Automakers
-
హోండా, నిస్సాన్ విలీనం
టోక్యో: జపాన్ ఆటోమొబైల్ దిగ్గజాలు హోండా, నిస్సాన్ విలీనం కానున్నట్లు ప్రకటించాయి. ఇందుకు సంబంధించి ఇరు సంస్థలు ఒక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. నిస్సాన్‌కు వాటాలున్న మిత్సుబిషి మోటార్స్ కూడా తన వ్యాపారాన్ని విలీనం చేసే చర్చల్లో భాగమయ్యేందుకు అంగీకరించినట్లు కంపెనీలు వెల్లడించాయి. ఈ డీల్‌తో విలీన సంస్థ.. అమ్మకాలపరంగా ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆటోమొబైల్ కంపెనీగా ఆవిర్భవించనుంది. ఫ్రాన్స్‌కు చెందిన రెనోతో భాగస్వామ్యం, అలాగే మిత్సుబిషి మోటార్స్ కార్ప్‌లతో కలిసి హోండా, నిస్సాన్ కూటమి.. జపాన్‌కే చెందిన ఆటోమొబైల్ దిగ్గజం టయోటా మోటర్ కార్ప్, జర్మనీకి చెందిన ఫోక్స్వ్యాగన్లతో పోటీ పడనుంది. విలీనం అమల్లోకి వస్తే మరింత పెద్ద స్థాయిలో కస్టమర్లకు చేరువయ్యేందుకు తోడ్పడగలదని నిస్సాన్ సీఈవో మకొటొ యుషిడా తెలిపారు. ఇటీవలే హోండా, నిస్సాన్ విలీన వార్తలు రావడం తెలిసిందే. ఆటోమొబైల్ పరిశ్రమ క్రమంగా శిలాజ ఇంధనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలు, స్వయంచాలిత టెక్నాలజీల వైపు మళ్లుతున్న తరుణంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.50 బిలియన్ డాలర్ల దిగ్గజం..: మూడు కంపెనీల కలయికతో 50 బిలియన్ డాలర్ల పైగా మార్కెట్ విలువ గల దిగ్గజ సంస్థ ఏర్పాటవుతుంది. వీటి వార్షిక వాహనాల ఉత్పత్తి పరిమాణం 80 లక్షలు ఉంటుంది. 2023లో హోండా 40 లక్షలు, నిస్సాన్ 34 లక్షలు, మిత్సుబిషి మోటర్స్ దాదాపు 10 లక్షల వాహనాలను ఉత్పత్తి చేశాయి. అయితే ఈ మూడూ కలిసినా కూడా ఉత్పత్తిపరంగా టయోటానే అగ్రగామిగా కొనసాగనుంది. 2023లో టయోటా మొత్తం 1.15 కోట్ల వాహనాల తయారీతో టాప్‌లో ఉంది. ఫోక్స్‌వ్యాగన్ సుమారు 89 లక్షల వాహనాల ఉత్పత్తితో రెండో స్థానంలో నిల్చింది. ప్రస్తుతం దాదాపు 68 లక్షల వాహనాలతో (కియా, జెనెసిస్ బ్రాండ్లతో కలిసి) దక్షిణ కొరియా సంస్థ హ్యుందాయ్ మూడో స్థానంలో ఉంది. ప్రయోజనాలేమిటంటే.. ఒకవైపు వాహన కంపెనీలు శిలాజ ఇంధనాల వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లేందుకు తంటాలు పడుతుండగా మరోవైపు చైనా కంపెనీలు కొత్త టెక్నాలజీల విషయంలో దూసుకెళ్తుండటం పరిశ్రమను కుదిపేస్తోంది. చైనాకు చెందిన బీవైడీ, గ్రేట్ వాల్, నియో వంటి చౌక ప్రత్యామ్నాయ ఎలక్ట్రిక్ వాహనాలు.. జపాన్, అమెరికన్ కార్ల కంపెనీల మార్కెట్ వాటాను కొల్లగొడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పరిశ్రమలో కన్సాలిడేషన్ చోటుచేసుకుంటున్నట్లు పరిశ్రమల వర్గాలు తెలిపాయి. ఆరి్థక సమస్యలు, తగ్గుతున్న లాభదాయకతతో నిస్సాన్ సతమతమవుతోంది. చైనాలో అమ్మకాల బలహీన తతో హోండా లాభాలపైనా ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో విలీనం చోటు చేసుకుంటోంది. 2023లో జరిగిన అమ్మకాల పరంగా టాప్ 10 అతిపెద్ద వాహన తయారీదారుల జాబితాటయోటా - 10.3 మిలియన్ వాహనాలువోక్స్ వ్యాగన్ గ్రూప్ - 9.2 మిలియన్ వాహనాలుహ్యుందాయ్ మోటార్ గ్రూప్ - 7.3 మిలియన్ వాహనాలుస్టెలాంటిస్ - 6.4 మిలియన్ వాహనాలుజనరల్ మోటార్స్ - 6.2 మిలియన్ వాహనాలుఫోర్డ్ మోటార్ కంపెనీ - 4.4 మిలియన్ వాహనాలుహోండా - 4.2 మిలియన్ వాహనాలునిస్సాన్ - 3.4 మిలియన్ వాహనాలు(నోట్: విలీన ప్రక్రియ పూర్తైతే హోండా, నిస్సాన్ కలిపి అమ్మకాల్లో టాప్ 3 కంపెనీ అవతరించినట్లువుతుంది.)బీఎండబ్ల్యూ గ్రూప్ - 2.6 మిలియన్ వాహనాలుమెర్సిడెస్ బెంజ్ - 2.5 మిలియన్ వాహనాలు -
చైనాలో చవగ్గా ఎలక్ట్రిక్ వాహనాలు.. వెస్ట్రన్ ఆటో దిగ్గజాల్లో దిగులు!
యునైటెడ్ స్టేట్స్లో ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటే సాధారణ పెట్రోల్, డీజీల్ వాహనాల కంటే రెండు రెట్లు ఎక్కువ ఖర్చు అవుతుంది. అదే చైనాలో అయితే కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనాలంటే మామూలు పెట్రోల్, డీజీల్ వాహనం కంటే చవగ్గా దాదాపు 9 శాతం తక్కువ ధరకే లభిస్తుంది. ఇదే అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజాలకు గుబులు పుట్టిస్తోంది. ఆటోమోటివ్ పరిశ్రమలో విస్తృతంగా పెరుగుతున్న ధరల అంతరానికి ఇది సంకేతంగా నిలుస్తోంది. యూఎస్, యూరప్, ఇతర ప్రాంతాలలో లెగసీ ఆటోమేకర్లు విక్రయిస్తున్న ఈవీలు ఇప్పటికీ వాటి సంప్రదాయ ఇంధన వాహనాల కంటే ఎక్కువ ధరను కలిగి ఉన్నాయి. కానీ చైనాలో సామాన్యులు కూడా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయగలిగేలా వాటి ధరలు ఉన్నాయి. చైనాలో సగం ధరకే.. గ్లోబల్ ఆటోమోటివ్ మార్కెట్ రీసెర్చ్ సంస్థ జేఏటీవో డైనమిక్స్ (JATO Dynamics) డేటా ప్రకారం.. 2023 ప్రథమార్థంలో సగటు ఈవీ ధర యూరోప్‌లో 66,864 యూరోలు (ప్రస్తుత మారకపు ధరల ప్రకారం రూ.59 లక్షలు), యూఎస్‌లో 68,023 యూరోలు (రూ.60 లక్షలు) . దీనికి విరుద్ధంగా చైనాలో మాత్రం సగటు ఈవీ ధర సగం కంటే తక్కువ అంటే కేవలం 31,165 యూరోలు (రూ.27.5 లక్షలు) ఉంది. -
మహీంద్రా ఎక్స్‌యూవీ700 @ రూ.11.99 లక్షలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి కొత్త ఎస్యూవీ ఎక్స్‌యూవీ700 మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.11.99 లక్షల నుంచి ప్రారంభం. డీజిల్, పెట్రోల్ వేరియంట్లలో మాన్యువల్, ఆటోమేటిక్ ఆప్షన్స్‌తో 5, 7 సీట్ల సామర్థ్యంతో వాహనాన్ని రూపొందించారు. వేరియంట్‌నుబట్టి స్మార్ట్ డోర్ హ్యాండిల్స్, స్కైరూఫ్, కర్టెయిన్ ఎయిర్‌బ్యాగ్స్, డ్రైవర్ డ్రౌజినెస్ అలర్ట్, స్మార్ట్ క్లీన్ జోన్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్, సైడ్ ఎయిర్‌బ్యాగ్స్, మెమరీతో 6–వే పవర్ సీట్, సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్స్, బ్లైండ్ వ్యూ మానిటరింగ్, ఎల్రక్టానిక్ పార్క్ బ్రేక్, వైర్లెస్ చార్జింగ్, 360 సరౌండ్ వ్యూ వంటి హంగులు ఉన్నాయి. -
లీజుకు షి‘కారు’!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : డౌన్ పేమెంటేమీ లేకుండా నచ్చిన కారు చేతికొస్తే..!! అదీ నిర్వహణ, బీమా వంటి ఖర్చులు లేకుండా జస్ట్ నెలవారీ అద్దెతో!!. చాలామందికి ఇది నచ్చే వార్తే. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకునే ఇపుడు వాహన తయారీ కంపెనీలు కార్ల లీజింగ్ వ్యాపారంలోకి ఎంట్రీ ఇస్తున్నాయి. కార్ల విక్రయాలు తగ్గుతున్న నేపథ్యంలో కస్టమర్లను ఆకట్టుకోవటానికి అవి లీజు మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. లీజు ప్రయోజనం ఏంటంటే... కస్టమర్‌పై ముందస్తు (డౌన్ పేమెంట్) చెల్లింపు భారం ఉండదు. బీమా, రోడ్ ట్యాక్స్, యాక్సిడెంటల్ రిపేర్లు, మెయింటెనెన్స్ అంతా కార్ల కంపెనీయే చూసుకుంటుంది. ఓ ఐదేళ్ల పాటు నెలవారీ కంపెనీ నిర్దేశించిన సొమ్మును చెల్లిస్తే చాలు. ఐదేళ్ల తరువాత వాహనాన్ని తిరిగి కంపెనీకి అప్పగించాల్సి ఉంటుంది. అంతే!!. కాల పరిమితి, ఈఎంఐ మొత్తం అనేవి మోడల్‌ను బట్టి మారుతాయి. ఈ విధానంలో కంపెనీలు కనీసం 2 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు కార్లను లీజుకిస్తున్నాయి. లీజు పూర్తి కాకముందే కస్టమర్ మరో మోడల్‌కు అప్‌గ్రేడ్ కావొచ్చు కూడా!!. వినియోగదారు తనకు నచ్చిన మోడళ్లను తరచూ మార్చుకునేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని వరుణ్ మోటార్స్ ఎండీ వరుణ్ దేవ్ చెప్పారు. లీజు విధానం ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తోందన్నారు. రిటైల్ కస్టమర్లకు సైతం.. దేశీయంగా 2018–19లో అన్ని కంపెనీలూ కలిసి 33,77,436 ప్యాసింజర్ వెహికిల్స్ విక్రయించాయి. అంతకు ముందటేడాదితో పోలిస్తే వృద్ధి రేటు 2.7 శాతం మాత్రమే. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–మే నెలలో విక్రయాలు ఏకంగా 19 శాతం పడిపోయాయి. బలహీన సెంటిమెంటు, వాహన ధరలు పెరగడం, ఆర్జించే వ్యక్తులపై పన్ను భారం వంటివి దీనికి కారణాలుగా చెప్పొచ్చు. మరోవైపు ఉబెర్, ఓలా వంటి రైడ్ షేరింగ్ కంపెనీల కార్యకలాపాలు ద్వితీయ శ్రేణి నగరాలకూ విస్తృతమవుతున్నాయి. దీంతో అమ్మకాలు పెంచుకోవటానికి కంపెనీలు అన్ని మార్గాలనూ అన్వేషిస్తున్నాయి. ఇందులో లీజింగ్ ఒకటి. కార్పొరేట్ క్లయింట్లకు లీజుపై వాహనాలను దాదాపు అన్ని కంపెనీలు ఇస్తున్నాయి. ఈ మధ్య రిటైల్ కస్టమర్లకూ ఈ సేవల్ని విస్తరించాయి. ఓరిక్స్ ఆటో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏఎల్‌డీ ఆటోమోటివ్, రెవ్ కార్స్ వంటి లీజింగ్ కంపెనీల భాగస్వామ్యంతో హ్యుందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా, స్కోడా, ఎఫ్సీఏ ఇండియా ప్రస్తుతం ఈ రంగంలోకి వచ్చాయి. మారుతీ, టాటా వంటి సంస్థలూ త్వరలో వస్తామనే సంకేతాలిస్తున్నాయి. ‘లీజింగ్ విధానం మంచిదే. మార్కెట్ తీరుతెన్నులను గమనిస్తున్నాం’ అని మారుతి సుజుకి మార్కెటింగ్, సేల్స్ ఈడీ శశాంక్ శ్రీవాస్తవ చెప్పారు. తక్కువ ఖర్చుతో... ఉద్యోగులు, వృత్తి నిపుణులు, చిన్న, మధ్య తరహా కంపెనీలు కార్లను లీజుకు తీసుకోవచ్చు. నగరం, వాహనం మోడల్, కాల పరిమితిని బట్టి నెలవారీ లీజు మొత్తం మారుతుంది. అయిదేళ్ల కాల పరిమితిపై హ్యుందాయ్ శాంత్రో బేసిక్ మోడల్ కారు నెలవారీ అద్దె సుమారు రూ.7,670 ఉంది. క్రెటా విషయంలో రూ.17,640 చార్జీ చేస్తారు. ఇదే వర్షన్ క్రెటా కొనాలంటే డౌన్ పేమెంట్ రూ.2.7 లక్షలిచ్చాక, ఈఎంఐ రూ.18,900 దాకా అవుతోంది. ఇక మహీంద్రా కేయూవీ100ఎన్ఎక్స్టీ రూ.13,499, ఎక్స్‌యూవీ500 రూ.32,999లుగా నిర్ణయించారు. స్కోడా మోడల్ ప్రారంభ అద్దె రూ.19,856. ప్రస్తుతం సూపర్బ్ మోడల్ మాత్రమే ఈజీ బై కింద అందుబాటులో ఉందని కంపెనీ తెలిపింది. ఫియట్, జీప్ మోడళ్లను ఎఫ్సీఏ ఇండియా లీజు కింద ఆఫర్ చేస్తోంది. -
వాహన విక్రయాల జోరు:టాప్ గేర్‌లో దిగ్గజాలు
సాక్షి,న్యూఢిల్లీ: నవంబర్ వాహనాల అమ్మకాల్లో దిగ్గజ కంపెనీలు దూసుకుపోయాయి. మారుతి సుజుకి, హ్యుందాయ్, మహీంద్రా, టొయోటాతో సహా ఆటో మేజర్లన్నీ గత నెలలో ఆరోగ్యకరమైన వృద్ధిని పోస్ట్ చేసాయి. భారీగా పుంజుకున్న అమ్మకాలతో డబుల్ డిజిట్ గ్రోత్ సాధించాయి. ఇయర్ ఆన్ ఇయర్ 26శాతం వృద్ధిచెందిన మొత్తంఅమ్మకాలు 6లక్షలకుపైగా నమోదయ్యాయి. గ్రామీణ మార్కెట్లలో డిమాండ్ పెరగడంతో పాటు కొత్త మోడళ్ళకు మంచి స్పందన లభిస్తోంది. మారుతి సుజుకీ ఇండియా అమ్మకాలు 15 శాతం పెరిగి 1,45,300 యూనిట్లు విక్రయించగా .. గత ఏడాది నవంబర్‌లో 1,26,325 యూనిట్లు విక్రయించింది. ఇందులో స్విఫ్ట్, డిజైర్, బాలెనో కార్ల అమ్మకాలు 32.4 శాతం పెరిగి 65,447 యూనిట్లకు చేరుకున్నాయి. యుటిలిటీ వాహన విక్రయాలు, జిప్సీ, గ్రాండ్ విటారా, ఎర్టిగా, ఎస్-క్రాస్, కాంపాక్ట్ ఎస్యూవీ వీటారా బ్రెజ్జాలతో సహా నవంబర్ నెలలో 34 శాతం పెరిగి 23,072 యూనిట్లు విక్రయించింది. అయితే, ఆల్టో, వ్యాగన్ఆర్ సహా మినీ సెగ్మెంట్ కార్ల అమ్మకాలు 1.8 శాతం క్షీణించి 38,204 యూనిట్లు విక్రయించగా .. అక్టోబర్‌లో 38,886 యూనిట్లు అమ్ముడయ్యాయి. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఐఎల్) దేశీయ అమ్మకాల్లో 10 శాతం పెరిగి 44,008 యూనిట్లు విక్రయించింది. గ్రాండ్ ఐ 10, ఎలైట్ ఐ 20, క్రేతాతో పాటుగా తరువాతి తరానికి చెందిన వెర్నా బలమైన పనితీరు కారణంగా గత నెలలో వృద్ధి సాధించామని హెచ్ఎంఐఐఎల్ డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాత్సవ తెలిపారు సెప్టెంబర్ నుంచి డిసెంబరు 2017 వరకూ గ్రామీణ ప్రాంతాల డిమాండ్‌తో పాటు, పండుగ సీజన్కారణంగా నమోదైన వృద్ధితో..2 లక్షల యూనిట్ల రిటైల్ అమ్మకాలను ఆశిస్తున్నట్టు చెప్పారు. దేశీయ మార్కెట్లో మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాలు 21 శాతం వృద్ధితో 36,039 యూనిట్లు విక్రయించింది. ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో స్కోర్పియో, జియోలో, బొలోరో, వెరిటోలతో పోలిస్తే 21 శాతం పెరిగి 16,030 యూనిట్లు విక్రయించగా గత ఏడాది ఇదే నెలలో 13,198 యూనిట్లు విక్రయించింది. 2017 నవంబరు నెలలో సానుకూల వృద్ధి దశలో వున్నందుకు సంతోషిస్తున్నామని ఎం అండ్ ఎం ప్రెసిడెంట్ (ఆటోమోటివ్ సెక్టార్) రాజన్ వధేర తెలిపారు. ఫోర్డ్ నవంబర్ నెలలో 13.1 శాతం వృద్ధితో 7,777 యూనిట్లు విక్రయించింది. టయోటా కిర్లోస్కర్ మోటార్ అమ్మకాల్లో 13 శాతం వృద్ధితో 12,734 యూనిట్లు విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో 11,309 యూనిట్లు విక్రయించింది. ఇక ద్విచక్ర వాహన విభాగంలో ద్విచక్ర వాహన అమ్మకాలు 21 శాతం పెరిగి 3,26,458 యూనిట్లు విక్రయించగా గత ఏడాది ఇదే నెలలో 2,69,948 యూనిట్లు విక్రయించింది. ఐషర్ మోటార్స్ ద్విచక్ర వాహన విభాగంలోని రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాలు 21 శాతం పెరిగి 7,776 యూనిట్లు విక్రయించగా గత ఏడాది ఇదే నెలలో 55,843 యూనిట్లగా నమోదైంది. సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా అమ్మకాలు 42,722 యూనిట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో 30,830 యూనిట్లు విక్రయించగా .. 38.6 శాతం వృద్ధిని నమోదు చేసింది. -
వరుసగా 12వ నెలా రయ్.. రయ్..
పాసింజర్ వాహనాలు వరుసగా 12వ నెల కూడా అమ్మకాల్లో దూసుకెళ్లాయి. కార్లు, యుటిలిటీ వెహికిల్స్, వ్యాన్ల అమ్మకాలు జూన్ నెలలో 2.68శాతం పెరిగి 2,23,454 యూనిట్లగా నమోదయ్యాయి. ఇండస్ట్రి బాడీ భారత ఆటోమొబైల్ తయారీదారుల సొసైటీ(సియామ్) విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది. అయితే కారు విభాగంలో అమ్మకాలు క్షీణించాయి. గత ఏడాది కంటే 5.18శాతం పడిపోయి, 12,54,237 యూనిట్లగా నమోదయ్యాయి. గతేడాది జూన్ లో కార్ల అమ్మకాలు 1,62,655 యూనిట్లగా ఉన్నాయి. మారుతీ సుజుకీ ఇండియా అతిపెద్ద వెండర్స్ లో ఒకటైన సుబ్రోష్ లిమిటెడ్ లో అగ్నిప్రమాదం, మారుతీ ఉత్పత్తులపై ప్రభావం చూపినట్టు సియామ్ నివేదిక పేర్కొంది. ప్రముఖ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్(ఎస్ యూవీ) ఆరు నెలలో ఐదు నెలలూ పడిపోయి, కార్ల అమ్మకాలపై ప్రబావం చూపాయి. అయితే యుటిలిటీ వాహన అమ్మకాల వృద్ధిని కొనసాగించినట్టు సియామ్ వెల్లడించింది. యుటిలిటీ వాహన అమ్మకాలు 35.24శాతం పెరిగి 55,825 యూనిట్లను నమోదుచేశాయి. గత నెల వాణిజ్య వాహన అమ్మకాలు 5.63శాతం ఎగిసి 56,032 యూనిట్లగా.. టూవీలర్ వాహనాలు 12.26శాతం పెరిగి 14,68,035 యూనిట్లగా రికార్డు అయినట్టు సియామ్ తెలిపింది. స్కూటర్ల అమ్మకాలు 21.32శాతం బలమైన వృద్ధితో 21.32శాతం పెరిగి, 4,49,756 యూనిట్లుగా ఉన్నాయి. అదేవిధంగా మోటార్ సైకిల్స్ 7.52శాతం వృద్ధితో 9,43,680 యూనిట్లుగా నమోదయ్యాయి.