
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ అవన్ మోటార్స్.. ‘ట్రెండ్ ఈ’ పేరుతో నూతన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను శుక్రవారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. సింగిల్ బ్యాటరీ కలిగిన స్కూటర్ ధర రూ.56,900 కాగా, డబుల్ బ్యాటరీ స్కూటర్ ధర రూ.81,269. రెండు నుంచి నాలుగు గంటల్లో పూర్తిగా చార్జయ్యే విధమైన లిథియం–అయాన్ బ్యాటరీని ఈ స్కూటర్లలో అమర్చినట్లు తెలిపింది. సింగిల్ బ్యాటరీ స్కూటర్ గంటకు 45 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని, డబుల్ బ్యాటరీ స్కూటర్ 110 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదని సంస్థ ప్రకటించింది.
రూ.1,100 చెల్లించి స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ సందర్భంగా సంస్థ బిజినెస్ డెవలప్‌మెంట్ హెడ్ పంకజ్ తివారీ మాట్లాడుతూ.. ‘ప్రీ–బుకింగ్స్ సమయంలో ఈ స్కూటర్స్‌కు విశేష స్పందన మాకు ఆనందాన్ని ఇచ్చింది. ఈ స్కూటర్ ఫీచర్లు కస్టమర్లకు బాగా నచ్చుతాయని భావిస్తున్నాం’ అని అన్నారు.