హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : డౌన్ పేమెంటేమీ లేకుండా నచ్చిన కారు చేతికొస్తే..!! అదీ నిర్వహణ, బీమా వంటి ఖర్చులు లేకుండా జస్ట్ నెలవారీ అద్దెతో!!. చాలామందికి ఇది నచ్చే వార్తే. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకునే ఇపుడు వాహన తయారీ కంపెనీలు కార్ల లీజింగ్ వ్యాపారంలోకి ఎంట్రీ ఇస్తున్నాయి. కార్ల విక్రయాలు తగ్గుతున్న నేపథ్యంలో కస్టమర్లను ఆకట్టుకోవటానికి అవి లీజు మార్గాన్ని ఎంచుకుంటున్నాయి.
లీజు ప్రయోజనం ఏంటంటే...
కస్టమర్‌పై ముందస్తు (డౌన్ పేమెంట్) చెల్లింపు భారం ఉండదు. బీమా, రోడ్ ట్యాక్స్, యాక్సిడెంటల్ రిపేర్లు, మెయింటెనెన్స్ అంతా కార్ల కంపెనీయే చూసుకుంటుంది. ఓ ఐదేళ్ల పాటు నెలవారీ కంపెనీ నిర్దేశించిన సొమ్మును చెల్లిస్తే చాలు. ఐదేళ్ల తరువాత వాహనాన్ని తిరిగి కంపెనీకి అప్పగించాల్సి ఉంటుంది. అంతే!!. కాల పరిమితి, ఈఎంఐ మొత్తం అనేవి మోడల్‌ను బట్టి మారుతాయి. ఈ విధానంలో కంపెనీలు కనీసం 2 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు కార్లను లీజుకిస్తున్నాయి. లీజు పూర్తి కాకముందే కస్టమర్ మరో మోడల్‌కు అప్‌గ్రేడ్ కావొచ్చు కూడా!!.
వినియోగదారు తనకు నచ్చిన మోడళ్లను తరచూ మార్చుకునేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని వరుణ్ మోటార్స్ ఎండీ వరుణ్ దేవ్ చెప్పారు. లీజు విధానం ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తోందన్నారు.
రిటైల్ కస్టమర్లకు సైతం..
దేశీయంగా 2018–19లో అన్ని కంపెనీలూ కలిసి 33,77,436 ప్యాసింజర్ వెహికిల్స్ విక్రయించాయి. అంతకు ముందటేడాదితో పోలిస్తే వృద్ధి రేటు 2.7 శాతం మాత్రమే. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–మే నెలలో విక్రయాలు ఏకంగా 19 శాతం పడిపోయాయి. బలహీన సెంటిమెంటు, వాహన ధరలు పెరగడం, ఆర్జించే వ్యక్తులపై పన్ను భారం వంటివి దీనికి కారణాలుగా చెప్పొచ్చు. మరోవైపు ఉబెర్, ఓలా వంటి రైడ్ షేరింగ్ కంపెనీల కార్యకలాపాలు ద్వితీయ శ్రేణి నగరాలకూ విస్తృతమవుతున్నాయి. దీంతో అమ్మకాలు పెంచుకోవటానికి కంపెనీలు అన్ని మార్గాలనూ అన్వేషిస్తున్నాయి. ఇందులో లీజింగ్ ఒకటి. కార్పొరేట్ క్లయింట్లకు లీజుపై వాహనాలను దాదాపు అన్ని కంపెనీలు ఇస్తున్నాయి. ఈ మధ్య రిటైల్ కస్టమర్లకూ ఈ సేవల్ని విస్తరించాయి. ఓరిక్స్ ఆటో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఏఎల్‌డీ ఆటోమోటివ్, రెవ్ కార్స్ వంటి లీజింగ్ కంపెనీల భాగస్వామ్యంతో హ్యుందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా, స్కోడా, ఎఫ్‌సీఏ ఇండియా ప్రస్తుతం ఈ రంగంలోకి వచ్చాయి. మారుతీ, టాటా వంటి సంస్థలూ త్వరలో వస్తామనే సంకేతాలిస్తున్నాయి. ‘లీజింగ్ విధానం మంచిదే. మార్కెట్ తీరుతెన్నులను గమనిస్తున్నాం’ అని మారుతి సుజుకి మార్కెటింగ్, సేల్స్ ఈడీ శశాంక్ శ్రీవాస్తవ చెప్పారు.
తక్కువ ఖర్చుతో...
ఉద్యోగులు, వృత్తి నిపుణులు, చిన్న, మధ్య తరహా కంపెనీలు కార్లను లీజుకు తీసుకోవచ్చు. నగరం, వాహనం మోడల్, కాల పరిమితిని బట్టి నెలవారీ లీజు మొత్తం మారుతుంది. అయిదేళ్ల కాల పరిమితిపై హ్యుందాయ్ శాంత్రో బేసిక్ మోడల్ కారు నెలవారీ అద్దె సుమారు రూ.7,670 ఉంది. క్రెటా విషయంలో రూ.17,640 చార్జీ చేస్తారు. ఇదే వర్షన్ క్రెటా కొనాలంటే డౌన్ పేమెంట్ రూ.2.7 లక్షలిచ్చాక, ఈఎంఐ రూ.18,900 దాకా అవుతోంది. ఇక మహీంద్రా కేయూవీ100ఎన్‌ఎక్స్‌టీ రూ.13,499, ఎక్స్‌యూవీ500 రూ.32,999లుగా నిర్ణయించారు. స్కోడా మోడల్ ప్రారంభ అద్దె రూ.19,856. ప్రస్తుతం సూపర్బ్ మోడల్ మాత్రమే ఈజీ బై కింద అందుబాటులో ఉందని కంపెనీ తెలిపింది. ఫియట్, జీప్ మోడళ్లను ఎఫ్‌సీఏ ఇండియా లీజు కింద ఆఫర్ చేస్తోంది.
లీజుకు షి‘కారు’!!
Published Sat, Jun 15 2019 2:19 AM | Last Updated on Sat, Jun 15 2019 2:19 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment