న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగంలోని బంధన్ బ్యాంక్ త్వరలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌కు వస్తోంది. కోల్‌కతా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ బ్యాంక్ ఐపీఓ పత్రాలను మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీకి సోమవారం సమర్పించింది. ఐపీఓ ద్వారా ఈ బ్యాంక్ రూ.2,500 కోట్లు సమీకరిస్తుందని అంచనా. బ్యాంకింగ్ రంగంలో ఇప్పటివరకూ ఇదే అతి పెద్ద ఐపీఓ అని మర్చంట్ బ్యాంకర్లు చెబుతున్నారు. ఈ ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో ఐపీఓ ఆరంభమయ్యే అవకాశాలున్నాయి.
11.92 కోట్ల షేర్ల విక్రయం
ఐపీఓలో భాగంగా రూ.10 ముఖ విలువ గల 11.92 కోట్ల షేర్లను జారీ చేయనున్నట్లు బంధన్ బ్యాంక్ తెలియజేసింది. వీటిల్లో 9.76 కోట్ల షేర్లు తాజా ఈక్విటీ షేర్లు కాగా, 2.1 కోట్ల షేర్లు ప్రస్తుత వాటాదారులవని వివరించింది. వీటిల్లో 1.40 కోట్ల షేర్లను ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్‌సీ), 75 లక్షల షేర్లను ఐఎఫ్‌సీ ఎఫ్‌ఐజీ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీలు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) విధానంలో విక్రయిస్తాయని పేర్కొంది. ఈ రెండు సంస్థలకు బంధన్ బ్యాంక్‌లో 4.94 శాతం వాటా ఉంది. మొత్తం మీద ఈ ఐపీఓ ద్వారా ఈ బ్యాంక్ పది శాతం వాటాను విక్రయించనుంది.
కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ, యాక్సిస్ క్యాపిటల్, గోల్డ్‌మన్ శాక్స్(ఇండియా) సెక్యూరిటీస్, జేఎమ్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషనల్ సెక్యూరిటీస్, జేపీ మోర్గాన్ ఇండియా సంస్థలు ఈ ఐపీఓకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తాయి. మైక్రోఫైనాన్స్ సేవలందిస్తున్న బంధన్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు ఆర్‌బీఐ 2014లో బ్యాంకింగ్ లైసెన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment