ఆడి ఆర్8 వీ10 ప్లస్@రూ. 2.62 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం ఆడి ఆర్8 వీ10 ప్లస్ మోడల్‌ను హైదరాబాద్ మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ. 2.62 కోట్లు (హైదరాబాద్ ఎక్స్‌షోరూం). రేస్ కార్ అయిన ఆడి ఆర్8 ఎల్‌ఎంఎస్ మోడల్‌కు చెందిన 50 శాతం విడిభాగాలను వీ10 ప్లస్ తయారీలో వాడారు. 610 హెచ్‌పీతో 5.2 ఎఫ్‌ఎస్‌ఐ క్వాట్రో ఇంజన్‌ను పొందుపరిచారు. 100 కిలోమీటర్ల వేగాన్ని 3.2 సెకన్లలో అందుకుంటుంది.
గరిష్ట వేగం గంటకు 330 కిలోమీటర్లు. 31.24 సెంటీమీటర్ల స్క్రీన్‌తో వర్చువల్ కాక్‌పిట్ అదనపు ఆకర్షణ. వినూత్న టెక్నాలజీ కారణంగా.. రాత్రి వేళ కారు వేగం గంటకు 60 కిలోమీటర్లు దాటగానే లేజర్ లైట్లు తెరుచుకుని అధిక కాంతిని ఇస్తాయని ఆడి హైదరాబాద్ ఎండీ రాజీవ్ ఎం. సంఘ్వీ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. ఇప్పటికే మూడు బుకింగ్స్ నమోదు అయ్యాయన్నారు. 9 ఏళ్లలో తమ షోరూం ద్వారా మొత్తం 2,700లకుపైగా కార్లు విక్రయించామని చెప్పారు. తమ అమ్మకాల్లో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల వాటా 25 శాతమే అయినప్పటికీ, వృద్ధి రేటు ఏకంగా 35 శాతముందని అన్నారు.