యాక్సిస్ బ్యాంక్ క్యూ4 లాభం రూ.2,154 కోట్లు
ముంబై: ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ ఆర్థిక ఫలితాలు ఇన్వెస్టర్లను నిరుత్సాహపర్చాయి. ఎన్‌పీఏ కేటాయింపులకు సంబంధించి కొన్ని కంపెనీలను రిజర్వుబ్యాంక్ మినహాయించడంతో ఈ దఫా బ్యాంకుల ఫలితాలు బావుంటాయన్న అంచనాలు మార్కెట్లో ఉన్నాయి. ఇందుకు భిన్నంగా యాక్సిస్ బ్యాంక్ నికరలాభం మార్చితో ముగిసిన క్యూ4లో క్షీణించి రూ. 2,154 కోట్లకు దిగింది. అధిక కేటాయింపులకు తోడు భవిష్యత్తులో ఏర్పడే మొండి బకాయిల కోసం కొంత మొత్తాన్ని పక్కనపెట్టడంతో లాభాలు తగ్గినట్లు బ్యాంక్ పేర్కొంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి మాత్రం బ్యాంకు నికరలాభం 12 శాతం పెరుగుదలతో 8,349 కోట్లకు చేరింది. తాజా త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం 20% ఎగిసి రూ. 4,553 కోట్లకు పెరిగింది. ఇతర ఆదాయం మాత్రం స్వల్ప పెరుగుదలతో రూ. 2,694 కోట్లకు చేరింది.
కొత్త ఎన్‌పీఏలు తగ్గాయ్..: క్యూ4లో కొత్తగా రూ. 1,474 కోట్ల మొండి బకాయిలు యాడ్ అయ్యాయని, దాంతో పూర్తి ఆర్థిక సంవత్సరంలో జతైన మొండి బకాయిలు రూ. 7,345 కోట్లకు చేరినట్లు బ్యాంక్ పేర్కొంది. క్యూ3లో 2,082 కోట్ల కొత్త ఎన్‌పీఏలతో పోలిస్తే, తాజా త్రైమాసికంలో తగ్గాయి. గత త్రైమాసికంతో పోలిస్తే క్యూ4లో తమ ఆస్తుల నాణ్యత స్థిరంగా వుందని, అయితే భవిష్యత్తులో సవాళ్లు ఎదురుకావొచ్చని బ్యాంక్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జైరామ్ శ్రీధర్ చెప్పారు. బీఎస్‌ఈలో మంగళవారం యాక్సిస్ బ్యాంక్ షేరు ధర 2.2 శాతం లాభపడి రూ.480 వద్ద ముగిసింది.