ATC tower
-
బ్రూక్‌ఫీల్డ్ చేతికి ఏటీసీ ఇండియా
న్యూఢిల్లీ: కెనడియన్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం బ్రూక్‌ఫీల్డ్.. తాజాగా అమెరికన్ టవర్ కార్పొరేషన్(ఏటీసీ)కు చెందిన దేశీ బిజినెస్ కొనుగోలుకి తెరతీసింది. ఇందుకు మొత్తం 2.5 బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 20,800 కోట్లు) డీల్ కుదుర్చుకుంది. 2 బిలియన్ డాలర్ల ఎంటర్ప్రైజ్ విలువ(రూ. 16,630 కోట్లు)లో లావాదేవీ కుదిరింది. దీనికి 2023 అక్టోబర్1 నుంచి టికింగ్ ఫీజు సైతం జత కలవనుంది. వెరసి మొత్తం 2.5 బిలియన్ డాలర్లు వెచి్చంచనుంది. నియంత్రణ సంస్థల అనుమతుల తదుపరి 2024 ద్వితీయార్ధంలో డీల్ ముగిసే వీలున్నట్లు అంచనా. డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్(డీఐటీ) ద్వారా ఏటీసీ ఇండియా బిజినెస్‌లో 100 శాతం వాటా కొనుగోలుకి ఏటీసీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్ పేర్కొంది. ఏటీసీ ఇండియాకు దేశీయంగా సుమారు 78,000 టెలికం సైట్స్ ఉన్నాయి. డీల్ ద్వారా ప్రస్తుత మారకపు ధర ప్రకారం దాదాపు రూ. 21,000 కోట్ల నగదును అందుకోనున్నట్లు ఏటీసీ వెల్లడించింది. నిధులను రుణ చెల్లింపులకు వినియోగించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఇది దేశీయంగా టెలికమ్యూనికేషన్స్ విభాగంలో బ్రూక్‌ఫీల్డ్ చేపట్టిన మూడో కొనుగోలుకావడం గమనార్హం! 1,75,000 టవర్లు రిలయన్స్ ఇండ్రస్టియల్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ హోల్డింగ్స్ నుంచి 2020లో బ్రూక్‌ఫీల్డ్ 1,75,000 టవర్ల పోర్ట్‌ఫోలియోను సొంతం చేసుకుంది. 2022 లో 5,000 ఇన్డోర్ బిజినెస్ సొల్యూషన్ సైట్లు, స్మాల్ సెల్ సైట్లను కొనుగోలు చేసింది. వీటిద్వారా టెల్కోలకు 5జీ సేవలు, క్లిష్టమైన ప్రాంతాల్లో కవరేజీ విస్తరణకు వీలు కలి్పంచనుంది. తాజా కొనుగోలుతో దేశీ టెలికం టవర్ల పోర్ట్‌ఫోలియో విస్తరణసహా పటిష్టపరచేందుకు కృషి చేయనున్నట్లు బ్రూక్‌ఫీల్డ్ మధ్యప్రాచ్యం, భారత్ కార్యకలాపాల మౌలిక సదుపాయాల హెడ్ అరి్పత్ అగర్వాల్ చెప్పారు. దీంతో తమ కస్టమర్లు, భాగస్వాములకు విస్తారిత సేవలు అందించనున్నట్లు తెలిపారు. -
ఏటీసీకి వొడాఫోన్ టవర్లు
న్యూఢిల్లీ: వొడాఫోన్ ఇండియా టవర్ల వ్యాపార విక్రయం పూర్తయింది. భారత్‌లోని టవర్ల వ్యాపారాన్ని అమెరికన్ టవర్ కార్పొరేషన్(ఏటీసీ) టెలికం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.3,850 కోట్లకు విక్రయించడం పూర్తయిందని వొడాఫోన్ ఇండియా తెలిపింది. ప్రస్తుతం తమకు 58,000 మొబైల్ టవర్లున్నాయని ఏటీసీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్(ఏషియా) అమిత్ శర్మ తెలిపారు. వొడాఫోన్ నుంచి కొనుగోలు చేసిన 10,200 టవర్లతో తమ మొబైల్ టవర్ల వ్యాపారం మరింత శక్తివంతం అవుతుందని వివరించారు. భారత్‌లోని తమ క్లయింట్లు 4జీ సేవలను విస్తరిస్తుండటంతో వారికి మరింత సమర్థవంతమైన సేవలందించడానికి వీలవుతుందని వివరించారు. ఐడియాతో కుదుర్చుకున్న రూ.4,000 కోట్ల టవర్ల కొనుగోలు ఒప్పందం పూర్తికావలసి ఉందని తెలిపారు. ఐడియా డీల్‌కు ఈ నెలాఖరుకల్లా సంబంధిత అనుమతులు వస్తాయని భావిస్తున్నామని, వచ్చే నెల చివరికల్లా ఈ డీల్ పూర్తవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఐడియా, వొడాఫోన్ల నుంచి కొనుగోలు చేసే 20,000 టవర్ల కారణంగా ఏటీసీకి తొలి పూర్తి ఏడాదికి రూ.2,100 కోట్ల ప్రోపర్టీ ఆదాయం, రూ.800 కోట్ల స్థూల మార్జిన్ వస్తాయని అంచనా. వొడాఫోన్, ఐడియాకు చెందిన మొత్తం 20,000 టవర్లను రూ.7,850 కోట్లకు కొనుగోలు చేయడానికి గతేడాది నవంబర్‌లో ఏటీసీ డీల్ కుదుర్చుకుంది. ఐడియా–ఏటీసీ టవర్ల డీల్ పూర్తయిన తర్వాతనే ఐడియా, ఓడాఫోన్ విలీనం పూర్తవుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఐడియాతో విలీనం ఈఏడాది జూన్‌కల్లా పూర్తవ్వగలదని వొడాఫోన్ పేర్కొంది. -
పూర్తిస్థాయిలో పనిచేస్తున్న సహార్ ఏటీసీ
సాక్షి, ముంబై: ముంబైలోని ఛత్రపతి శివాజీ (సహార్) అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్మించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) టవర్ పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభించింది. విమానాల రాకపోకలతో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ముంబై ఒకటి. ఇక్కడ ఏటీసీ టవర్‌ను 83.8 మీటర్లు అంటే దాదాపు 30 అంతస్తుల ఎత్తులో నిర్మించారు. ప్రస్తుతం ఇక్కడున్న ఏటీసీ టవర్ కంటే కొత్త నిర్మాణం 20 మీటర్లు ఎక్కువ ఎత్తు ఉంది. దీన్ని 2013 అక్టోబరులోనే ప్రారంభించారు. అయినప్పటికీ ఇప్పటి వరకు పాత, కొత్త ఏటీసీ టవర్ల సమన్వయంతో విమానాల రాకపోకలను నియంత్రిస్తున్నారు. ఇప్పుడు పాత ఏటీసీ టవర్‌ను పూర్తిగా మూసివేశామని విమానాశ్రయ అధికారులు తెలిపారు. అందులోని విద్యుత్ పరికరాలు, కంప్యూటర్లు, ఇతర సాంకేతిక యంత్రాలన్నింటినీ కొత్త ఏటీసీ టవర్‌లోకి తరలించారు. దీంతో బుధవారం నుంచి కొత్త ఏటీసీ టవర్ పూర్తిగా పనిచేయడం ప్రారంభించింది. ఈ కొత్త టవర్ నుంచి విమానాశ్రయం పరిసరాల్లోని ఐదు కిలోమీటర్ల దూరం వరకు 360 డిగ్రీల కోణంలో ఎలాంటి అడ్డంకులూ లేకుండా విమానాల రాకపోకలపై కంట్రోలర్లు నిఘా వేయవచ్చు. 2,884 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ టవర్‌పైన ఒక షిఫ్టులో 10 మంది క ంట్రోలర్లు, 12 మందికిపైగా ఇంజినీర్లు విధులు నిర్వహిస్తున్నారు. పాత ఏటీసీని త్వరలో నేలమట్టం చేయనున్నారు. విమానాశ్రయం నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్న జీవీకే గ్రూపు కంపెనీకీ ఆ స్థలాన్ని అప్పగించనున్నారు. అదనంగా లభించే ఈ స్థలంతో మరిన్ని విమానాల సేవలు ప్రారంభిస్తారు. మొత్తం రూ.120 కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ ఏటీసీ టవర్ దేశంలోనే అత్యంత ఎత్తయినదని అధికారులు తెలిపారు. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ విమానాశ్రయంలో 102 మీటర్ల ఎత్తయిన ఏటీసీ టవర్ నిర్మాణంలో ఉంది. అది పూర్తయ్యేంత వరకు ముంబై విమానాశ్రయానికే ఆ ఘనత దక్కనుంది.