ఇక బాబా రామ్‌దేవ్ నూడుల్స్
పతంజలి బ్రాండ్ పేరుతో ఈ నెల 15 నుంచి విక్రయం
* ఫ్యూచర్ గ్రూప్‌తో పతంజలి ఆయుర్వేద జట్టు
* రూ. 1,000 కోట్ల వ్యాపారంపై దృష్టి
న్యూఢిల్లీ: నెస్లే మ్యాగీ నూడుల్స్‌పై వివాదం నేపథ్యంలో దేశీ యోగా గురు బాబా రామ్‌దేవ్ తాజాగా సొంత నూడుల్స్ బ్రాండ్‌ను మార్కెట్లోకి దింపుతున్నారు. ఆయన సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ ఈ నెల 15 నుంచి దేశవ్యాప్తంగా వీటిని విక్రయించనుంది. అలాగే ఓట్స్, పాస్తా, జ్యూస్‌లు మొదలైన ఉత్పత్తులను కూడా అందుబాటులోకి తేనుంది.
‘అక్టోబర్ 15 నుంచి పతంజలి నూడుల్స్ అమ్మకాలు దేశవ్యాప్తంగా మొదలుపెడుతున్నాం. మ్యాగీ రేటు రూ. 25 ఉండేది. మేము రూ. 15కే అందిస్తాం. దీనిలోని టేస్ట్ మేకర్.. ఆరోగ్యానికి కూడా మేలు చేసేదిగా ఉంటుంది. అందులో సీసం గానీ ఎంఎస్‌జీ (మోనోసోడియం గ్లూటమేట్) లాంటి హానికారక పదార్థాలేమీ ఉండవు’ అని రామ్‌దేవ్ తెలిపారు. శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ మ్యాగీ తయారీలో నెస్లే కంపెనీ.. పామాయిల్ ఉపయోగిస్తుందని, తాము మాత్రం ఖరీదైన రైస్‌బ్రాన్ ఆయిల్‌ను మాత్రమే ఉపయోగిస్తామని చెప్పారు.
హానికారకమైన సీసం, ఎంఎస్‌జీ ప్రమాదకర స్థాయిల్లో ఉన్నాయంటూ మ్యాగీ నూడుల్స్‌పై వివాదం రేగడం, ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ‘ఝట్‌పట్ పకావో.. ఔర్ బేఫిక్ ్రఖావో’ (క్షణాల్లో వండుకో..ఆనందంగా ఆరగించు)అనేది పతంజలి నూడుల్స్‌కి క్యాచ్‌లైన్‌గా ఉంటుందని బాబా రామ్‌దేవ్ వివరించారు. స్వదేశీ ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించే లక్ష్యంలో భాగంగానే వీటిని అందుబాటులోకి తెస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
కొత్త ఉత్పత్తుల ఊతంతో ఈ ఆర్థిక సంవత్సరంలో పతంజలి ఆయుర్వేద దాదాపు రూ. 5,000 కోట్ల వ్యాపారం నమోదు చేయగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశీయంగా నూడుల్స్ మార్కెట్ విలువ సుమారు రూ. 4,000 కోట్లు ఉంటుందని అంచనా. ఇందులో సింహభాగం వాటా మ్యాగీకే ఉండేది.
ఫ్యూచర్ గ్రూప్‌తో ఒప్పందం..
తమ ఉత్పత్తుల విక్రయానికి సంబంధించి పతంజలి ఆయుర్వేద, ఫ్యూచర్ గ్రూప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీని కింద ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన స్టోర్స్‌లో పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులను విక్రయించడం జరుగుతుంది. రాబోయే 20 నెలల్లో తమ స్టోర్స్‌లో వీటి అమ్మకాల ద్వారా రూ. 1,000 కోట్ల మేర వ్యాపారం జరగగలదని ఫ్యూచర్ గ్రూప్ అంచనా వేస్తోంది. ప్రస్తుతం ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ సంస్థ హెచ్‌యూల్ అమ్మకాలు తమ స్టోర్స్‌లో రూ. 1,300 కోట్లు- రూ. 1,400 కోట్ల మేర ఉంటున్నాయని పతంజలి ఉత్పత్తులు ఈ లక్ష్యాన్ని సులభంగానే దాటగలవని ఫ్యూచర్ గ్రూప్ సీఈవో కిశోర్ బియానీ చెప్పారు.
ప్రారంభంలో వీటి విక్రయం ద్వారా నెలకు రూ. 30-40 కోట్ల ఆదాయం ఉండొచ్చని, తర్వాత ఇది రూ. 80 కోట్లకు పెరుగలదని అంచనా వేస్తున్నట్లు ఆయన వివరించారు. దీర్ఘకాలికంగా సంయుక్త భాగస్వామ్యంలో ఉత్పత్తుల తయారీ కూడా చేపట్టాలని ఇరు సంస్థలు యోచిస్తున్నట్లు బియానీ చెప్పారు. పతంజలి ఉత్పత్తుల పంపిణీ, మార్కెటింగ్ కోసం హరిద్వార్‌లో ప్రత్యేక కార్యాలయం కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా ఫ్యూచర్ గ్రూప్ ఆదాయాలు 20-25% మేర వృద్ధి చెందగలవని, 2015-16 గ్రూప్ ఆదాయం రూ. 22,000 కోట్లు- రూ. 23,000 కోట్ల స్థాయిలో ఉండగలదని బియానీ పేర్కొన్నారు.