Benelli
-
ఎన్ఫీల్డ్ క్లాసిక్‌కు పోటీగా నయా బైక్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రీమియం బైక్‌ల బ్రాండ్ బెనెల్లి కొత్త బైక్ ‘ఇంపీరియల్ 400’ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ధర రూ.1.69 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించింది. ఎరుపు, వెండి, నలుపు రంగుల్లో లభిస్తుంది. రూ. 4 వేలు టోకెన్ ధర చెల్లించి బెనెల్లి ఇండియా, కంపెనీ వెబ్సైట్ ద్వారా ఈ బైక్‌ను బుక్ చేసుకోవచ్చు. 374 సీసీ సామర్థ్యం కలిగిన ఇంపీరియల్ 400 బైక్ బీఎస్-4 ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేశారు. సింగిల్ సిలెండర్, 4-స్ట్రోక్, ఎయిర్ కూల్డ్, 21 పీఎస్, 29 ఎన్ఎం పీక్ టార్క్యూ ఎఫ్ ఇంజిన్, 5 స్పీడ్ గేర్‌బాక్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. స్టీల్ డబుల్ క్రాడిల్ ఫ్రేమ్‌తో పాటు ముందు భాగంలో 41 మిల్లిమీటర్ల టెలిస్కోపిక్ ఫోర్క్ అమర్చారు. ముందు 19 అంగులాల టైరు, వెనుక 18 అంగులాల టైరుతో పాటు పీనట్ షేప్ ఫ్యూయల్ ట్యాంకు, స్ప్లిట్ సీట్ సెటప్‌లతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. బైకు తిరిగిన కిలోమీటర్లతో సంబంధం లేకుండా మూడేళ్ల పాటు వారెంటీ ఇవ్వనున్నట్టు బెనెల్లి ఇండియా తెలిపింది. మొదటి రెండేళ్లు కాంప్లిమెంటరీ సర్వీసు అందిస్తామని పేర్కొంది. వీటితో పాటు రెండేళ్లు పూర్తైన తర్వాత వార్షిక నిర్వహణ కాంట్రాక్టు కింద సేవలు అందించనున్నట్టు వెల్లడించింది. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350, జవా స్టాండర్డ్ బైక్‌లకు ‘ఇంపీరియల్ 400’ గట్టి పోటీ ఇస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
మాస్ మార్కెట్లోకి బెనెల్లి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రీమియం బైక్‌ల బ్రాండ్ బెనెల్లి... భారత్‌లో మాస్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తోంది. ఇందుకోసం 200 సీసీలోపు సామర్థ్యం ఉన్న ద్విచక్ర వాహనాలను మార్కెట్లోకి తేబోతోంది. అంతర్జాతీయంగా ఈ విభాగంలో కంపెనీ ఇప్పటికే ఏడు మోడళ్లను అందుబాటులో ఉంచింది. వీటిలో 125 సీసీ, 150, 175 సీసీ స్కూటర్లు కూడా ఉన్నాయి. ‘‘ఇవన్నీ కూడా 2020లో భారతీయ రోడ్లపై పరుగులు పెడతాయి’’ అని బెనెల్లి ఇండియా ఎండీ వికాస్ జబక్ శుక్రవారమిక్కడ మీడియాకు వెల్లడించారు. ఆ సమయానికి తమ తయారీ కేంద్రం కూడా రెడీ అవుతుందని, ఆ ప్లాంటులో ఇవి రూపుదిద్దుకుంటాయని చెప్పారాయన. 200 సీసీలోపు మోడళ్ల ధర ఎక్స్‌షోరూంలో రూ.2 లక్షల లోపే ఉంటుందని పేర్కొన్నారు. ధర ఆకర్షణీయంగా ఉంటుందని చెప్పారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో బెనెల్లి ప్రస్తుతం 18 రకాల మోడళ్లను విక్రయిస్తోంది. డిసెంబర్లో మూడు మోడళ్లు.. మహవీర్ గ్రూప్ కంపెనీ అయిన ఆదీశ్వర్ ఆటోరైడ్ ఇండియా (ఏఏఆర్ఐ) భారత్‌లో బెనెల్లి పంపిణీదారుగా ఉంది. హైదరాబాద్‌లో ఏఏఆర్ఐ అసెంబ్లింగ్ ప్లాంటును నెలకొల్పింది. ఈ కేంద్రంలో డిసెంబర్ తొలి వారంలో ద్విచక్ర వాహనాల అసెంబ్లింగ్ మొదలు కానుంది. రెండో వారం నుంచి ఇవి విక్రయ కేంద్రాలకు చేరతాయని వికాస్ వెల్లడించారు. ‘అసెంబ్లింగ్ ప్లాంటు కోసం కంపెనీ రూ.20 కోట్లు పెట్టుబడి పెట్టింది. వార్షిక సామర్థ్యం ఒక షిఫ్టుకు 7,000 యూనిట్లు. బెనెల్లి టీఎన్టీ 300, 302ఆర్, టీఎన్టీ 600ఐ బైక్‌లను రీలాంచ్ చేస్తున్నాం. వీటి ధరలు ఎక్స్ షోరూంలో వరుసగా రూ.3,50,000, రూ.3,70,000, రూ.6,20,000గా ఉంటాయి. అయిదేళ్ల వారంటీ ఇస్తున్నాం. ప్రస్తుతం 15 డీలర్షిప్ కేంద్రాలున్నాయి. మరో 25 కేంద్రాలు మార్చికల్లా రానున్నాయి’ అని వివరించారు. -
భారత్‌కు బెనెల్లి 175 సీసీ స్కూటర్
దీపావళికల్లా 250 సీసీ సూపర్ బైక్... డీఎస్కే మోటోవీల్స్ చైర్మన్ శిరీష్ కులకర్ణి వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : సూపర్ బైక్స్ తయారీలో ఉన్న ఇటలీ కంపెనీ బెనెల్లి 175 సీసీ కఫెనెరో స్కూటర్‌ను భారత్‌కు తీసుకొస్తోంది. రెండు నెలల్లో ఈ మోడల్ పనితీరును పరీక్షిస్తామని బెనెల్లి భారత భాగస్వామి అయిన డీఎస్కే మోటోవీల్స్ చైర్మన్ శిరీష్ కులకర్ణి తెలిపారు. జబక్ ఆటో సహకారంతో ఏర్పాటైన డీఎస్కే బెనెల్లి షోరూంను ప్రారంభించేందుకు బుధవారం హైదరాబాద్ వచ్చిన ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. బెనెల్లి 50 సీసీ స్కూటర్లు తయారు చేసినప్పటికీ, భారత్‌లో మాత్రం అధిక సామర్థ్యమున్న మోడళ్లనే విడుదల చేయాలని నిర్ణయించామన్నారు. దీపావళికల్లా 250 సీసీ సూపర్ బైక్‌ను ప్రవేశపెడతామని వెల్లడించారు. మొత్తంగా ఏడాదిలో మరో నాలుగు మోడళ్లు రానున్నాయి. డీఎస్కే మోటోవీల్స్ బెనెల్లితోపాటు కొరియాకు చెందిన హ్యోసంగ్ బైక్‌లను భారత్‌లో విక్రయిస్తోంది. విస్తరణ దిశగా..: హైదరాబాద్‌తో కలిపి డీఎస్కే బెనెల్లి షోరూంలు దేశంలో 6 ఉన్నాయి. మరో 14 షోరూంలను ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం అయిదు మోడళ్లను విక్రయిస్తున్నారు. ఇవి 300 సీసీ మొదలుకుని 1,131 సీసీ వరకు ఉన్నాయి. గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 400కుపైగా బుకింగ్స్ నమోదయ్యాయి. 2015-16లో 3,000 బైక్‌లను విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా చేసుకుంది. ఇందులో 10% హైదరాబాద్ నుంచి ఆశిస్తోంది. అలాగే హ్యోసంగ్ షోరూంలు 41 ఉన్నాయి. మరో 3 ఏర్పాటు చేస్తున్నారు. 6 రకాల మోడళ్లు 250 నుంచి 678 సీసీ వరకు ఉన్నాయి. గత మూడేళ్లలో 5,000 యూనిట్లు అమ్ముడయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3 వేల బైక్‌ల విక్రయం లక్ష్యంగా చేసుకుంది. పుణే సమీపంలోని ప్లాంటులో రెండు బ్రాండ్ల వాహనాలను అసెంబుల్ చేస్తున్నారు. 10 వేల యూనిట్లు అసెంబుల్ చేయగలిగే సామర్థ్యం ఈ ప్లాంటుకు ఉంది. 200-500 సీసీపైనే ఫోకస్.. రెండు బ్రాండ్లలోనూ 200-500 సీసీ సామర్థ్యం గల బైక్‌ల విక్రయాలపైనే ప్రధానంగా ఫోకస్ చేసినట్టు శిరీష్ తెలి పారు. ‘100-125 సీసీ బైక్‌లు నడిపినవారు 250 సీసీకి నేరుగా వెళ్తున్నారు. 150-200 సీసీ బైక్‌లను నడిపినవారు 300 సీసీ ఆపైన సామర్థ్యంగల మోడళ్లకు అప్‌గ్రేడ్ అవుతున్నారు. 250 సీసీ ఆపై సామర్థ్యంగల సూపర్ బైక్‌ల విపణి భారత్‌లో 50% వృద్ధితో 10,000 యూనిట్లుంది. మంచి బ్రాండ్లు, సూపర్‌బైక్‌ల పట్ల పెరుగుతున్న మోజు కారణంగా 2015-16లో ఈ సంఖ్య 15,000 యూనిట్లకు చేరుకుంటుంది’ అని ఆయన వివరించారు.