దాదాపు ఆరు బ్యాంకులు గురువారం తమ క్యూ1 ఫలితాలను ప్రకటించగా, ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ మాత్రమే నికర లాభంలో వృద్ధి నమోదు చేసింది. దీని నికర లాభం రూ.74 కోట్ల నుంచి 26 శాతం వృద్ధితో రూ.94 కోట్లకు పెరిగింది. మిగిలిన బ్యాంకులపై మొండిబకా యిల భారం పడింది. వివరాలివీ...
బ్యాంక్ ఆఫ్ బరోడా... ‘జన’ ఖాతాలకు కొత్త సంస్థ
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ) ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.1,052 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం నికర లాభం(రూ.1,362 కోట్లు)తో పోలిస్తే 23 శాతం క్షీణిత నమోదైందని బ్యాంక్ తెలిపింది. వేతన సవరింపు, మొండి బకాయిలకు అధిక కేటాయింపులు, ట్రెజరీ ఆదాయం పడిపోవడం వంటి కారణాల వల్ల నికర లాభం క్షీణించిందని బ్యాంక్ సీఈఓ రంజన్ ధావన్ చెప్పారు. గత క్యూ1లో రూ.11,683 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం 5 శాతం వృద్ధితో రూ.12,244 కోట్లకు పెరిగిందని వివరించారు.
స్థూల మొండి బకాయిలు 3.11 శాతం నుంచి 4.13 శాతానికి, నికర మొండి బకాయిలు 1.58 శాతం నుంచి 2.07 శాతానికి పెరిగాయని తెలిపారు. ఈ ఏడాది టైర్ వన్, టైర్ టూ బాండ్ల ద్వారా రూ4,000-5,000 కోట్లు సమీకరించాలని యోచిస్తున్నామని చెప్పారు. జనధన యోజన కింద ప్రారంభించిన బ్యాంక్ ఖాతాల నిర్వహణ కోసం అనుబంధ సంస్థను ఏర్పాటు చేయడానికి డెరైక్టర్ల బోర్డ్ ఆమోదం పొందామని, ఈ సంస్థ చెల్లింపు, సూక్ష్మ రుణ సంస్థగా కార్యకలాపాలు నిర్వహిస్తుందని తెలిపారు.ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఈ బ్యాంక్ షేర్ 10 శాతం వృద్ధితో రూ.169కి ఎగసింది.
విజయ బ్యాంక్... కేటాయింపులతో కుదేల్
న్యూఢిల్లీ: విజయ బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలానికి 12 శాతం క్షీణించింది. గత క్యూ1లో రూ.161 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.143 కోట్లకు తగ్గిందని విజయ బ్యాంక్ పేర్కొంది. మొండి బకాయిలకు అధిక కేటాయింపుల కారణంగా నికర లాభం తగ్గిందని వివరించింది. మొత్తం ఆదాయం రూ.3,190 కోట్ల నుంచి రూ.3,289 కోట్లకు పెరిగిందని వివరించింది. స్థూల మొండి బకాయిలు 2.68 శాతం నుంచి 3.39 శాతానికి, అలాగే నికర మొండి బకాయిలు 1.77% నుంచి 2.45 శాతానికి పెరిగాయని పేర్కొంది. ఫలితాల నేపధ్యంలో బ్యాంక్ షేర్ బీఎస్‌ఈలో 2% వృద్ధితో రూ.40కు పెరిగింది.
ఓబీసీ.. ఆదాయమూ తగ్గింది
ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలానికి 29 శాతం తగ్గింది. గత క్యూ1లో రూ.365 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.258 కోట్లకు తగ్గింది. మొత్తం ఆదాయం రూ.5,576 కోట్ల నుంచి రూ.5,569 కోట్లకు పడిపోయింది. మొండి బకాయిలకు కేటాయింపులు రూ.478 కోట్ల నుంచి రూ.596 కోట్లకు పెరిగాయి. స్థూల మొండి బకాయిలు 4.33 శాతం (రూ.5,983 కోట్ల)నుంచి 5.85(రూ.8,577 కోట్లు), నికర మొండి బకాయిలు 3.11 శాతం నుంచి 3.76 శాతానికి (4,228 కోట్ల నుంచి 5,358 కోట్లకు) పెరిగాయి. నికర వడ్డీ ఆదాయం రూ.1,243 కోట్ల నుంచి 7 శాతం వృద్ధితో రూ.1,329 కోట్లకు వృద్ధి చెందింది. ఫలితాల నేపథ్యలో ఈ బ్యాంక్ షేర్లు బీఎస్‌ఈలో 4 శాతం వృద్ధితో రూ.164 వద్ద ముగిశాయి.
81 శాతం పడిన దేనా బ్యాంక్ లాభం
గత క్యూ1లో రూ.82 కోట్లుగా ఉన్న దేనా బ్యాంక్ నికర లాభం ఈ క్యూ1లో 81 శాతం తగ్గి, రూ.15 కోట్లకు పడిపోయింది. మొండి బకాయిలు బాగా పెరగడమే దీనికి కారణమని బ్యాంక్ తెలిపింది. ఆదాయం రూ.2,825 కోట్ల నుంచి 3 శాతం వృద్ధితో రూ.2,915 కోట్లకు, స్థూ మొండి బకాయిలు 4.21 శాతం నుంచి 6.2 శాతానికి, నికర మొండి బకాయిలు 2.94 శాతం నుంచి 4.24 శాతానికి, మొండి బకాయిలకు కేటాయింపులు రూ.228 కోట్ల నుంచి రూ.325 కోట్లకు పెరిగాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఈ బ్యాం షేర్ 4 శాతం లాభపడి రూ.44 వద్ద ముగిసింది.
కోటక్ మహీంద్రా బ్యాంక్... ఐఎన్‌జీ వైశ్యా ఎఫెక్ట్
ముంబై: కోటక్ మహీంద్రా బ్యాంక్ నికర లాభం (కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో 26 శాతం క్షీణించి రూ.517 కోట్లకు తగ్గింది. ఐఎన్‌జీ వైశ్యా బ్యాంక్ విలీనం తర్వాత కోటక్ బ్యాంక్ వెలువరించిన తొలి ఆర్థిక ఫలితాలు ఇవి. ఐఎన్‌జీ వైశ్యా బ్యాంక్ నిరర్థక ఆస్తులు, ఆ బ్యాంక్ ఉద్యోగుల రిటైర్మెంట్ ప్రయోజనాల కోసం కేటాయింపుల కారణంగా నికర లాభం తగ్గిందని కోటక్ మహీంద్రా బ్యాంక్ తెలిపింది. స్డాండోలోన్ ప్రాతిపదికన నికర లాభం రూ.429 కోట్ల నుంచి రూ.190 కోట్లకు పడిపోయిందని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్-చైర్మన్, ఎండీ, ఉదయ్ కోటక్ వెల్లడించారు.
బ్యాంక్ స్ట్రీట్... క్యూ1పై మొండి బకాయిల భారం!
Published Fri, Jul 31 2015 1:14 AM | Last Updated on Sun, Sep 3 2017 6:27 AM
Advertisement