భారత్‌కు బెనెల్లి 175 సీసీ స్కూటర్
దీపావళికల్లా 250 సీసీ సూపర్ బైక్...
డీఎస్‌కే మోటోవీల్స్ చైర్మన్ శిరీష్ కులకర్ణి వెల్లడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : సూపర్ బైక్స్ తయారీలో ఉన్న ఇటలీ కంపెనీ బెనెల్లి 175 సీసీ కఫెనెరో స్కూటర్‌ను భారత్‌కు తీసుకొస్తోంది. రెండు నెలల్లో ఈ మోడల్ పనితీరును పరీక్షిస్తామని బెనెల్లి భారత భాగస్వామి అయిన డీఎస్‌కే మోటోవీల్స్ చైర్మన్ శిరీష్ కులకర్ణి తెలిపారు. జబక్ ఆటో సహకారంతో ఏర్పాటైన డీఎస్‌కే బెనెల్లి షోరూంను ప్రారంభించేందుకు బుధవారం హైదరాబాద్ వచ్చిన ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు.
బెనెల్లి 50 సీసీ స్కూటర్లు తయారు చేసినప్పటికీ, భారత్‌లో మాత్రం అధిక సామర్థ్యమున్న మోడళ్లనే విడుదల చేయాలని నిర్ణయించామన్నారు. దీపావళికల్లా 250 సీసీ సూపర్ బైక్‌ను ప్రవేశపెడతామని వెల్లడించారు. మొత్తంగా ఏడాదిలో మరో నాలుగు మోడళ్లు రానున్నాయి. డీఎస్‌కే మోటోవీల్స్ బెనెల్లితోపాటు కొరియాకు చెందిన హ్యోసంగ్ బైక్‌లను భారత్‌లో విక్రయిస్తోంది.
విస్తరణ దిశగా..: హైదరాబాద్‌తో కలిపి డీఎస్‌కే బెనెల్లి షోరూంలు దేశంలో 6 ఉన్నాయి. మరో 14 షోరూంలను ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం అయిదు మోడళ్లను విక్రయిస్తున్నారు. ఇవి 300 సీసీ మొదలుకుని 1,131 సీసీ వరకు ఉన్నాయి. గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 400కుపైగా బుకింగ్స్ నమోదయ్యాయి. 2015-16లో 3,000 బైక్‌లను విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా చేసుకుంది. ఇందులో 10% హైదరాబాద్ నుంచి ఆశిస్తోంది.
అలాగే హ్యోసంగ్ షోరూంలు 41 ఉన్నాయి. మరో 3 ఏర్పాటు చేస్తున్నారు. 6 రకాల మోడళ్లు 250 నుంచి 678 సీసీ వరకు ఉన్నాయి. గత మూడేళ్లలో 5,000 యూనిట్లు అమ్ముడయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3 వేల బైక్‌ల విక్రయం లక్ష్యంగా చేసుకుంది. పుణే సమీపంలోని ప్లాంటులో రెండు బ్రాండ్ల వాహనాలను అసెంబుల్ చేస్తున్నారు. 10 వేల యూనిట్లు అసెంబుల్ చేయగలిగే సామర్థ్యం ఈ ప్లాంటుకు ఉంది.
200-500 సీసీపైనే ఫోకస్..
రెండు బ్రాండ్లలోనూ 200-500 సీసీ సామర్థ్యం గల బైక్‌ల విక్రయాలపైనే ప్రధానంగా ఫోకస్ చేసినట్టు శిరీష్ తెలి పారు. ‘100-125 సీసీ బైక్‌లు నడిపినవారు 250 సీసీకి నేరుగా వెళ్తున్నారు. 150-200 సీసీ బైక్‌లను నడిపినవారు 300 సీసీ ఆపైన సామర్థ్యంగల మోడళ్లకు అప్‌గ్రేడ్ అవుతున్నారు.
250 సీసీ ఆపై సామర్థ్యంగల సూపర్ బైక్‌ల విపణి భారత్‌లో 50% వృద్ధితో 10,000 యూనిట్లుంది. మంచి బ్రాండ్లు, సూపర్‌బైక్‌ల పట్ల పెరుగుతున్న మోజు కారణంగా 2015-16లో ఈ సంఖ్య 15,000 యూనిట్లకు చేరుకుంటుంది’ అని ఆయన వివరించారు.