రూమర్లకు చెక్.. బ్యాంకు సీఈవోగా మళ్లీ ఆమె
రూమర్లకు చెక్.. బ్యాంకు సీఈవోగా మళ్లీ ఆమె
Published Thu, Jul 27 2017 5:05 PM | Last Updated on Tue, Sep 5 2017 5:01 PM
ముంబై : ప్రైవేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంకు సీఈవోగా శిఖా శర్మ నిష్క్రమించబోతున్నారనే ఊహాగానాలకు చెక్ పడింది. మరో మూడేళ్ల పాటు బ్యాంకు సీఈవోగా, మేనేజింగ్ డైరెక్టర్‌గా శిఖా శర్మనే నియమిస్తూ యాక్సిస్ బ్యాంకు నిర్ణయం తీసుకుంది. అంటే 2021 జూన్ వరకు శిఖా శర్మ ఆ పదవిలో కొనసాగనున్నారు. 2017 జూలై 26న సమావేశమైన బోర్డు ఆఫ్ డైరెక్టర్లు, శిఖా శర్మ పునఃనియామకాన్ని ఆమోదించారు. 2018 జూన్ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుందని బ్యాంకు గురువారం బీఎస్‌ఈకి సమర్పించిన నివేదికలో పేర్కొంది. ఈ వారం మొదట్లో వచ్చిన రిపోర్టులలో టాటా ఫైనాన్సియల్ సర్వీసెస్ వర్టికల్ అధినేతగా శిఖా శర్మను టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రతిపాదించారని రూమర్లు చక్కర్లు కొట్టాయి.
దీంతో ఆమె యాక్సిస్ బ్యాంకు వీడబోతున్నట్టు రిపోర్టులు వచ్చాయి. ఈ రిపోర్టులను బ్యాంకు ఖండించింది. బ్యాంకు ఎండీ, సీఈవోగా హెడ్ హంటింగ్ ఏజెన్సీ ఇగోన్ జెహ్న్‌డర్‌ను నియమించుకుందని వచ్చిన రిపోర్టులను కూడా బ్యాంకు కొట్టిపారేసింది. ''ప్రస్తుతం మన మధ్య చక్కర్లు కొడుతున్నవన్నీ రూమర్లు, వాటిలో ఎలాంటి నిజాలు లేవు. ఇన్‌స్టిట్యూషన్‌కు ఎంతో అంకితభావంతో పనిచేసే నేను ఈ రూమర్లను మార్చలేను'' అని శర్మ చెప్పారు. బ్యాంకు ఎంతో మంచి భవిష్యత్తు ఉందని, బ్యాంకు, షేర్‌హోల్డర్స్‌తో కలిసి పనిచేయడానికి తాను శాయశక్తులా పనిచేస్తానని తెలిపారు. 2018 జూన్ నాటికి తనకి, బ్యాంకుతో ఉన్న సంబంధానికి తొమ్మిదేళ్ల పూర్తవుతుందన్నారు. శిఖాశర్మను యాక్సిస్ బ్యాంకు 2009లో నియమించుకుంది. ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ లైఫ్ నుంచి ఆమె యాక్సిస్ బ్యాంకుకు వచ్చారు. 1980లో ఇన్‌ఫ్రా లెండర్ ఐసీఐసీఐ లిమిటెడ్‌లో కెరీర్‌ను ప్రారంభించిన శిఖాశర్మ, గ్రూప్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ బిజినెస్‌లలో కీలక పాత్ర పోషించారు.
Advertisement
Advertisement