Banks stock
-
9బ్యాంకుల రేటింగ్ డౌన్‌గ్రేడ్: ఫిచ్ రేటింగ్స్
ఫిచ్ రేటింగ్ ఏజెన్సీ భారత్‌కు చెందిన 9 బ్యాంకుల రేటింగ్స్‌ను డౌన్‌గ్రేడ్ చేసింది. కోవిడ్-19 వ్యాధి వ్యాప్తితో భారత్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రతికూలతను ఎదుర్కొంటుందని అంచనా వేస్తూ ఈ 9బ్యాంకులకు సంబంధించి గతంలో కేటాయించిన ‘‘స్థిరత్వం’’ రేటింగ్‌ను ‘‘నెగిటివ్’’కు డౌన్‌గ్రేడ్ చేసింది. ఎస్బీఐ బ్యాంక్‌తో పాటు, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లు ఇందులో ఉన్నాయి. ఇదే రేటింగ్ సంస్థ గతవారంలో (జూన్ 18న) భారత్ అవుట్‌లుక్‌ను ‘‘బిబిబి(-)’’ నుంచి ‘‘నెగిటివ్’’కి డౌన్‌గ్రేడ్ చేసిన సంగతి తెలిసిందే. ‘‘కోవిడ్-19 వ్యాధి వ్యాప్తి తర్వాత వ్యవస్థలో ఏర్పడిన సవాళ్లతో ఆర్థిక కొలమానాల్లో గణనీయమైన క్షీణతతో పాటు ఇటీవల భారత్ సార్వభౌమ రేటింగ్ తగ్గింపుతో బ్యాంకులకు ప్రభుత్వం మద్దతు ఇచ్చే సామర్థ్యం తగ్గుతుంది.’’ ఫిచ్ రేటింగ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఎస్బీఐకు అండగా ప్రభుత్వం: వ్యక్తిగత బ్యాంకులను పరిగణలోకీ తీసుకుంటే.., వ్యూహాత్మక ప్రాధాన్యత కారణంగా అవసరమైతే ఎస్బీఐకు ప్రభుత్వం నుంచి మంచి మద్దతు లభిస్తోందని రేటింగ్ సంస్థ తెలిపింది. బ్యాంకింగ్ వ్యవస్థలో ఆస్తులు, డిపాజిట్లలో దాదాపు 25% మార్కెట్ వాటా కలిగి ఉంది. ఎస్బీలో 57.9 శాతం వాటా ప్రభుత్వం చేతిలో ఉంది. అలాగే తన సహచర బ్యాంకుల కంటే చాలా విస్తృత విధాన పాత్రను కలిగి ఉంది.ఐడీబీఐ బ్యాంక్ ఇష్యూయర్ డీఫాల్ట్ రేటింగ్ ను బీబీ(+)గా ధృవీకరించింది. అయితే అవుట్‌లుక్ మాత్రం నెగిటివ్‌గా కొనసాగింది. పిచ్ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేసినప్పటికీ.., ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మిడ్‌సెషన్ సమయానికి.... ఎస్బీఐ బ్యాంక్ షేరు 3శాతం లాభంతో రూ.189.90 వద్ద ట్రేడ్ అవుతోంది. ఐసీఐసీఐ బ్యాంక్ షేరు 2శాతం ర్యాలీ చేసి రూ.370.40 వద్ద ట్రేడ్ అవుతోంది. యాక్సిస్ బ్యాంక్ షేరు 3శాతం పెరిగి రూ.430 వద్ద ట్రేడ్ అవుతోంది. -
జోరుగా బ్యాంకింగ్ రంగ షేర్ల ర్యాలీ..!
బ్యాంకింగ్ రంగ షేర్లు శుక్రవారం మిడ్‌సెషన్ సమయానికి జోరుగా ర్యాలీ చేస్తున్నాయి. ఏజీఆర్ బకాయిల చెల్లింపులు విషయమై టెలికాం కంపెనీల ప్రతిపాదనలు పరిశీలించడానికి కొంత సమయం కావాలని డాట్ కోరడంతో బ్యాంకింగ్ రంగ షేర్లలో రిలీఫ్ ర్యాలీ కొనసాగుతున్నట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఫలితంగా ఎన్ఎస్ఈలో బ్యాంకింగ్ రంగ షేర్లకు ప్రాతినిధ్యం వహించే బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 2శాతానికి (445 పాయింట్లు)పైగా లాభపడి 21వేల పైకి చేరుకుంది. ఇండెక్స్ మధ్యాహ్నం 12:30ని.లకు నిన్నటి ముగింపు(20,956.30)తో పోలిస్తే 2శాతం లాభంతో 21,383.70 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదే సమయానికి బంధన్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు 5శాతం నుంచి 3శాతం లాభపడ్డాయి. ఫెడరల్ బ్యాంక్, బంధన్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ, ఆర్బీఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు 2శాతం పెరిగాయి. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, పీఎన్బీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ షేర్లు 1శాతం నుంచి అరశాతం ర్యాలీ చేశాయి. 10200 పైకి నిఫ్టీ ఇండెక్స్ సెంచరీ లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించిన సెన్సెక్స్ మిడ్‌సెషన్ కల్లా 300 పాయింట్లకు పైగా లాభపడింది. నిఫ్టీ 10200 స్థాయిపై ట్రేడ్ అవుతోంది. బ్యాంకింగ్, ఆర్థిక, అటో, ఫార్మా రంగ షేర్ల ర్యాలీ సూచీల లాభాలకు కారణయ్యాయి. మధ్యాహ్నం గం.12:45ని.లకు సెన్సెక్స్ 371 పాయింట్లు పెరిగి 34,579 వద్ద, నిఫ్టీ 110 పాయింట్ల లాభంతో 10,202 వద్ద ట్రేడ్ అవుతోంది. అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. డాలర్ మారకంలో రూపాయి బలపడటంతో ఒక్క ఐటీ రంగ షేర్లు మాత్రం నష్టాలను చవిచూస్తున్నాయి. -
కొనుగోలు వార్తలతో ‘యాక్సిస్’ జోరు
యాక్సిస్ బ్యాంక్ కోసం పలు ప్రైవేటు రంగ బ్యాంకులు పోటీపడుతున్నాయన్న వార్తలతో మంగళవారం ఈ బ్యాంక్ షేరు భారీగా పెరిగింది. యాక్సిస్‌ను విలీనం చేసుకునేందుకు కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రభుత్వాన్ని సంప్రదించిందని, యాక్సిస్ వాటాను కొనుగోలుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్‌ఇంద్ బ్యాంక్‌లు కూడా ప్రభుత్వాన్ని సంప్రదించాయనే వార్తలు కొన్ని ఛానళ్లలో ప్రసారమయ్యాయి. దాంతో ఈ షేర్ 5 శాతం లాభంతో రూ.505 వద్ద ముగిసింది. కొటక్ బ్యాంక్‌తో విలీనమేదీ లేదని సోమవారం యాక్సిస్ బ్యాంక్ ప్రకటించినప్పటికీ, మీడియాలో పదేపదే వార్తలు వెలువడుతుండటంతో బ్యాంక్ షేరు హఠాత్ ర్యాలీ జరిపింది. అలాంటిదేమీ లేదు..: కేంద్రం యాక్సిస్ బ్యాంక్‌ను విలీనం చేసుకునేందుకు, అందులో వాటా కొనుగోలుకు ఏ బ్యాంకూ తమవద్దకు ప్రతిపాదన తీసుకురాలేదని కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు మంగళవారం రాత్రి చెప్పారు. ఈ బ్యాంక్‌లో 12% వాటా ప్రభుత్వం వద్ద వుంది. ఆ వాటాను విక్రయించాలన్న ఉద్దేశ్యం కూడా ప్రభుత్వానికి వుంది. అయితే తక్షణమే ఈ వాటాను విక్రయించే అవకాశం లేదని ఆ అధికారి స్పష్టంచేశారు.