బేసిక్‌ డీమ్యాట్‌ బెటర్‌ గురూ! | Basic services demat account for small investors | Sakshi
Sakshi News home page

బేసిక్‌ డీమ్యాట్‌ బెటర్‌ గురూ!

Published Mon, Oct 2 2017 12:26 AM | Last Updated on Fri, Nov 9 2018 5:30 PM

Basic services demat account for small investors - Sakshi

మధ్యలో చిన్నచిన్న ఒడిదుడుకు  లొచ్చినా దాదాపు మూడేళ్లుగా మార్కెట్‌ బుల్‌ రన్‌ కొనసాగుతూనే ఉంది. ‘‘నాకు ఈ ఏడాది షేర్‌ మార్కెట్లో రెండు రెట్ల లాభాలొచ్చాయి. నేను పెట్టిన సొమ్ము ఆరు నెలల్లోనే రెట్టింపయింది’’ అనే మాటలు తరచుగానే వినిపిస్తున్నాయి. ఇవన్నీ చూసి... కొందరు స్టాక్‌ మార్కెట్లలో ఇన్వెస్ట్‌మెంట్లలోకి మళ్లుతున్నారు. కాకపోతే దీనికి సంబంధించి ఏం చేయాలనేది చాలామందికి తెలియదనే చెప్పాలి. తెలిసిన స్నేహితుల్ని సలహా అడగటం... వారు చెప్పినట్లు చేయటం... తరవాత తప్పొప్పులు బేరీజు వేసుకోవటం కూడా చాలామంది చేస్తుంటారు. అలాంటి వారు ముందుగా తెలుసుకోవాల్సింది ఒకటుంది!!. అదేంటంటే... తమకు ఏ తరహా డీమ్యాట్‌ ఖాతా సరిపోతుందనేది!.

సాధారణంగా షేర్ల ట్రేడింగ్‌కు డీమ్యాట్‌ ఖాతా ఉండాలి. ఈ ఖాతా తీసుకున్నాక.. లావాదేవీలు, పోర్ట్‌ఫోలియో పరిమాణం ఎలా ఉన్నా నిర్వహణ చార్జీల పేరిట ఏటా కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఇలాంటి చార్జీల ప్రమేయం లేకుండా ప్రాథమిక సర్వీసులను మాత్రమే ఉపయోగించుకోగలిగే డీమ్యాట్‌ ఖాతాలు కూడా తీసుకోవచ్చని చాలామందికి తెలియదు. వాటిని బేసిక్‌ సర్వీసెస్‌ డీమ్యాట్‌ ఖాతాలు అంటారు. ఇది పూర్తి స్థాయి డీమ్యాట్‌ అకౌంట్‌ కాదు. ప్రాథమిక సేవలు మాత్రమే అందుతాయి. ఇది ఎలాంటి వారికి అనువైనదో, ఏ సేవలు పొందవచ్చో ఒకసారి చూద్దాం..

బేసిక్‌ సర్వీసెస్‌ డీమ్యాట్‌ అంటే...
షేర్లు వంటి ఆర్థిక సాధనాలను ఎలక్ట్రానిక్‌ రూపంలో భద్రపర్చుకునేందుకు ఉపయోగపడే ఖాతాను డీమ్యాట్‌ ఖాతాగా వ్యవహరిస్తారు. అంటే డీమెటీరియలైజ్డ్‌ ఖాతా అన్నమాట. స్టాక్‌మార్కెట్‌లో మరింత మంది ఇన్వెస్ట్‌ చేసేలా పోత్సహించే ఉద్దేశంతో.. డీమ్యాట్‌ ప్రొవైడర్లు (డీపీ) కచ్చితంగా ప్రాథమిక సేవల డీమ్యాట్‌ ఖాతాలు (బీఎస్‌డీఏ) కూడా అందించాలని సెబీ నిర్దేశించింది. దీంతో చిన్న మొత్తాల్లో స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేద్దామనుకునే వారు వార్షిక నిర్వహణ చార్జీలు మొదలైన బాదరబందీ లేకుండా బీఎస్‌డీఏని ఉపయోగించుకోవచ్చు.

బీఎస్‌డీఏ ప్రత్యేకతలేమిటి..
మీ పోర్ట్‌ఫోలియో పరిమాణం రూ.2,00,000 కన్నా తక్కువే ఉండొచ్చని అనుకున్న పక్షంలో బేసిక్‌ సర్వీసెస్‌ డీమ్యాట్‌ అకౌంటు తెరవొచ్చు. ఏ డీమ్యాట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ దగ్గరైనా దీన్ని పొందవచ్చు. ఒకవేళ ప్రస్తుత డీమ్యాట్‌ ఖాతా పెద్దగా వినియోగంలో లేకపోయినా.. ప్రాథమిక సేవల డీమ్యాట్‌ ఖాతా ఒక రకంగా ఉచిత ఖాతాలాంటిదే. ఎందుకంటే మీ లావాదేవీల విలువ రూ.50,000 కన్నా తక్కువగా ఉన్న పక్షంలో మెయింటెనెన్స్‌ చార్జీల్లాంటివి కట్టక్కర్లేదు. అదే రూ.50,000 నుంచి రూ. 2,00,000 మధ్యలో ఉంటే రూ.100 కడితే సరిపోతుంది. ఒకవేళ మీ హోల్డింగ్స్‌ పరిమాణం రూ.2,00,000 దాటిన పక్షంలో బీఎస్‌డీఏని డీపీ సాధారణ డీమ్యాట్‌ ఖాతా కింద పరిగణించి తదనుగుణంగా చార్జీలు వసూలు చేస్తారు. ప్రధానంగా రిటైల్‌ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు, రిటైల్‌ ఇన్వెస్టర్లు తమ సెక్యూరిటీస్‌ను డీమ్యాట్‌ రూపంలో భద్రపర్చుకునేలా చూసేందుకు ఈ వెసులుబాటు కల్పిస్తున్నారు. ఒకవేళ ఇప్పటికే ఒక డీమ్యాట్‌ అకౌంటున్న పక్షంలో అది పెద్దగా వినియోగంలో లేకపోయినా లేదా పోర్ట్‌ఫోలియో పరిమాణం చాలా తక్కువగా ఉన్నా.. డీపీని సంప్రతించి దాన్ని బీఎస్‌డీఏ కింద మార్చుకునే వెసులుబాటు ఉంది.

పోర్ట్‌ఫోలియో    విలువ లెక్కించేదిలా..
పోర్ట్‌ఫోలియో విలువను డీపీ సంస్థ .. ఆయా షేర్లు, ఫండ్స్‌ మొదలైన వాటి రోజువారీ క్లోజింగ్‌ ధరల ఆధారంగా లెక్కిస్తుంది. మీ బీఎస్‌డీఏ పరిమితులతో దీన్ని పోల్చి చూస్తుంది. పోర్ట్‌ఫోలి యో విలువ పరిమితిని దాటిన పక్షంలో సాధారణ డీమ్యాట్‌ ఖాతా కింద గానీ లేదా నిర్దేశిత స్లాబ్‌ కింద గానీ మీ నుంచి ఫీజులు వసూలు చేస్తుంది.


లావాదేవీల స్టేట్‌మెంట్‌..
బీఎస్‌డీఏ యాక్టివ్‌గా ఉండి, నిర్దిష్ట బ్యాలెన్స్‌ను కొనసాగిస్తూ ఉన్న పక్షంలో ప్రతి మూడు నెలలకోసారి లావాదేవీల స్టేట్‌మెంట్‌ వస్తుంది. అదే త్రైమాసికంలో లావాదేవీలేమీ జరగక పోగా సెక్యూరిటీ బ్యాలెన్స్‌ కూడా లేకపోతే లావాదేవీల నివేదిక రాదు. ఈ స్టేట్‌మెంట్‌ ప్రధానంగా ఎలక్ట్రానిక్‌ కాపీ (సాఫ్ట్‌ కాపీ), హార్డ్‌ కాపీల రూపంలో ఉంటుంది. ఎలక్ట్రానిక్‌ స్టేట్‌మెంట్స్‌ ఉచితంగానే పొందవచ్చు. అయితే, హార్డ్‌కాపీ కావాలనుకుంటే తొలి రెండు స్టేట్‌మెంట్స్‌ మాత్రమే ఉచితంగా లభిస్తాయి. అదనపు స్టేట్‌మెంట్స్‌ కోసం రూ. 25 చెల్లించాల్సి వస్తుంది.

వార్షిక హోల్డింగ్‌ స్టేట్‌మెంట్‌..
ఏడాదికోసారి ఖాతాలో హోల్డింగ్స్‌కి సంబంధించిన స్టేట్‌మెంట్‌ను ఖాతాదారు నమోదు చేసుకున్న చిరునామాకు వస్తుంది. దీన్ని హార్డ్‌ కాపీ రూపంలో లేదా ఖాతాదారు కోరుకున్న పక్షంలో ఈమెయిల్‌కు సాఫ్ట్‌ కాపీ రూపంలో పంపడం జరుగుతుంది.

ఎస్‌ఎంఎస్‌ అలర్ట్‌ సదుపాయం..
ఖాతాలో జరిగిన ప్రతి లావాదేవీకి సంబంధించి ఎస్‌ఎంఎస్‌ అలర్ట్‌ పొందడానికి ఖాతాదారు తన మొబైల్‌ నంబరును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement