బీఒబీ లాభం 48 శాతం డౌన్
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ) నికర లాభం(స్టాండోలోన్) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో 48% తగ్గింది. 2013-14 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.1,157 కోట్లుగా ఉన్న నికర లాభం గతేడాది క్యూ4లో రూ.598 కోట్లకు తగ్గిందని బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది. మొత్తం ఆదాయం రూ.11,615 కోట్ల నుంచి 4% వృద్ధితో రూ.12,057 కోట్లకు పెరిగింది. స్థూల మొండి బకాయిలు 3.85% నుంచి 3.72%కి, నికర మొండి బకాయిలు 2.11% నుంచి 1.89%కి తగ్గాయి. రూ.4,000 కోట్ల రుణాలను పునర్వ్యస్థీకరించామని వివరించారు.
ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం 25% క్షీణించి రూ.3,398 కోట్లకు, మొత్తం ఆదాయం 9% వృద్ధితో రూ.47,366 కోట్లకు పెరిగింది. నికర లాభం తగ్గినప్పటికీ, బీఓబీ షేరు దూసుకుపోయింది. ఆస్తుల నాణ్యత మెరుగుపడడమే దీనికి ప్రధాన కారణమని ట్రేడర్లు పేర్కొన్నారు. ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 17% లాభపడి రూ.169.7 వద్ద ముగిసింది.