70 శాతం తగ్గిన బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభం
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ) నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 70 శాతం క్షీణించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.586 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.173 కోట్లకు తగ్గిందని బ్యాంక్ సీఎండీ విజయలక్ష్మి అయ్యర్ చెప్పారు. కేటాయింపులు అధికంగా ఉండడం, మొండి బకాయిలు పెరగడం, వడ్డీ ఆదాయం స్వల్పంగానే వృద్ది చెందడం వల్ల నికర లాభం భారీగా తగ్గిందని పేర్కొన్నారు.
గత క్యూ3లో 2.8 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ3లో 4.07 శాతానికి, నికర మొండి బకాయిలు 1.75 శాతం నుంచి 2.5 శాతానికి పెరిగాయని వివరించారు. ఆదాయపు పన్ను మినహా కేటాయింపులు రూ.1,404 కోట్ల నుంచి రూ.1,581 కోట్లకు పెరిగాయని, వడ్డీ ఆదాయం రూ.9,769 కోట్ల నుంచి రూ.11,947 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. మొండి బకాయిలకు కేటాయింపులు 25 శాతం నుంచి40 శాతానికి పెరిగాయని వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్ షేర్ 5.7 శాతం తగ్గి రూ.227 వద్ద ముగిసింది.