ముంబై, సాక్షి: కరోనా వైరస్ కట్టడికి వ్యాక్సిన్లు రానున్న వార్తలతో ఇటీవల దూకుడు చూపుతున్న దేశీ స్టాక్ మార్కెట్లు మరోసారి కొత్త రికార్డులకు తెరతీశాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 260 పాయింట్లు ఎగసి 44,783కు చేరింది. నిఫ్టీ సైతం 78 పాయింట్లు పెరిగి 13,133 వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్ నిఫ్టీ తొలిసారి 30,000 పాయింట్ల మార్క్‌ను దాటేసింది. 309 పాయింట్లు ఎగసి 30,045కు చేరింది. వెరసి మార్కెట్లు వరుసగా మూడో రోజు చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులు సెంటిమెంటుకు జోష్‌నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.
పీఎస్‌యూ బ్యాంక్స్ జోరు
ఎన్‌ఎస్‌ఈలో ఐటీ(0.35 శాతం) మాత్రమే బలహీనపడగా.. మిగిలిన అన్ని రంగాలూ లాభపడ్డాయి. పీఎస్‌యూ బ్యాంక్స్ 2.6 శాతం పుంజుకోగా.. ప్రయివేట్ బ్యాంక్స్, మెటల్, ఆటో, ఫార్మా, రియల్టీ సైతం 1.2-0.6 శాతం మధ్య బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఓఎన్‌జీసీ, టాటా మోటార్స్, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, యాక్సిస్, గ్రాసిమ్, టాటా స్టీ్ల్, హిందాల్కో, శ్రీసిమెంట్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 5-1.4 శాతం మధ్య ఎగశాయి. అయితే టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, హెచ్‌సీఎల్ టెక్, ఐషర్, బజాజ్ ఫైనాన్స్, కొటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్, నెస్లే, హీరో మోటో 1.2-0.3 శాతం మధ్య నీరసించాయి.
ఐబీ హౌసింగ్ అప్
డెరివేటివ్ కౌంటర్లలో ఐబీ హౌసింగ్, బీవోబీ, పీఎన్‌బీ, కెనరా బ్యాంక్, ఇన్‌ఫ్రాటెల్, ఆర్‌బీఎల్ బ్యాంక్, జిందాల్ స్టీల్, బాష్ 5.5-2 శాతం మధ్య జంప్ చేశాయి. కాగా.. మరోపక్క జూబిలెంట్ ఫుడ్, ఐడియా, బెర్జర్ పెయింట్స్, పేజ్, బీఈఎల్, ఎస్‌ఆర్‌ఎఫ్, అమరరాజా 1-0.6 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో స్మాల్ క్యాప్ 0.5 శాతం పుంజుకుంది. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,240 లాభపడగా.. 558 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి.
ఎఫ్‌పీఐల ఇన్వెస్ట్‌మెంట్స్
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 4,563 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,522 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 4,738 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 2,944 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment