సాక్షి ప్రతినిధి, చెన్నై: అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే ముఖ్యమంత్రి జయలలితను మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తరలించేందుకు మంత్రులు సిద్ధపడినా, తరువాత వెనక్కి తగ్గారని తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రామమోహన్‌రావు వెల్లడించారు. జయ మరణంపై విచారణ జరుపుతున్న కమిషన్‌కు ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఆరు నెలల తరువాత బహిర్గతమైంది. తమిళ దినపత్రికలు ఆ విషయాల్ని గురువారం ప్రముఖంగా ప్రచురించాయి. రిటైర్డు న్యాయమూర్తి ఆర్ముగస్వామి గత డిసెంబరు 21న రామమోహన్ రావును విచారించారు.
‘అత్యుత్తమ వైద్యం అందించేందుకు జయను విదేశాలకు తరలించాలని మంత్రులకు సూచించాను. ఈ విషయంపై వారు 4 రోజులు ఆలోచించి, ఆ తరువాత పూర్తిగా విస్మరించారు’ అని ఆయన వివరించారు. మంత్రులకు మరెక్కడి నుంచైనా అనుమతులు రావాల్సి ఉండే దా? అని కమిషన్ ప్రశ్నించగా తనకు తెలియద ని బదులిచ్చారు. ‘జయ పరిస్థితి విషమంగా ఉన్నట్లు 2016 డిసెంబరు 4న వైద్యులు చెప్పగానే ఆసుపత్రికి వెళ్లి చూడగా, ఆమె శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు. అదే రోజు రాత్రి 10.30 గంటలకు ఇక లాభం లేదని వైద్యులు తేల్చేశారు. ఇదంతా జరిగినప్పుడు అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆసుపత్రిలోనే ఉన్నారు’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment