
న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లో మోటార్ బైక్‌ల అమ్మకాల జోరుతో బజాజ్ ఆటో కంపెనీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలం(2018–19, క్యూ4) లో 20 శాతం ఎగసింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2017–18) క్యూ4లో రూ.1,175 కోట్లుగా ఉన్న నికర లాభం గత క్యూ4లో రూ.1,408 కోట్లకు పెరిగిందని బజాజ్ ఆటో తెలిపింది. మొత్తం ఆదాయం రూ.6,788 కోట్ల నుంచి రూ.7,395 కోట్లకు ఎగసిందని కంపెనీ ఈడీ రాకేశ్ శర్మ వెల్లడించారు. కంపెనీ మొత్తం అమ్మకాలు 10.45 లక్షల యూనిట్ల నుంచి 14 శాతం వృద్ధితో 11.93 లక్షల యూనిట్లకు చేరాయని వివరించారు దేశీయంగా బైక్‌ల విక్రయాలు 4.97 లక్షల నుంచి 23 శాతం వృద్ధితో 6.10 లక్షలకు పెరిగాయని పేర్కొన్నారు. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.60 డివిడెండ్‌ను(600 శాతం) ఇవ్వనున్నామని చెప్పారు.
మోటార్ బైక్‌ల జోరు...: వాణిజ్య వాహనాలకు సంబంధించిన త్రీ వీలర్ సెగ్మెంట్‌లో సమస్యలున్నప్పటకీ, మోటార్ బైక్‌ల ముఖ్యంగా దేశీయ మోటార్ బైక్ సెగ్మెంట్ మంచి పనితీరు సాధించిందని రాకేశ్ శర్మ చెప్పారు. ఎంట్రీ లెవల్, టాప్ ఎండ్ ప్రీమియమ్ స్పోర్ట్స్ సెగ్మెంట్లలలో మంచి అమ్మకాలు సాధించా మని పేర్కొన్నారు. బైక్‌ల ఎగుమతులు 3.58 లక్షల నుంచి 3.91 లక్షల కు పెరిగాయని వివరించారు. వాణిజ్య వాహనాల అమ్మకాలు 1.22 లక్ష ల నుంచి 16శాతం తగ్గి 1,02 లక్షలకు పరిమితమయ్యాయని ఆయన తెలిపారు.
ఏడాది లాభం రూ.4,928 కోట్లు...
ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18లో రూ.4,219 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 17 శాతం వృద్ధితో రూ.4,928 కోట్లకు పెరిగిందని రాకేశ్ శర్మ వివరించారు. మొత్తం ఆదాయం రూ.25,617 కోట్ల నుంచి రూ.30,250 కోట్లకు చేరింది. అమ్మకాలు 40.06 లక్షల నుంచి 25 శాతం వృద్ధితో 50.19 లక్షలకు పెరిగాయి. దేశీయ మార్కెట్లో మోటార్ బైక్‌ల అమ్మకాలు 19.74 లక్షల నుంచి 29 శాతం వృద్ధితో 25.41 లక్షలకు చేరాయని రాకేశ్ శర్మ పేర్కొన్నారు. రానున్న మూడు, నాలుగు నెలల్లో ప్రస్తుత మోడళ్లలో అప్‌గ్రేడ్ వేరియంట్లను అందుబాటులోకి తెస్తామని వివరించారు. అన్ని విభాగాల్లో ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తెచ్చే విషయమై కసరత్తు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతమున్న తమ మోడళ్లన్నింటినీ గడువులోగా బీఎస్–సిక్స్ ప్రమాణాలకు అనుగుణంగా అందించనున్నామని పేర్కొన్నారు.ఆర్థిక ఫలితాలు బాగా ఉండటంతో బీఎస్‌ఈలో బజాజ్ ఆటో షేర్ 3.3 శాతం లాభంతో రూ.3,042 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment