న్యూఢిల్లీ: వొడాఫోన్ ఇండియా టవర్ల వ్యాపార విక్రయం పూర్తయింది. భారత్‌లోని టవర్ల వ్యాపారాన్ని అమెరికన్ టవర్ కార్పొరేషన్(ఏటీసీ) టెలికం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.3,850 కోట్లకు విక్రయించడం పూర్తయిందని వొడాఫోన్ ఇండియా తెలిపింది. ప్రస్తుతం తమకు 58,000 మొబైల్ టవర్లున్నాయని ఏటీసీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్(ఏషియా) అమిత్ శర్మ తెలిపారు. వొడాఫోన్ నుంచి కొనుగోలు చేసిన 10,200 టవర్లతో తమ మొబైల్ టవర్ల వ్యాపారం మరింత శక్తివంతం అవుతుందని వివరించారు.
భారత్‌లోని తమ క్లయింట్లు 4జీ సేవలను విస్తరిస్తుండటంతో వారికి మరింత సమర్థవంతమైన సేవలందించడానికి వీలవుతుందని వివరించారు. ఐడియాతో కుదుర్చుకున్న రూ.4,000 కోట్ల టవర్ల కొనుగోలు ఒప్పందం పూర్తికావలసి ఉందని తెలిపారు. ఐడియా డీల్‌కు ఈ నెలాఖరుకల్లా సంబంధిత అనుమతులు వస్తాయని భావిస్తున్నామని, వచ్చే నెల చివరికల్లా ఈ డీల్ పూర్తవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఐడియా, వొడాఫోన్‌ల నుంచి కొనుగోలు చేసే 20,000 టవర్ల కారణంగా ఏటీసీకి తొలి పూర్తి ఏడాదికి రూ.2,100 కోట్ల ప్రోపర్టీ ఆదాయం, రూ.800 కోట్ల స్థూల మార్జిన్ వస్తాయని అంచనా. వొడాఫోన్, ఐడియాకు చెందిన మొత్తం 20,000 టవర్లను రూ.7,850 కోట్లకు కొనుగోలు చేయడానికి గతేడాది నవంబర్‌లో ఏటీసీ డీల్ కుదుర్చుకుంది. ఐడియా–ఏటీసీ టవర్ల డీల్ పూర్తయిన తర్వాతనే ఐడియా, ఓడాఫోన్ విలీనం పూర్తవుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఐడియాతో విలీనం ఈఏడాది జూన్‌కల్లా పూర్తవ్వగలదని వొడాఫోన్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment