బ్యాంకింగ్ రంగ షేర్లు శుక్రవారం మిడ్‌సెషన్ సమయానికి జోరుగా ర్యాలీ చేస్తున్నాయి. ఏజీఆర్ బకాయిల చెల్లింపులు విషయమై టెలికాం కంపెనీల ప్రతిపాదనలు పరిశీలించడానికి కొంత సమయం కావాలని డాట్ కోరడంతో బ్యాంకింగ్ రంగ షేర్లలో రిలీఫ్ ర్యాలీ కొనసాగుతున్నట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్ రంగ షేర్లకు ప్రాతినిధ్యం వహించే బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 2శాతానికి (445 పాయింట్లు)పైగా లాభపడి 21వేల పైకి చేరుకుంది.
ఇండెక్స్ మధ్యాహ్నం 12:30ని.లకు నిన్నటి ముగింపు(20,956.30)తో పోలిస్తే 2శాతం లాభంతో 21,383.70 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదే సమయానికి బంధన్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు 5శాతం నుంచి 3శాతం లాభపడ్డాయి. ఫెడరల్ బ్యాంక్, బంధన్ ఆఫ్ బరోడా, ఎస్‌బీఐ, ఆర్‌బీఎల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు 2శాతం పెరిగాయి. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, పీఎన్‌బీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ షేర్లు 1శాతం నుంచి అరశాతం ర్యాలీ చేశాయి.
10200 పైకి నిఫ్టీ ఇండెక్స్
సెంచరీ లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించిన సెన్సెక్స్ మిడ్‌సెషన్ కల్లా 300 పాయింట్లకు పైగా లాభపడింది. నిఫ్టీ 10200 స్థాయిపై ట్రేడ్ అవుతోంది. బ్యాంకింగ్, ఆర్థిక, అటో, ఫార్మా రంగ షేర్ల ర్యాలీ సూచీల లాభాలకు కారణయ్యాయి. మధ్యాహ్నం గం.12:45ని.లకు సెన్సెక్స్ 371 పాయింట్లు పెరిగి 34,579 వద్ద, నిఫ్టీ 110 పాయింట్ల లాభంతో 10,202 వద్ద ట్రేడ్ అవుతోంది. అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. డాలర్ మారకంలో రూపాయి బలపడటంతో ఒక్క ఐటీ రంగ షేర్లు మాత్రం నష్టాలను చవిచూస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment