రుణానికి బ్యాంకుకెళ్లటం ఎందుకు?
బ్యాంక్‌బజార్.కామ్, పైసాబజార్.కామ్, అప్నాపైసా.కామ్, క్రెడిలా.కామ్... ఇంకా చాలా.
గృహ రుణం కావాలంటే బ్యాంకుల చుట్టూ తిరగడం పాత మాట. ఇపుడు దాదాపు ప్రతి బ్యాంకూ, ప్రతి ఆర్థిక సంస్థా ఆన్‌లైన్ రుణ సేవలందిస్తున్నాయి. దేనికైనా ఆన్‌లైన్లో దరఖాస్తు నింపితే చాలు. బ్యాంకు ప్రతినిధులే దరఖాస్తుదారు దగ్గరకొచ్చి పత్రాలన్నీ తీసుకుని ప్రాసెసింగ్ చేస్తారు. ఇవి కాక బ్యాంక్‌బజార్, పైసా బజార్, క్రెడిలా వంటి సంస్థల సైట్లను ఆశ్రయిస్తే మాత్రం... లోన్ కాలిక్యులేటర్ నుంచి, వివిధ బ్యాంకుల వాయిదాలను సరిపోల్చుకోవటం, అన్నిటినీ పరిశీలించాక ఏది నప్పుతుందో చూసుకోవటం కుదురుతుంది. అంతేకాదు! మీ వివరాలు నింపితే... మీకు రుణం ఎంత వస్తుంది? ఎన్ని వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది? తదితర వివరాలన్నీ తెలిసిపోతాయి. అన్నీ చూసుకున్నాక... ఈ సంస్థల ద్వారా దరఖాస్తు నింపితే ఇవే మనం ఎంచుకున్న ఆర్థిక సంస్థ లేదా బ్యాంకుకు దరఖాస్తును పంపిస్తాయి. హోమ్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్, హౌసింగ్ లోన్ కాలిక్యులేటర్, హోమ్ లోన్ ఎలిజిబిలిటీ, మైఈఎంఐ వంటి ఫీచర్లను ఇవి అందిస్తున్నాయి.ఇవన్నీ నచ్చని వారు... ఆన్‌లైన్లో కేవలం తమ పేరు, ఫోన్‌నెంబరు, ఈ-మెయిల్ ఇస్తే చాలు. ఆయా సంస్థల ప్రతినిధులే ఫోన్లు చేసి... మీ దగ్గరకొచ్చి మరీ దరఖాస్తు తీసుకెళతారు. వారే బ్యాంకు ద్వారా ప్రాసెస్ చేయిస్తారు.
బ్యాంకుల యాప్‌ల ద్వారా...
ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండియాబుల్స్ హోమ్‌లోన్స్ తదితర సంస్థలు సొంత యాప్‌లను విడుదల చేశాయి. వీటిద్వారా వడ్డీరేట్లు తెలుసుకోవటమే కాదు. నెలవారీ వాయిదాలు కూడా ఆన్‌లైన్ బ్యాంకింగ్‌లో చెల్లించొచ్చు. మీ దగ్గర్లోని బ్రాంచి చిరునామా తెలుసుకోవచ్చు.