Bond Scheme
-
కొత్త సేవింగ్స్ బాండ్ స్కీము
న్యూఢిల్లీ: రిటైల్ ఇన్వెస్టర్ల కోసం కేంద్రం కొత్తగా 7.75% వడ్డీ రేటుతో కొత్త బాండ్ స్కీమును ప్రకటించింది. ఏడేళ్ల మెచ్యూరిటీ వ్యవధి ఉండే ఈ బాండ్లకు జనవరి 10 నుంచి సబ్స్క్రిప్షన్స్ ప్రారంభం కానున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గత 8 శాతం స్కీము స్థానంలో దీన్ని ప్రవేశపెడుతున్నట్లు ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి ఎస్సి గర్గ్ .. ‘ట్వీట్’ చేశారు. వడ్డీ రేటును తగ్గించడానికి ఆర్థిక శాఖ ప్రత్యేకంగా ఏ కారణం చూపకపోయినప్పటికీ.. ప్రస్తుతం ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతున్న దరిమిలా ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ స్కీములో వడ్డీని అర్ధ సంవత్సరానికోసారి లెక్కిస్తారు. దీంతో రూ.1,000 మేర ఇన్వెస్ట్ చేసిన పక్షంలో ఏడేళ్ల తర్వాత ఆ విలువ రూ.1,703గా ఉంటుంది. ఈ బాండ్లకు పన్నులు కూడా వర్తిస్తాయి. వీటిని సెకండరీ మార్కెట్లో ట్రేడింగ్ చేసుకోవడానికి వీలుండదని, అలాగే బ్యాంకులు.. ఇతరత్రా నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకునే క్రమంలో తనఖా పెట్టడానికి కూడా ఈ బాండ్లు ఉపయోగపడవని కేంద్రం పేర్కొంది. రిటైల్ ఇన్వెస్టర్లను పెట్టుబడులవైపు ప్రోత్సహించే లక్ష్యంలో 2003లో అప్పటి ప్రభుత్వం 8% వడ్డీ రేటుతో ఆరేళ్ల వ్యవధి ఉండే సేవింగ్స్ బాండ్స్ స్కీమును ప్రవేశపెట్టింది. -
పార్టీల విరాళాలే టార్గెట్: ఎలక్టోరల్ బాండ్స్
సాక్షి, న్యూఢిల్లీః రాజకీయ పార్టీలకు అందే ఎన్నికల విరాళాల్లో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళికను ప్రకటించింది. పార్టీలకు అందే కోట్ల కొద్దీ విరాళాలకు చెక్ పెట్టే యోచనతో ఎలక్టోరల్బాండ్స్ పథకాన్ని లాంచ్ చేసింది. 2017 ఫిబ్రవరి 1న 2017-18 బడ్జెట్ ప్రసంగంలో రాజకీయ నిధుల పారదర్శకత అంశాన్ని ప్రస్తావించిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం లోక్‌సభలో ఈ బాండ్స్‌పై వివరణ ఇచ్చారు. ఈ పథకంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుందని, ఈ రోజు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు వెల్లడించారు.వీటిని రాజకీయ పార్టీలకు విరాళాలిచ్చే సందర్భంగా వాడుకోవచ్చన్నారు. భారతదేశ పౌరుడు లేదా దేశంలో ఉన్న కార్పొరేట్ సంస్థలకు ఈ బాండ్లను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ బాండ్లు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా జనవరి, ఏప్రిల్, జులై, అక్టోబర్ నెలల్లో పది రోజుల పాటు ఈ బాండ్లను ఎస్బీఐ నుంచి కొనుగోలు చేయొచ్చని జైట్లీ వివరించారు. ఇలా వెయ్యి, పది వేలు, లక్ష, పది లక్షలు, కోటి రూపాయలు.. ఇలా ఎంత విలువైన బాండ్‌నైనా కొనుగోలు చేయొచ్చని తెలిపారు. అలాగే ఈ బాండ్లపై విరాళం ఇస్తున్న వారి పేర్లు ఉండవు. కానీ ఈ బాండ్లను కొనుగోలు చేసే వ్యక్తి తన కేవైసీ వివరాలను ఎస్బీఐకి చెప్పాల్సి ఉంటుందని జైట్లీ స్పష్టంచేశారు. పేరుకు బాండ్లే అయినా వీటికి వడ్డీ ఉండదు. ఒక రకంగా ప్రామిసరీ నోటు లాంటిది. ఆ విరాళాలు సంబంధిత రాజకీయ పార్టీకి చేరేవరకు ఎస్బీఐ బాధ్యత వహిస్తుంది. వీటి కాలపరిమితి 15 రోజులు. ఈ గడువులోపు సంబంధిత రిజిస్టర్డ్ రాజకీయ పార్టీ పేరిట ఉన్న బ్యాంక్ అకౌంట్ ద్వారా వీటిని నగదు రూపంలోకి మార్చుకునే వీలుంటుంది.ఈ ఎన్నికల బాండ్ల ద్వారా ఎంత డబ్బు సంపాదించిందో ఎన్నికల కమిషన్ రిటర్న్స్‌లో ప్రతి రాజకీయ పార్టీ దాఖలు చేయాలని ఆర్థికమంత్రి చెప్పారు. సార్వత్రిక ఎన్నికలు ఉన్న ఏడాదిలో ప్రతి నెలా 30 రోజుల పాటు ఇస్తారని ఆర్థిక మంత్రి జైట్లీ వెల్లడించారు. The Government of India today notified the Scheme of Electoral Bonds to cleanse the system of political funding in the country.Electoral Bond would be a bearer instrument in the nature of a Promissory Note and an interest free banking instrument. — Ministry of Finance (@FinMinIndia) January 2, 2018 -
త్వరలో రెండో విడత గోల్డ్ బాండ్ స్కీమ్
న్యూఢిల్లీ: బ్యాంకులు త్వరలో రెండవ విడత గోల్డ్ బాండ్ స్కీమ్‌ను ప్రారంభించనున్నాయని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ బుధవారం ట్వీట్ చేశారు. నవంబర్‌లో రిజర్వ్ బ్యాంక్ గోల్డ్ బాండ్ స్కీమ్ మొదటి విడతను ఆవిష్కరించింది. ఈ బాండ్లకు మంచి స్పందనే వచ్చింది. రూ.246 కోట్ల విలువకు సంబంధించి 916 కేజీల పసిడి బాండ్లను బ్యాంకులు విక్రయించాయి. 5, 10, 50, 100 గ్రాముల డినామినేషన్లలో ఐదేళ్ల నుంచి ఏడేళ్ల మెచ్యూరిటీ కాలపరిమితితో ఈ బాండ్ స్కీమ్ జారీ అయ్యింది. పెట్టుబడి సమయంలో మెటల్ ధర ప్రాతిపదికన వడ్డీరేటును నిర్ణయిస్తారు. ఒక వ్యక్తి వార్షికంగా 500 గ్రాముల వరకూ ఈ పథకం కింద పసిడి బాండ్ కొనుగోలుకు వీలుంది. ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 5న రెండు పసిడి పథకాలను ఆవిష్కరించారు. బ్యాంకుల్లో పసిడి డిపాజిట్ పథకం ఇందులో మరొకటి. దిగుమతులను తగ్గించడం, దేశంలో బీరువాల్లో అప్రధానంగా ఉన్న పసిడిని వ్యవస్థలోకి తీసుకురావడం లక్ష్యంగా ఈ పథకాలను రూపొందించారు. అయితే పసిడి డిపాజిట్ పథకానికి స్పందన అంతంతమాత్రంగా నమోదైన సంగతి తెలిసిందే.