ఎంవోయూ కుదుర్చుకున్న కంపెనీలు
ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆటోమొబైల్ సంస్థగా ఆవిర్భావం
టోక్యో: జపాన్ ఆటోమొబైల్ దిగ్గజాలు హోండా, నిస్సాన్ విలీనం కానున్నట్లు ప్రకటించాయి. ఇందుకు సంబంధించి ఇరు సంస్థలు ఒక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. నిస్సాన్‌కు వాటాలున్న మిత్సుబిషి మోటార్స్ కూడా తన వ్యాపారాన్ని విలీనం చేసే చర్చల్లో భాగమయ్యేందుకు అంగీకరించినట్లు కంపెనీలు వెల్లడించాయి. ఈ డీల్‌తో విలీన సంస్థ.. అమ్మకాలపరంగా ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆటోమొబైల్ కంపెనీగా ఆవిర్భవించనుంది.
ఫ్రాన్స్‌కు చెందిన రెనోతో భాగస్వామ్యం, అలాగే మిత్సుబిషి మోటార్స్ కార్ప్‌లతో కలిసి హోండా, నిస్సాన్ కూటమి.. జపాన్‌కే చెందిన ఆటోమొబైల్ దిగ్గజం టయోటా మోటర్ కార్ప్, జర్మనీకి చెందిన ఫోక్స్‌వ్యాగన్‌లతో పోటీ పడనుంది. విలీనం అమల్లోకి వస్తే మరింత పెద్ద స్థాయిలో కస్టమర్లకు చేరువయ్యేందుకు తోడ్పడగలదని నిస్సాన్ సీఈవో మకొటొ యుషిడా తెలిపారు. ఇటీవలే హోండా, నిస్సాన్ విలీన వార్తలు రావడం తెలిసిందే. ఆటోమొబైల్ పరిశ్రమ క్రమంగా శిలాజ ఇంధనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలు, స్వయంచాలిత టెక్నాలజీల వైపు మళ్లుతున్న తరుణంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.
50 బిలియన్ డాలర్ల దిగ్గజం..: మూడు కంపెనీల కలయికతో 50 బిలియన్ డాలర్ల పైగా మార్కెట్ విలువ గల దిగ్గజ సంస్థ ఏర్పాటవుతుంది. వీటి వార్షిక వాహనాల ఉత్పత్తి పరిమాణం 80 లక్షలు ఉంటుంది. 2023లో హోండా 40 లక్షలు, నిస్సాన్ 34 లక్షలు, మిత్సుబిషి మోటర్స్ దాదాపు 10 లక్షల వాహనాలను ఉత్పత్తి చేశాయి. అయితే ఈ మూడూ కలిసినా కూడా ఉత్పత్తిపరంగా టయోటానే అగ్రగామిగా కొనసాగనుంది. 2023లో టయోటా మొత్తం 1.15 కోట్ల వాహనాల తయారీతో టాప్‌లో ఉంది. ఫోక్స్‌వ్యాగన్ సుమారు 89 లక్షల వాహనాల ఉత్పత్తితో రెండో స్థానంలో నిల్చింది. ప్రస్తుతం దాదాపు 68 లక్షల వాహనాలతో (కియా, జెనెసిస్ బ్రాండ్లతో కలిసి) దక్షిణ కొరియా సంస్థ హ్యుందాయ్ మూడో స్థానంలో ఉంది.
ప్రయోజనాలేమిటంటే..
ఒకవైపు వాహన కంపెనీలు శిలాజ ఇంధనాల వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లేందుకు తంటాలు పడుతుండగా మరోవైపు చైనా కంపెనీలు కొత్త టెక్నాలజీల విషయంలో దూసుకెళ్తుండటం పరిశ్రమను కుదిపేస్తోంది. చైనాకు చెందిన బీవైడీ, గ్రేట్ వాల్, నియో వంటి చౌక ప్రత్యామ్నాయ ఎలక్ట్రిక్ వాహనాలు.. జపాన్, అమెరికన్ కార్ల కంపెనీల మార్కెట్ వాటాను కొల్లగొడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పరిశ్రమలో కన్సాలిడేషన్ చోటుచేసుకుంటున్నట్లు పరిశ్రమల వర్గాలు తెలిపాయి. ఆరి్థక సమస్యలు, తగ్గుతున్న లాభదాయకతతో నిస్సాన్ సతమతమవుతోంది. చైనాలో అమ్మకాల బలహీన తతో హోండా లాభాలపైనా ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో విలీనం చోటు చేసుకుంటోంది.
2023లో జరిగిన అమ్మకాల పరంగా టాప్ 10 అతిపెద్ద వాహన తయారీదారుల జాబితా
టయోటా - 10.3 మిలియన్ వాహనాలు
వోక్స్ వ్యాగన్ గ్రూప్ - 9.2 మిలియన్ వాహనాలు
హ్యుందాయ్ మోటార్ గ్రూప్ - 7.3 మిలియన్ వాహనాలు
స్టెలాంటిస్ - 6.4 మిలియన్ వాహనాలు
జనరల్ మోటార్స్ - 6.2 మిలియన్ వాహనాలు
ఫోర్డ్ మోటార్ కంపెనీ - 4.4 మిలియన్ వాహనాలు
హోండా - 4.2 మిలియన్ వాహనాలు
నిస్సాన్ - 3.4 మిలియన్ వాహనాలు(నోట్: విలీన ప్రక్రియ పూర్తైతే హోండా, నిస్సాన్ కలిపి అమ్మకాల్లో టాప్ 3 కంపెనీ అవతరించినట్లువుతుంది.)
బీఎండబ్ల్యూ గ్రూప్ - 2.6 మిలియన్ వాహనాలు
మెర్సిడెస్ బెంజ్ - 2.5 మిలియన్ వాహనాలు
Comments
Please login to add a commentAdd a comment