సాక్షి, న్యూఢిల్లీ: ప్రీమియం బైక్‌ల బ్రాండ్ బెనెల్లి కొత్త బైక్ ‘ఇంపీరియల్ 400’ను భారత మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. దీని ధర రూ.1.69 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించింది. ఎరుపు, వెండి, నలుపు రంగుల్లో లభిస్తుంది. రూ. 4 వేలు టోకెన్ ధర చెల్లించి బెనెల్లి ఇండియా, కంపెనీ వెబ్‌సైట్ ద్వారా ఈ బైక్‌ను బుక్ చేసుకోవచ్చు.
374 సీసీ సామర్థ్యం కలిగిన ఇంపీరియల్ 400 బైక్ బీఎస్-4 ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేశారు. సింగిల్ సిలెండర్, 4-స్ట్రోక్, ఎయిర్ కూల్డ్, 21 పీఎస్, 29 ఎన్‌ఎం పీక్ టార్‌క్యూ ఎఫ్ ఇంజిన్, 5 స్పీడ్ గేర్‌బాక్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. స్టీల్ డబుల్ క్రాడిల్ ఫ్రేమ్‌తో పాటు ముందు భాగంలో 41 మిల్లిమీటర్ల టెలిస్కోపిక్ ఫోర్క్ అమర్చారు. ముందు 19 అంగులాల టైరు, వెనుక 18 అంగులాల టైరుతో పాటు పీనట్ షేప్ ఫ్యూయల్ ట్యాంకు, స్ప్లిట్ సీట్ సెటప్‌లతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
బైకు తిరిగిన కిలోమీటర్లతో సంబంధం లేకుండా మూడేళ్ల పాటు వారెంటీ ఇవ్వనున్నట్టు బెనెల్లి ఇండియా తెలిపింది. మొదటి రెండేళ్లు కాంప్లిమెంటరీ సర్వీసు అందిస్తామని పేర్కొంది. వీటితో పాటు రెండేళ్లు పూర్తైన తర్వాత వార్షిక నిర్వహణ కాంట్రాక్టు కింద సేవలు అందించనున్నట్టు వెల్లడించింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, జవా స్టాండర్డ్ బైక్‌లకు ‘ఇంపీరియల్ 400’ గట్టి పోటీ ఇస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment