
కంపెనీ సామర్థ్యాన్ని తగ్గించారు: నిస్సాన్
బాధ కలిగించే చర్యలు తప్పవు: హోండా
టోక్యో: వ్యాపార ఏకీకరణపై చర్చలను ముగించినట్లు వాహన తయారీలో ఉన్న జపాన్ సంస్థలు హోండా, నిస్సాన్, మిత్సుబిషి గురువారం తెలిపాయి. అయితే ఎలక్ట్రిక్ వాహనాలు, అటానమస్ డ్రైవింగ్ వంటి స్మార్ట్ కార్ల అభివృద్ధిపై కలిసి పనిచేయడం కొనసాగిస్తామని ఈ మూడు సంస్థలు వెల్లడించాయి. ‘చర్చలు జాయింట్ హోల్డింగ్ కంపెనీని ఏర్పాటు చేయాలన్న అంశంపై జరగాలి. కానీ హోండా అనుబంధ సంస్థగా నిస్సాన్‌ను మార్చాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ప్రపంచ పోటీలో గెలవడానికి కంపెనీలను కలపాలి. కానీ నిస్సాన్ సామర్థ్యాన్ని గుర్తించడం లేదు. కాబట్టి నేను వారి ప్రతిపాదనను అంగీకరించలేను. హోండా లేకుండా నిస్సాన్ ఆర్థిక పునరుద్ధరణ లక్ష్యంగా పెట్టుకోబోతోంది’ అని నిస్సాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మకొటొ ఉషీడా మీడియాకు వెల్లడించారు.
నిర్ణయం తీసుకోవడాన్ని వేగవంతం చేయడానికి హోండా స్టాక్ స్వాప్‌ను సూచించిందని హోండా చీఫ్ ఎగ్జిక్యూటివ్ తోషిహిరో మీబ్ అన్నారు. ‘నేను నిజంగా నిరాశ చెందాను. వ్యాపార అవకాశం గొప్పదని భావించాను. కానీ అది కార్యరూపం దాల్చాలంటే బాధ కలిగించే చర్యలు అవసరమని కూడా నాకు తెలుసు’ అని వివరించారు.
నిస్సాన్‌లో ఫాక్స్‌కాన్‌కు వాటా?
హోండా మోటార్ కంపెనీ, నిస్సాన్ మోటార్ కార్పొరేషన్ సంయుక్త హోల్డింగ్ కంపెనీని ఏర్పాటు చేయడానికి చర్చలు జరపబోతున్నట్లు 2024 డిసెంబర్‌లో ప్రకటించాయి. ఆ గ్రూప్‌లో చేరడాన్ని పరిశీలిస్తున్నట్లు మిత్సుబిషి మోటార్స్ కార్పొరేషన్ వెల్లడించింది. 2025 జూన్ నాటికి ఒప్పందాన్ని ఖరారు చేసి.. ఆగస్టు కల్లా హోల్డింగ్ కంపెనీని ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నట్లు హోండా, నిస్సాన్ మొదట్లో తెలిపాయి. ఇదిలావుంటే హోండా, నిస్సాన్ మధ్య చర్చలు విఫలమయ్యాయని జపాన్ మీడియా ఇటీవలి కాలంలో కథనాలు ప్రచురించింది. హోండాతో భాగస్వామ్యంలో ఒక చిన్న భాగస్వామిగా మారడానికి నిస్సాన్ నిరాకరించిందన్నది వార్తా కథనాల సారాంశం. నిస్సాన్‌లో వాటా తీసుకోవడాన్ని తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ పరిశీలిస్తోందన్న మీడియా ఊహాగానాల గురించి తనకు తెలియదని మీబ్ అన్నారు.
ఇదీ చదవండి: స్పోర్ట్స్ టెక్నాలజీ మార్కెట్ @ రూ. 49,500 కోట్లు
ఆర్థికంగా మెరుగ్గా హోండా..
హోండా ఆర్థికంగా చాలా మెరుగ్గా ఉంది. అలాగే ఉమ్మడి కార్యనిర్వాహక బృందంలో ముందంజలో ఉంది. 2024 ఏప్రిల్–డిసెంబర్ లాభాలు 7 శాతం తగ్గి 5 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు హోండా నివేదించింది. మరోవైపు వాహన అమ్మకాలు పడిపోవడంతో జులై–సెప్టెంబర్ త్రైమాసికంలో నిస్సాన్ నష్టాలను ప్రకటించింది. దీని ఫలితంగా 9,000 మంది ఉద్యోగులను తొలగించాల్సి వచ్చింది. ఆ సమయంలో ఫలితాలకు బాధ్యత వహిస్తూ ఉషీడా తన వేతనంలో 50 శాతం కోత విధించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment