
మార్చిలో మౌలిక రంగం జూమ్
న్యూఢిల్లీ: బొగ్గు, ఉక్కు ఉత్పత్తి ఊతంతో మౌలిక రంగ వృద్ధి మార్చిలో 5 శాతం ఎగిసింది. గడిచిన మూడు నెలల్లో ఇదే అత్యధికం. అయితే, గతేడాది మార్చిలో నమోదైన 9.3 శాతంతో పోలిస్తే తక్కువే కావడం గమనార్హం. మౌలిక రంగ వృద్ధి చివరిసారిగా గతేడాది డిసెంబర్‌లో 5.6 శాతంగా నమోదైంది. ఆ తర్వాత ఈ ఏడాది జనవరిలో 3.4 శాతం, ఫిబ్రవరిలో 1 శాతంగానూ ఉంది. బొగ్గు, ముడిచమురు, నేచురల్ గ్యాస్, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్, విద్యుత్ వంటి ఎనిమిది కీలక పరిశ్రమలను మౌలిక రంగం గ్రూప్‌గా పరిగణిస్తారు.
దేశ పారిశ్రామికోత్పత్తిలో ఈ గ్రూప్ వాటా 38 శాతం. బొగ్గు ఉత్పత్తి మార్చిలో 10 శాతం పెరిగింది. గతేడాది మార్చిలో ఇది 2.5%. ఉక్కు ఉత్పత్తి వృద్ధి 7.8% నుంచి 11%కి పెరిగింది. విద్యుదుత్పత్తి 5.9 శాతం, నేచురల్ గ్యాస్ ఉత్పత్తి 8.3% పెరిగాయి. ఆర్థిక సంవత్సరాల వారీగా చూస్తే మార్చి 2017తో ముగిసిన సంవత్సరంలో మౌలిక రంగం 4.5% వృద్ధి సాధించింది. అంతక్రితం ఏడాది ఇది 4 శాతమే.