అందుబాటు ధరలో మెరుగైన వైద్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మారుమూల ప్రాంతాలకు కూడా తక్కువ వ్యయాలతో మెరుగైన వైద్యం అందించే దిశగా ఎప్పటికప్పుడు అధునాతన సేవలు అందుబాటులోకి తెస్తున్నామని హెల్త్‌కేర్ దిగ్గజం అపోలో గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి చెప్పారు. ఇందుకు ఉద్దేశించిన ఈ-ఐసీయూ సేవల గురించి శనివారం ఇక్కడ క్రిటికేర్ అపోలో 2014 సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ఆయన విలేకరులకు వివరించారు.
మారుమూల ప్రాంతాల ఆస్పత్రులను అపోలోకి అనుసంధానించడం ద్వారా అక్కడ చికిత్స పొందుతున్న వారికి స్పెషలిస్టు సర్వీసులను అందించేందుకు ఈ-ఐసీయూ తోడ్పడుతుందన్నారు. దీనివల్ల వీడియో కాన్పరెన్సింగ్ వంటి సదుపాయంతో పేషంటు ఆరోగ్య పరిస్థితిని అప్పటికప్పుడు అంచనా వేసి, స్థానిక వైద్యులకు తగు సలహాలు ఇచ్చేందుకు వీలవుతుందని చెప్పారు. ఫలితంగా పేషంట్లకు చికిత్స సమయం, వ్యయాలు కూడా గణనీయంగా తగ్గుతాయని ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రస్తుతం పైలట్ దశ కింద 50 పడకలను అనుసంధానించామని ఆయన వివరించారు. ఈ నెల 27న అపోలో 26వ వార్షికోత్సవం సందర్భంగా ఈ-ఐసీయూ సేవలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేగలమన్నారు. దీనికి ఫిలిప్స్ హెల్త్‌కేర్ సాంకేతిక సహకారం అందిస్తోందని వివరించారు. భారత్ కేవలం పర్యాటకానికి హబ్‌గా మాత్రమే కాకుండా హెల్త్‌కేర్ హబ్‌గా కూడా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. వైద్య సేవలు మెరుగవ్వాలంటే ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలే కాకుండా ప్రజల భాగస్వామ్యం కీలకమని ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. కేన్సర్ వంటి వాటిని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే చికిత్స వ్యయాలు గణనీయంగా తగ్గుతాయన్నారు.