‘మా బ్యాంకులోని ఉద్యోగులంతా రోబోల్లా పనిచేస్తారు. అలాగే రేపటి రోజున మనుషుల్లా పనిచేసే రోబోలతో మా కార్యాలయం నిండిపోవచ్చు. ఇందులో ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. మార్పులు సహజమే కదా...’ - దాయిష్ బ్యాంకు మాజీ సీఈఓ జాన్ క్రియాన్
ఆటోమేషన్... ఈ మాట వింటేనే చాలు సగటు ఉద్యోగి గుండెల్లో రైళ్లు పరుగెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. మనుషులతో పనే లేకుండా.. యంత్రాల సహాయంతోనే పనులన్నీ పూర్తి చేయడం. ప్రస్తుతం పరిశ్రమలన్నింటిలోనూ ఇదే ట్రెండ్ నడుస్తోంది. మరోవైపు కృత్రిమ మేథ(ఆర్టిఫిషియల్ ఇంటలెజిన్స్) ముప్పు కూడా ముంచుకొస్తోంది. మనుషుల్లా ఆలోచించి, మనుషుల కన్నా వేగంగా, చురుకుగా పనిచేసే రోబోలను సృష్టించే ఈ అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో వేలాది మంది ఉద్యోగులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో 2030 నాటికి సుమారు 80 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం హెచ్చరించింది. ఈ సంఖ్య ప్రపంచ జనాభాలోని మొత్తం కార్మిక సిబ్బందిలో ఐదో వంతు. ఈ గణాంకాలను బట్టి చూస్తే.. సగటు ఉద్యోగిపై ఆటోమేషన్ ఎంత తీవ్ర ప్రభావం చూపనుందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆర్థిక, విద్య, వైద్య, రవాణా, పర్యాటకం వంటి వివిధ రంగాల్లోని ఉద్యోగులు గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదని సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆర్థిక రంగంపై ఆటోమేషన్ ప్రభావం..
ఆర్థిక రంగంలో కీలక విభాగాలైన బ్యాంకింగ్, బీమా, పెట్టుబడి రంగాల్లో కృత్రిమ మేథ(ఏఐ)తో పనిచేసే రోబోలను ప్రవేశ పెట్టడం ద్వారా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు దిగ్గజ బ్యాంకు దాయిష్ బ్యాంకు మాజీ సీఈఓ వ్యాఖ్యానించారు. క్లౌడ్ స్టోరేజీని ఉపయోగించడం ద్వారా టెలీకాలర్లు, క్లర్కులు, ఫ్రంట్ ఆఫీసు సిబ్బందికి ప్రత్యామ్నాయంగా కృత్రిమ మేథను ఉపయోగించనున్నామని పేర్కొన్నారు. అదే విధంగా నేషనల్ ఆస్ట్రేలియా బ్యాంకు(ఎన్‌ఏబీ) కూడా కృత్రిమ మేథను ఉపయోగించుకునేందుకు ఆసక్తి కనబరుస్తోంది. తద్వారా రానున్న 13 సంవత్సరాల్లో తమ ఉద్యోగుల సంఖ్యను 12 శాతానికి తగ్గించేందుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఏఐని ఉపయోగించడం ద్వారా వివిధ శాఖల్లో పనిచేసే ఉద్యోగులను మొత్తంగా తొలగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
రక్షణ రంగంలో ప్రాణ నష్టం తగ్గించుకునేందుకు..
అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించడం ద్వారా ప్రాణ నష్టాన్ని తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా వివిధ దేశాల ప్రభుత్వాలు కూడా ఏఐనే వాడుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. డ్రోన్లను ఉపయోగించి శత్రు స్థావరాలను గుర్తించడంతో పాటుగా... దాడులు జరపడం కూడా సులభతరంగా మారిన నేపథ్యంలో సైనికుల సంఖ్యను తగ్గించేకునేందుకు మొగ్గు చూపుతున్నాయి. తద్వారా ప్రాణ నష్టం తగ్గించుకోవడంతో పాటుగా ఖర్చు కూడా తగ్గించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి.
వైద్య రంగంలోనూ ఆటోమేషన్ హవా...
వైద్య రంగంలో కూడా ఆటోమేషన్ హవా కొనసాగుతోంది. థర్మామీటర్స్, బీపీ మానిటర్స్‌ను కంప్యూటర్‌లతో అనుసంధానం చేయడం ద్వారా పారామెడికల్ ఉద్యోగాల్లో భారీగా కోత పడనున్నట్లు తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. యూకే నేషనల్ హెల్త్ సర్వీస్ తమ నాన్ ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నెంబర్ 111తో ఏఐని అనుసంధానించడం ద్వారా మెడికల్ యాప్‌ను అభివృద్ధి చేసింది. సుమారు 1.2 మిలియన్ మంది ఇప్పటికే ఈ యాప్‌ను వినియోగిస్తున్నారు. దీంతో ఉత్తర లండన్‌లోని టెలీకాలర్లు భారీగా ఉద్యోగాలు కోల్పోయారు. అంతేకాకుండా ఆటోమేషన్ ప్రభావం వల్ల వేలాది మంది అంబులెన్స్ డ్రైవర్లు కూడా ఉద్యోగాలు కోల్పోనున్నారు.
రవాణా రంగ ఉద్యోగులకు కూడా తిప్పలు తప్పవు..
ప్రపంచ వ్యాప్తంగా ప్రజా రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషించే రైల్వేల్లో కూడా ఆటోమేషన్ ప్రభావం చూపనుంది. టికెట్ వాలిడేషన్, సెక్యూరిటీ విభాగాల్లో ఏఐని ఉపయోగించడం ద్వారా సిబ్బందిని భారీగా తగ్గించుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. బయోమెట్రిక్ స్కానర్లను ఏఐతో అనుసంధానించి ఉపయోగించడం ద్వారా టికెట్ల దృవీకరణ, పర్యవేక్షణ సిబ్బందిని పూర్తిగా తొలగించే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోన్నాయి వివిధ దేశాల ప్రభుత్వాలు.
పర్యాటక రంగంలోని ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలపై ప్రభావం
ఆటోమేషన్ ప్రభావం వల్ల పర్యాటక రంగంలోని ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాల్లో భారీగా కోత పడబోతుంది. ఏఐని వినియోగించడం ద్వారా టూరిజం ప్యాకేజీ అడ్వైజర్లు, ట్రావెల్ ఏజెంట్స్ చేసే పనులను రోబోలే చేస్తున్నాయి. అదే విధంగా టూరిస్టు గైడులు, క్యాబ్ డ్రైవర్ల ఉద్యోగాలకు కూడా కృత్రిమ మేథ ఎసరు పెడుతోంది.
విద్యారంగంలో వర్చువల్ రియాలిటీ ద్వారా..
నేటి డిజిటల్ యుగంలో సమయాభావం వల్ల ఆన్‌లైన్‌లోనే కోర్సులు పూర్తి చేసే విద్యార్థుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో పలు యూనివర్సిటీలు కూడా ఆన్‌లైన్ ద్వారా వివిధ కోర్సులు అందుబాటులోకి తెచ్చి వర్చువల్ రియాలిటీ ద్వారా విద్య బోధిస్తున్నాయి. ఇందుకోసం రోబోలను వినియోగించుకుంటున్నాయి. రోబో టెక్నాలజీకి కృత్రిమ మేథ కూడా తోడవడంతో నిపుణులైన అధ్యాపకుల అవసరం కూడా లేకుండా పోతోంది.
ఆటోమేషన్‌కు జన్మస్థానమైన తయారీ రంగంలో..
ఆటోమేషన్‌కు జన్మస్థానంగా చెప్పుకునే తయారీ రంగంలో ఇప్పటి వరకు సెమీ ఆటోమేటిక్, ఆటోమేటిక్ మెషీన్ల హవా కొనసాగుతోంది. దీనికి ఏఐ కూడా తోడవడంతో యంత్రాలను పర్యవేక్షించే పనిని కూడా రోబోలే తలకెత్తుకుంటున్నాయి. మనుషుల కంటే కూడా మెరుగ్గా ఈ రోబోలు పని చేస్తున్నాయని, వీటితో ఖర్చు కూడా తగ్గుతోందని పలు కంపెనీలు పేర్కొన్నాయి. దీంతో సహాయక సిబ్బందిని పూర్తిగా తొలగించే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలిపాయి.
అసలు మొత్తంగా పరిశ్రమలన్నీ రోబోలతోనూ, యంత్రాలతోనే నిండిపోతే ఇక మనుషులే కనిపించకుండా పోయే ప్రమాదం ఉందని సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment