పించే ప్రణాళికలను అమలు చేస్తున్నాయి. తద్వారా కంపెనీల కార్యకలాపాలు నిలిచిపోకుండా సొంతంగా నిధులు సమకూర్చుకునేందుకు వెసులుబాటు కల్పించాలని భావిస్తున్నాయి. కాగా.. మంగళవారం(30న) ఫైనాన్షియల్ సర్వీసెస్ కమిటీ ముందు ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ కార్పొరేట్ బాండ్ల కొనుగోలుపై వివరణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. విడిగా కార్పొరేట్ బాండ్ల కొనుగోలు అంశంపై న్యాయ నిపుణులు పావెల్‌ను ప్రశ్నించనున్నట్లు సంబంధితవర్గాలు తెలియజేశాయి.
Comments
Please login to add a commentAdd a comment