
‘బాహుబలి 2’కు భారీగా బీమా
హైదరాబాద్: విజువల్ వండర్ ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ సినిమాకు రూ. 200 కోట్లకు పైగా బీమా చేసినట్టు ఫ్యూచర్ జనరాలీ ఇన్సూరెన్స్ కంపెనీ వెల్లడించింది. ఫిల్మ్ ప్యాకేజీ ఇన్సూరెన్స్ కింద ఈ మొత్తానికి బీమా చేసినట్టు తెలిపింది. ప్రిప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్‌లో ఏదైనా ప్రమాదం జరిగితే ఈ పాలసీ కింద కవరేజీ ఉంటుందని వివరించింది. ‘మరణం, నటులకు అనారోగ్యం, ప్రకృతి విపత్తులు, ప్రమాదాల కారణంగా సినిమా షెడ్యూల్ లో జాప్యం జరిగినా బీమా వర్తిస్తుంది. షూటింగ్ జరుగుతుండగా ఎక్విప్‌మెంట్ పాడైనా బీమా చెల్లిస్తామ’ని ఫ్యూచర్ జనరాలీ ఒక ప్రకటనలో తెలిపింది.
సినిమాలకు బీమా చేయడం పెరుగుతోందని ఫ్యూచర్ జనరాలీ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ కేజీ కృష్ణమూర్తి రావు తెలిపారు. 2017 ఆర్థిక సంవత్సరంలో 160 సినిమాలకు బీమా చేశామని, వీటిలో ఎక్కువగా బాలీవుడ్ సినిమాలున్నాయని చెప్పారు. దక్షిణాది సినిమాలపై దృష్టి పెట్టామని, ఫిల్మ్ ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా ఇన్సూరెన్స్ చేస్తున్నట్టు చెప్పారు. ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ఈ సినిమా భారతదేశంలో భారీ బడ్జెట్ తో తెర కెక్కిన చిత్రంగా నిలిచింది.