త్వరలో రెండో విడత గోల్డ్ బాండ్ స్కీమ్
న్యూఢిల్లీ: బ్యాంకులు త్వరలో రెండవ విడత గోల్డ్ బాండ్ స్కీమ్‌ను ప్రారంభించనున్నాయని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ బుధవారం ట్వీట్ చేశారు. నవంబర్‌లో రిజర్వ్ బ్యాంక్ గోల్డ్ బాండ్ స్కీమ్ మొదటి విడతను ఆవిష్కరించింది. ఈ బాండ్లకు మంచి స్పందనే వచ్చింది. రూ.246 కోట్ల విలువకు సంబంధించి 916 కేజీల పసిడి బాండ్లను బ్యాంకులు విక్రయించాయి. 5, 10, 50, 100 గ్రాముల డినామినేషన్లలో ఐదేళ్ల నుంచి ఏడేళ్ల మెచ్యూరిటీ కాలపరిమితితో ఈ బాండ్ స్కీమ్ జారీ అయ్యింది.
పెట్టుబడి సమయంలో మెటల్ ధర ప్రాతిపదికన వడ్డీరేటును నిర్ణయిస్తారు. ఒక వ్యక్తి వార్షికంగా 500 గ్రాముల వరకూ ఈ పథకం కింద పసిడి బాండ్ కొనుగోలుకు వీలుంది. ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 5న రెండు పసిడి పథకాలను ఆవిష్కరించారు. బ్యాంకుల్లో పసిడి డిపాజిట్ పథకం ఇందులో మరొకటి. దిగుమతులను తగ్గించడం, దేశంలో బీరువాల్లో అప్రధానంగా ఉన్న పసిడిని వ్యవస్థలోకి తీసుకురావడం లక్ష్యంగా ఈ పథకాలను రూపొందించారు. అయితే పసిడి డిపాజిట్ పథకానికి స్పందన అంతంతమాత్రంగా నమోదైన సంగతి తెలిసిందే.