రికార్డ్‌ స్థాయి నుంచి కుప్పకూలిన మార్కెట్లు | Market tumbles on profit booking- PSU Banks up | Sakshi
Sakshi News home page

రికార్డ్‌ స్థాయి నుంచి కుప్పకూలిన మార్కెట్లు

Published Wed, Nov 25 2020 3:57 PM | Last Updated on Wed, Nov 25 2020 4:02 PM

Market tumbles on profit booking- PSU Banks up - Sakshi

ముంబై, సాక్షి: కొద్ది రోజులుగా సరికొత్త రికార్డులతో దూకుడు చూపుతున్న దేశీ స్టాక్‌ మార్కెట్లు ఉన్నట్టుండి బోర్లా పడ్డాయి. అయితే తొలుత యథావిధిగా చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నప్పటికీ తదుపరి అమ్మకాలు పెరగడంతో వెనకడుగు వేశాయి. మిడ్‌సెషన్‌ నుంచీ అమ్మకాలు ఉధృతంకావడంతో చివరికి పతనంతో నిలిచాయి. సెన్సెక్స్‌ 695 పాయింట్లు కోల్పోయి 43,828 వద్ద ముగిసింది. నిఫ్టీ 197 పాయింట్లు వొదులుకుని 12,858 వద్ద స్థిరపడింది. తొలుత సెన్సెక్స్‌ 44,825 పాయింట్ల వద్ద సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. తదుపరి 43,758 వరకూ జారింది. వెరసి ఇంట్రాడే గరిష్టం నుంచి 1,050 పాయింట్లు కోల్పోయింది. ఇక నిఫ్టీ సైతం 13,146 వద్ద గరిష్టాన్ని తాకగా.. 12,834 దిగువన కనిష్టాన్నీ చవిచూసింది. గురువారం(26న) నవంబర్‌ డెరివేటివ్‌ సిరీస్‌ ముగింపు నేపథ్యంలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడం దెబ్బతీసినట్లు మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా.. తొలుత ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్‌ నిఫ్టీ తొలిసారి 30,000 పాయింట్ల మార్క్‌ను దాటేసింది. 30,198కు చేరి రికార్డ్‌ నెలకొల్పింది. 

పీఎస్‌యూ బ్యాంక్స్‌ జోరు
ఎన్‌ఎస్‌ఈలో ప్రధాన రంగాలన్నీ2.5-1 శాతం మధ్య క్షీణించగా.. ప్రభుత్వ రంగ బ్యాంక్స్‌ 1.7 శాతం ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఓఎన్‌జీసీ 6 శాతం జంప్‌చేయగా.. గెయిల్‌, అదానీ పోర్ట్స్‌, ఎస్‌బీఐ లైఫ్‌, కోల్‌ ఇండియా మాత్రమే అదికూడా 1.7-0.5 శాతం మధ్య బలపడ్డాయి. అయితే ఐషర్‌, యాక్సిస్‌, కొటక్‌ మహీంద్రా, సన్‌ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, డాక్టర్‌ రెడ్డీస్, శ్రీ సిమెంట్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హీరో మోటో, యూపీఎల్‌, సిప్లా, ఎయిర్‌టెల్‌ 4-2 శాతం మధ్య వెనకడుగు వేశాయి. 

చిన్న షేర్లు వీక్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో బీవోబీ, శ్రీరామ్‌ ట్రాన్స్‌, కెనరా బ్యాంక్‌, పీఎన్‌బీ, మణప్పురం, టాటా పవర్‌, బంధన్‌ బ్యాంక్‌, ఐబీ హౌసింగ్‌, పీవీఆర్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ 4.5-2 శాతం మధ్య జంప్‌ చేశాయి. కాగా.. మరోపక్క ఐడియా, జూబిలెంట్‌ ఫుడ్‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌, డీఎల్‌ఎఫ్‌, ఇండిగో, జిందాల్‌ స్టీల్‌, ఎంఆర్‌ఎఫ్, కాల్గేట్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ 5.4-3.3 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1.7-1 శాతం చొప్పున నీరసించాయి. ట్రేడైన షేర్లలో 1,126 లాభపడగా.. 1,660 నష్టాలతో ముగిశాయి.

ఎఫ్‌పీఐల ఇన్వెస్ట్‌మెంట్స్‌
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 4,563 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా..  దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 2,522 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 4,738 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 2,944 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement