సాక్షి, నెల్లూరు: ‘ఆర్థికంగా ఎదగాలని ప్రతి ఒక్కరూ కలలు కంటుంటారు. ఇందుకోసం తమ వద్ద ఉన్న డబ్బుతో ఏదో ఒకదానిపై పెట్టుబడి పెట్టి అధిక లాభాలు పొందాలని చూస్తారు. అయితే పెట్టుబడులు పెట్టేముందు మదుపరులు ముందుచూపుతో వ్యవహరించాలి’ అని సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్(సీడీఎస్‌ఎల్) రీజినల్ మేనేజర్ శివప్రసాద్ వెనిశెట్టి సూచించారు. సాక్షి మైత్రి ఇన్వెస్టర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నెల్లూరులో ఆదివారం మదుపరుల అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక శాతం ప్రజలు ఒకే ఆదాయంపై ఆధార పడుతున్నారని.. రెండు ఆదాయాలుంటేనే పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలమన్నారు. ఇందుకు పొదుపు ఒక్కటే సరిపోదని, భవిష్యత్తులో ధరలను తట్టుకునే లా రాబడినిచ్చే సాధనాల్లో మదుపు చేయాలని సూచించారు. ఎంత పొదుపు చేయాలన్నది ఎవరికి వారు లక్ష్యాలను బట్టి నిర్ణయించుకోవాల్సి ఉంటుందన్నారు.
నష్ట భయం ఉన్నచోటే అధిక రాబడికి అవకాశం
స్టాక్ మార్కెట్లో మదుపు చేయాలనుకునే వారికి ముందుగా ఉండాల్సింది డీమ్యాట్ ఖాతా. ఆదాయపు పన్నులశాఖ జారీచేసిన పాన్‌కార్డు ఉన్న వ్యక్తులెవరైనా ఈ ఖాతాను ప్రారంభించేందుకు వీలుంటుందని శివప్రసాద్ చెప్పారు. డిజిటల్ రూపంలోనే షేర్లను భద్రపర్చుకోవచ్చన్నారు. మదుపరులు వయస్సు, నష్టాన్ని భరించే సామర్థ్యం ఆధారంగా పథకాలను ఎంచుకోవచ్చన్నారు. నష్టం వాటిల్లే భయం ఉన్న చోట రాబడి అధికంగానే ఉంటుందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment