న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) విలీనాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన ఒక్క రోజు సమ్మెతో బుధవారం దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ కార్యకలాపాలు స్తంభించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు, పాత తరం ప్రైవేట్ బ్యాంకులతో పాటు కొన్ని విదేశీ బ్యాంకులకు చెందిన దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. అయితే, కొత్త తరం ప్రైవేట్ రంగ బ్యాంకు ఉద్యోగులు మాత్రం దీనికి దూరంగా ఉన్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయ బ్యాంక్, దేనా బ్యాంక్ విలీనాన్ని వ్యతిరేకిస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. సమ్మెతో బ్యాంకు శాఖల్లో డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్, చెక్కుల క్లియరెన్సులు, డిమాండ్ డ్రాఫ్ట్‌ల జారీ వంటి బ్యాంకింగ్ సేవలపై ప్రతికూల ప్రభావం పడినట్లు ఉద్యోగ సంఘాలు తెలిపాయి.
మహారాష్ట్ర, గోవా, గుజరాత్‌లో ఏకంగా రూ. 2 లక్షల కోట్ల విలువ చేసే చెక్కుల లావాదేవీలు నిల్చిపోయినట్లు వివరించాయి. ఒక్క మధ్యప్రదేశ్‌లోనే ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన 7,000 శాఖల్లో సర్వీసులు స్తంభించాయని యూఎఫ్‌బీయూ మధ్యప్రదేశ్ యూనిట్ కో–ఆర్డినేటర్ ఎంకే శుక్లా తెలిపారు. తమ డిమాండ్లు న్యాయమైనవేనని ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం సమ్మె సందర్భంగా చెప్పారు.
వారం రోజుల వ్యవధిలో రెండోసారి..
మూడు ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ, వేతనాల పెంపు కోరుతూ బ్యాంకు ఉద్యోగులు గత వారం రోజుల్లో సమ్మెకు దిగడం ఇది రెండోసారి. గత శుక్రవారం (డిసెంబర్ 21న) ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన 3.20 లక్షల మంది అధికారులు ఒక్క రోజు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. మరోవైపు, చాలామటుకు బ్యాంకింగ్ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగినట్లు సీనియర్ బ్యాంకర్లు తెలిపారు. ‘కస్టమర్లకు అసౌకర్యం కలగకుండా అన్ని చెక్ క్లియరింగ్ సెంటర్స్‌లో బాధ్యతలను సీనియర్ అధికారులకు అప్పగించడం జరిగింది. ట్రెజరీ వంటి మిగతా కార్యకలాపాలు కూడా య«థావిధిగానే కొనసాగాయి‘ అని ప్రభుత్వ రంగ బ్యాంకు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. బీవోబీలో విజయా, దేనా బ్యాంకులను విలీనం చేయనున్నట్లు ఈ ఏడాది సెప్టెంబర్‌లో కేంద్రం ప్రకటించింది. ఈ మూడింటి కలయికతో ఏర్పడే విలీన బ్యాంకు రూ. 14.82 లక్షల కోట్ల వ్యాపారంతో దేశీయంగా ఎస్‌బీఐ, ఐసీఐసీఐల తర్వాత మూడో అతి పెద్ద బ్యాంకుగా ఏర్పడనుంది.
కానీ దీనివల్ల ఇటు ఆ బ్యాంకులకు గానీ ఖాతాదారులకు గానీ ఒనగూరే ప్రయోజనాలేమీ లేవని బ్యాంకు ఉద్యోగ యూనియన్లు చెబుతున్నాయి. విలీనం వల్ల పలు శాఖలు మూతబడతాయని, కస్టమర్లకు సమస్యలు పెరుగుతాయని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే యూఎఫ్‌బీయూ బుధవారం సమ్మె చేపట్టింది. ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నప్పటికీ.. కేంద్ర ఆర్థిక శాఖ గతవారం విలీన ప్రతిపాదనకు సూత్రప్రాయ ఆమోదముద్ర కూడా వేసింది. ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీవోసీ), ఏఐబీఈఏ, నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (ఎన్‌సీబీఈ), నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ (ఎన్‌వోబీడబ్ల్యూ) తదితర 9 యూనియన్లు యూఎఫ్‌బీయూలో భాగంగా ఉన్నాయి.
21 ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన సుమారు 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు వంటి ప్రైవేట్ బ్యాంకులు య«థావిధిగా పనిచేయగా.. ఫెడరల్ బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్ వంటి ప్రైవేట్ బ్యాంకులు మూతబడ్డాయి. సమ్మె నేపథ్యంలో చాలా చోట్ల ఏటీఎంలు ఖాళీ కాగా.. ప్రైవేట్ బ్యాంకుల చెక్ క్లియరెన్సులు కూడా నిల్చిపోయాయి. గురువారం నుంచి బ్యాంకింగ్ కార్యకలాపాలు యథాప్రకారం కొనసాగుతాయి. విలీనాల వంటి దుస్సాహసాలకు దిగకుండా బ్యాంకులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న మొండిబాకీల సంక్షోభానికి గల కారణాలను అన్వేషించడం, పరిష్కరించడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఏఐబీవోసీ జనరల్ సెక్రటరీ సౌమ్య దత్తా వ్యాఖ్యానించారు. కేవలం పెద్ద బ్యాంకులు మాత్రమే పటిష్టంగా, సమర్ధంగా పనిచేస్తాయనడానికి దాఖలాలేమీ లేవని వెంకటాచలం పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment