జీఎస్‌టీ పన్నుపై రాందేవ్ గుర్రు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్న ప్రతిష్టాత్మక జీఎస్‌టీ బిల్లుపై ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక జీఎస్‌టీ చారిత్రాత్మకమని కొనియాడారు. అయితే ఇటీవల పన్నురేట్ల ఖరారులో ఆయుర్వేదంపై అధిక పన్ను నిర్ణయిండంపై తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు. భారతదేశంలో ఆయుర్వేదం పునరుద్ధరణను ఇది నాశనం చేస్తుందని వ్యాఖ్యానించారు. దీనిపై ప్రస్తుతం అమల్లో ఉన్న 5శాతానికి బదులుగా ఆయుర్వేద ఉత్పత్తులపై 12 శాతం పన్నురేటు నిర్ణయించడం సరైంది కాదన్నారు. దీన్ని సమీక్షించాలకోరారు. ఈ పన్ను రేటుపై మార్పులు చేయాలని శుక్రవారం ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
ముఖ్యంగా అల్లోపతి, హోమియోపతిపై యధావిధంగా 5శాతం ఉంచి ఆయుర్వేదంపై 12 శాతం విధించడంపై బాబా రాందేవ్ అసంతృప్తి వ్యక‍్తం చేశారు. అంతరించిపోతున్న ఆయుర్వేద వైద్య విధానాన్ని పతంజలి ద్వారా తిరిగి తాము వెలుగులోకి తీసుకొస్తున్నామని బాబా చెప్పారు. అలాగే బీడీలు, సిగరెట్లు లాంటి హానికరమైన వస్తువులు, ఇతర విలాస వస్తువులపై టాక్స్ అధికంగా ఉండాలి తప్ప, మందులపై పన్ను రేటు స్వల్పంగా ఉండాలని బాబా కోరుకున్నారు. ప్రభుత్వం ఆయుర్వేదానికి వ్యతిరేకం కాదని, ఈ నేపథ్యంలో తప్పనిసరిగా తన అభ్యర్థనను మన్నిస్తుందన‍్న విశ్వాసాన్ని రాందేవ్ వ్యక్తం చేశారు.
మరోవైపు ఆయుర్వేద కేటగిరీపై అధిక జీఎస్‌టీ తమకు ఆశ్చర్యాన్నికలిగించిందన్నారు పతంజలి ఆయుర్వేవ్ లిమిటెడ్, పతంజలి యోగపీఠ్ ప్రతినిధి ఎస్.కె. టిజారవాలా. 12 శాతం పన్ను రేటు విధించడం చాలా నిరాశ కలిగించిందని, ఇది బాధాకరమైనదని పిటిఐతో చెప్పారు. సరసమైన ధరలో సామాన్యుడికి అందుబాటులో ఉన్న ఆయుర్వేద వైద్య విధానమన్నారు. మంచి ఆరోగ్యం , ఆరోగ్యకరమైన జీవనము సామాన్య మానవుడి ప్రాథమిక హక్కు అని పేర్కొన్న ఆయన వీటికి దూరం చేసి 'అచ్చె దిన్'ని ఎలా అని ఆయన ప్రశ్నించారు. మరోవైపు ఆయుర్వేదిక్ ఔషధ తయారీదారుల అసోసియేషన్ (అమామ్) కూడా ఇదే ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా ఆయుర్వేద ఉత్పత్తులను భారీగా ప్రోత్సహమిస్తున్న భారత ప్రభుత్వం అధిక పన్ను రేటుతో దేశీయంగా ఆయుర్వేదాన్ని దూరం చేస్తే ఎలా అని అమామ్ జనరల్ సెక్రటరీ ప్రదీప్ ముల్తా పేర్కొన్నారు.