8.50 లక్షల డీజిల్ కార్లు వెనక్కి
ఫ్రాక్ఫర్ట్ : జర్మన్ ఆటో దిగ్గజం ఆడీ ఏజీ భారీమొత్తంలో డీజిల్ కార్లను వెనక్కి తీసుకుంటుంది. ఆరు సిలిండర్, ఎనిమిది సిలిండర్ డీజిల్ ఇంజిన్ గల 8,50,000 లక్షల కార్లను ప్రపంచవ్యాప్తంగా వెనక్కి తీసుకుంటున్నట్టు ఆడీ ఏజీ తెలిపింది. అమెరికా, కెనడా దేశాల మినహా మిగతా అన్ని దేశాల్లో ఈ కార్లు రీకాలింగ్ ప్రక్రియను కంపెనీ చేపట్టనున్నట్టు చెప్పింది. ఈ కార్లలో ఉద్గారాలను మెరుగుపరచడానికే ఆడీ ఈ రీకాల్ చేస్తోంది. ఫోక్స్‌వాగన్ గ్రూప్‌కు ఆడీ ఏజీ సబ్సిడరీ గ్రూప్. ఆడి కూడా ఈ డీజిల్ ఉద్గారాల స్కామ్‌కు పాల్పడినట్టు వెల్లడైంది. దీంతో ఈ కంపెనీ తన కస్టమర్లకు ఉచితంగా రిట్రోఫిట్ ప్రొగ్రామ్‌ను ఆఫర్ చేస్తోంది.
ఈయూ5, ఈయూ6 డీజిల్ ఇంజిన్‌తో ఉన్న కార్లు, ముఖ్యంగా ఈ ప్రభావితమైన కార్లకు ఉచితంగా సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేస్తామని ఆడీ ప్రకటించింది. అంతేకాక మొత్తంగా ఉద్గారాలను తగ్గించాలని కంపెనీ భావిస్తోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ ఉద్గారాలను తగ్గించాలనుకుంటున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో చెప్పింది. అదేవిధంగా ఉచిత సర్వీసులను పోర్స్చే, ఫోక్స్ వాగన్ మోడల్ కార్లకు ఆడీ చేపట్టనుంది. ఇదే కారణంతో మరో జర్మన్ కార్ల తయారీసంస్థ డైమ్లర్ ఏజీ కూడా మెర్సిడెస్ బెంజ్ బ్రాండుతో ఉన్న 30 లక్షలకు పైగా డీజిల్ కార్లను యూరప్ అంతటా రీకాల్ చేస్తోంది. దీని ప్రభావంతో ఆ కంపెనీకి 220 మిలియన్ యూరోల నష్టం వాటిల్లుతోంది. ఉద్గారాల పరీక్షలో డైమ్లర్, ఆడీ రెండూ కూడా సాఫ్ట్‌వేర్ అక్రమాలకు పాల్పడినట్టు తెలిసింది.