అదరగొట్టిన డీమార్ట్
అదరగొట్టిన డీమార్ట్
Published Sat, Jul 22 2017 4:07 PM | Last Updated on Tue, Sep 5 2017 4:38 PM
న్యూఢిల్లీ : డీమార్ట్‌లను నిర్వహించే అవెన్యూ సూపర్‌మార్ట్స్ స్టాక్‌మార్కెట్‌లో లిస్టు అయిన తొలిరోజే దుమ్మురేపి, అనంతరం కొన్ని రోజుల్లోనే ఆ సంస్థ అధినేత రాధాకృష్ణ దమానీని అపరకుబేరుడిని చేసిన సంగతి తెలిసిందే. రికార్డు స్థాయిలో దూసుకెళ్లిన అవెన్యూ సూపర్‌మార్ట్స్, లాభాల్లోనూ అదరగొట్టింది. శనివారం ప్రకటించిన లాభాల్లో ఏడాది ఏడాదికి 47.60 శాతం పెరుగుదలను నమోదుచేసింది. దీంతో కంపెనీ లాభాలు 2017-18 తొలి త్రైమాసికంలో రూ.174.77 కోట్లగా రికార్డయ్యాయి. గతేడాది ఇదే క్వార్టర్‌లో ఈ సంస్థ లాభాలు రూ.118.44 కోట్లగా ఉన్నాయి. మొత్తం ఆదాయాలు కూడా రూ.3,620.95 కోట్లకు పెరిగినట్టు కంపెనీ నేడు బీఎస్‌ఈకి సమర్పించిన ఫైలింగ్‌లో పేర్కొంది. ఇది ఏడాది ఏడాదికి 36.3 శాతం పెరుగుదల. ఈబీఐటీడీఏలు కూడా ఈ క్వార్టర్‌లో 36 శాతం పెరిగాయని, అవి రూ.326 కోట్లగా నమోదైనట్టు కంపెనీ చెప్పింది. గతేడాది ఇదే క్వార్టర్‌లో ఈబీఐటీడీఏలు రూ.239.70 కోట్లగా మాత్రమే ఉన్నట్టు కంపెనీ తన రిపోర్టులో తెలిపింది.
అయితే ఈబీఐటీడీఏ మార్జిన్లు మాత్రం ఫ్లాట్‌గా 9 శాతం మాత్రమే నమోదయ్యాయి. కాగ, అవెన్యూ సూపర్‌మార్ట్స్ షేర్లు ఏప్రిల్‌లో రికార్డు వర్షం కురిపించడంతో దమానీ, అత్యంత ధనవంతులైన భారతీయుల్లో ఒకరిగా నిలిచారు. ప్రపంచంలోని 500 మంది కుబేరుల్లో కూడా ఆయనకు చోటు దక్కింది. బ్లూంబర్గ్ బిలినీయర్ గణాంకాల ప్రకారం అప్పుడు దమానీ సంపద 4.10 బిలియన్ డాలర్లుగా నమోదైంది. 2002లో దమానీ అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ని స్థాపించారు. దేశంలోనే అత్యంత లాభాల్లో ఉన్న ఫుడ్ అండ్ గ్రోసరీ రిటైలర్ డీమార్ట్ బ్రాండ్ కింద అవెన్యూ సూపర్‌మార్ట్స్ కంపెనీ పనిచేస్తుంది. మొత్తం 9 రాష్ట్రాలు సహా మరో కేంద్ర పాలిత ప్రాంతంలో కలిపి కంపెనీకి 118 స్టోర్లు ఉన్నాయి.
Advertisement
Advertisement